గుడ్ న్యూస్.. త‌గ్గ‌నున్న పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు

గుడ్ న్యూస్.. త‌గ్గ‌నున్న పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు

వెరీ వెరీ గుడ్ న్యూస్ చెప్పబోతున్నాయి ఆయిల్ కంపెనీలు. ఏడాది కాలంలో స్థిరంగా ఉన్న పెట్రోల్, డీజిల్ రేట్లలో మళ్లీ కదలిక రాబోతుంది. ప్రస్తుతం ఉన్న ధరలను తగ్గించాలని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు నిర్ణయించాయి. ఈ నిర్ణయంతో.. త్వరలోనే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గనున్నాయి. దీనికి కారణం లేకపోలేదు. కొన్నాళ్లుగా ఆయిల్ కంపెనీలు నష్టాల్లో ఉన్నాయి. ఇప్పుడిప్పుడే లాభాల్లోకి వస్తున్నాయి. ఇటీవల ప్రకటించిన త్రైమాసిక ఫలితాల్లో ఆయిల్ కంపెనీల్లో గణనీయమైన ఆదాయం పొందాయి. నష్టాలు భారీగా తగ్గినట్లు ప్రకటించాయి. ఈ క్రమంలోనే.. ఆయిల్ కంపెనీలకు వస్తున్న లాభాలను దృష్టిలో పెట్టుకుని.. పెట్రోల్, డీజిల్ రేట్లను తగ్గించాలని నిర్ణయించాయి. 

ప్రస్తుతం హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ 109 రూపాయల 66 పైసలుగా ఉంటే.. డీజిల్ లీటర్ 97 రూపాయల 82 పైసలుగా ఉంది. 2022, మే 22వ తేదీ నుంచి ఈ ధరల్లో మార్పు లేదు. అంతకు ముందు అయితే రోజువారీ మార్పులు జరుగుతూ ఉండేవి. అంతర్జాతీయ చమురు ధరలకు అనుగుణంగా.. ప్రతిరోజూ పెట్రోల్, డీజిల్ ధరలు పెరగటం, తగ్గటం ఉండేది. ఏడాది కాలంలో స్థిరంగా ఉన్నాయి ధరలు. అంతర్జాతీయ చమురు ధరలతో సంబంధం లేకుండా.. ఆయిల్ కంపెనీలు ధరలను మార్చలేదు. 

ఈ క్రమంలోనే ఆయిల్ కంపెనీలు భారీగా లాభపడ్డాయి. నష్టాలను పూడ్చుకున్నాయి. ఇప్పుడు వస్తున్న లాభాలను.. ధరల తగ్గింపుతో వినియోగదారులకు బదిలీ చేయాలనే ఆలోచన చేస్తున్నట్లు.. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రకటించటం విశేషం. 

ఎప్పటి నుంచి ధరలు తగ్గిస్తారు అనేది మాత్రం ఇంకా ప్రకటించలేదు. ఏ తేదీ నుంచి అమలు చేస్తారు అనేది ఆసక్తిగా మారింది. పెట్రోల్, డీజిల్ ధరలు ఎంత తగ్గనున్నాయి అనేది రాబోయే మూడు, నాలుగు రోజుల్లో స్పష్టత వస్తుంది. మొత్తానికి అయితే మాత్రం పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గటం ఖాయం అనేది మాత్రం స్పష్టం అయ్యింది.