అమెరికా ఆంక్షలకు భయపడం: భారత్

అమెరికా ఆంక్షలకు భయపడం: భారత్
  • ప్రత్యామ్నాయ ప్రదేశాల నుంచి చమురు కొనుగోలు చేస్తం: భారత్​ 

న్యూఢిల్లీ: రష్యా చమురు కొనుగోలు చేసే దేశాలపై అమెరికా ఆంక్షలు విధిస్తుందన్న బెదిరింపును భారత్ తోసిపుచ్చింది. ప్రత్యామ్నాయ వనరుల నుంచి తమ అవసరాలను తీర్చుకోగలమన్న నమ్మకం ఉందని ప్రకటించింది. భారత్​ తన క్రూడ్ ఆయిల్ అవసరాలను ప్రత్యామ్నాయ మార్గాల నుంచి తీర్చుకోగలదని పెట్రోలియం, సహజవాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ గురువారం వెల్లడించారు. ఈ విషయంపై ఢిల్లీలో మంత్రి ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘‘మేము ఎలాంటి ఆందోళన చెందడం లేదు. ఒకవేళ ఏదైనా జరిగితే మేము దాన్ని సమర్థవంతంగా ఎదుర్కొంటాం’’ అని అన్నారు. భారత్ తన ఆయిల్ సరఫరా మార్గాలను మెరుగు పర్చుకుందని, 2007లో 27 దేశాల నుంచి దిగుమతి చేసుకునే స్థాయి నుంచి ప్రస్తుతం 40 దేశాల నుంచి దిగుమతి చేసుకుంటోందని ఆయన తెలిపారు. గయానా, బ్రెజిల్, కెనడా వంటి దేశాలు కొత్తగా సరఫరాదారులుగా అవతరిస్తున్నాయని, అలాగే ఇరాక్, సౌదీ అరేబియా, యూఏఈ వంటి సంప్రదాయ సరఫరాదారులు కూడా ఉన్నారని వివరించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ వారం ప్రారంభంలో రష్యా ఉక్రెయిన్‌‌తో 50 రోజుల్లో శాంతి ఒప్పందం కుదుర్చుకోకపోతే, రష్యన్ ఆయిల్ దిగుమతి చేసుకునే దేశాలపై ఆంక్షలు విధిస్తామని హెచ్చరించారు. 

100 శాతం టారిఫ్​లు విధిస్తం: నాటో సెక్రటరీ జనరల్

రష్యా నుంచి చమురు, గ్యాస్‌‌ కొనుగోలు చేస్తే వంద శాతం టారిఫ్​లు విధిస్తామని నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రూట్టే కూడా హెచ్చరించారు.  . చైనా అధ్యక్షుడు, భారత ప్రధాని, బ్రెజిల్‌‌ అధ్యక్షుడు ఎవరైనా సరే రష్యా నుంచి చమురు, గ్యాస్‌‌ కొనుగోలు చేస్తే తీవ్రంగా పరిగణిస్తామన్నారు. వంద శాతం సుంకాలు విధిస్తామని హెచ్చరించారు. ఈ బెదిరింపులను భారత్​ తోసిపుచ్చింది. తమ ఇంధన అవసరాలను సురక్షితం చేసుకోవడమే ప్రధాన ప్రాధాన్యత అని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు.