అండమాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో భారీగా గ్యాస్ నిల్వలు..రెండో బావిలోనూ పరీక్షలు సక్సెస్: ఆయిల్ ఇండియా

అండమాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో భారీగా గ్యాస్ నిల్వలు..రెండో బావిలోనూ పరీక్షలు  సక్సెస్: ఆయిల్ ఇండియా

న్యూఢిల్లీ:   ప్రభుత్వ కంపెనీ  ఆయిల్ ఇండియా లిమిటెడ్ (ఓఐఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌), అండమాన్ సముద్రంలోని  శ్రీ విజయపురం-–3  బావి వద్ద భారీ సహజ వాయువు నిల్వలను కనుగొన్నట్లు  అధికారికంగా ప్రకటించింది. అండమాన్ బేసిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సంస్థకు ఇది రెండవ అతిపెద్ద విజయం. అంతకుముందు సెప్టెంబర్ 2025లో శ్రీ విజయపురం-–2 బావి ద్వారా మొదటిసారి గ్యాస్ నిల్వలను వెలికితీశారు. కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి  ఈ చారిత్రాత్మక విజయాన్ని సోషల్ మీడియా ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ద్వారా వెల్లడించారు. 

తాజాగా గ్యాస్ కనుగొన్న  బావి అండమాన్ దీవుల తూర్పు తీరానికి దాదాపు 15 కిలోమీటర్ల దూరంలో, 355 మీటర్ల నీటి లోతులో ఉంది. 1,900 మీటర్లకు పైగా లోతులో జరిపిన పరీక్షల్లో నిరంతరాయంగా గ్యాస్ మంటలు వచ్చాయి. శ్రీ విజయపురం బ్లాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తవ్విన మూడు బావుల్లో రెండు చోట్ల గ్యాస్ నిల్వలు బయటపడ్డాయి.  దీంతో ఈ ఏరియాలో భారీ స్థాయిలో హైడ్రోకార్బన్ రిజర్వ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు ఉన్నట్లు రుజువైంది. 

గతంలో కనుగొన్న విజయపురం-2 బావిలో 87శాతం స్వచ్ఛమైన మిథేన్  లభించింది.  హైడ్రోకార్బన్ రిసోర్స్ అసెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ స్టడీ (హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఏఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) ప్రకారం,  అండమాన్ బేసిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 270 కోట్ల బారెళ్ల చమురు, గ్యాస్ నిల్వలు (371 మిలియన్ మెట్రిక్ టన్నులు) ఉండొచ్చని అంచనా వేయగా, కేంద్ర మంత్రి పూరి మాత్రం ఇక్కడ ఏకంగా 1,160 కోట్ల బారెళ్ల ఇంధన నిల్వలు ఉండే అవకాశం ఉందని పేర్కొన్నారు.