రాజస్తాన్‌‌లో కొత్త గ్యాస్ ఫీల్డ్‌‌ కనుగొన్న ఆయిల్ ఇండియా

రాజస్తాన్‌‌లో కొత్త గ్యాస్ ఫీల్డ్‌‌ కనుగొన్న ఆయిల్ ఇండియా

న్యూఢిల్లీ: ప్రభుత్వ కంపెనీ ఆయిల్ ఇండియా లిమిటెడ్ రాజస్థాన్‌‌లోని జైసల్మేర్ జిల్లా దండేవాలా ఫీల్డ్‌‌లో నేచురల్ గ్యాస్‌‌ నిల్వలను కనుగొంది. ఈ ఫీల్డ్‌‌లోని తక్కువ లోతులో ఉండే 'సాను ఫార్మేషన్' అనే ఇసుక నేల నుంచి విజయవంతంగా గ్యాస్‌‌ను వెలికితీసింది.

రోజుకు దాదాపు 25 వేల స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ల గ్యాస్ ఉత్పత్తి అవుతుందని అంచనా. ఈ నేచురల్ గ్యాస్‌‌లో కార్బన్ డయాక్సైడ్ శాతం చాలా తక్కువగా ఉందని, క్వాలిటీ మెరుగ్గా ఉందని నిపుణులు తెలిపారు. కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి శనివారం ఎక్స్  వేదికగా ఈ విషయాన్ని ధృవీకరించారు.

దేశీయ ఇంధన ఉత్పత్తిని బలోపేతం చేయడానికి, దిగుమతులను తగ్గించుకునేందుకు  భారతదేశం చేస్తున్న ప్రయత్నాలలో ఇది ఒక మైలురాయి అని ఆయన పేర్కొన్నారు. 

ఈ ప్రాంతంలోని హైడ్రోకార్బన్ సామర్థ్యాన్ని అంచనా వేయడానికి ఆయిల్ ఇండియా ఇంజనీర్లు, జియోసైంటిస్టులు బాగా కష్టపడ్డారని, ఇప్పటికే భారతదేశ చమురు, గ్యాస్ రంగంలో రాజస్థాన్ కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు. తాజా విజయంతో జైసల్మేర్ బేసిన్‌‌కు ఆనుకుని ఉన్న పరిసర ప్రాంతాలలో అన్వేషణ, ఉత్పత్తి కార్యకలాపాలు మరింత వేగవంతం అవుతాయని ఇంధన నిపుణులు పేర్కొన్నారు.