- మరో 3 నెలల్లో ఉత్పత్తికి సిద్ధం
- ప్రభుత్వ ప్రోత్సాహంతో రెండేండ్లలో పెరిగిన సాగు
- వచ్చే సీజన్ నుంచి ఇక్కడే క్రషింగ్ చేసేందుకు ఏర్పాట్లు
పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి జిల్లాలో కాల్వ శ్రీరాంపూర్ మండలం పెద్దరాత్పల్లిలో నిర్మిస్తున్న ఆయిల్ పామ్ ఇండస్ట్రీ పనులు వేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే 80 శాతం వరకు పనులు పూర్తయ్యాయి. మరో 3 నెలల్లో ఉత్పత్తి జరిగే అవకాశాలు ఉన్నట్లు అధికారులు చెప్తున్నారు. దీంతో జిల్లాలోని రైతులు ఆయిల్‌పామ్ తోటలు వేసేందుకు పెద్ద సంఖ్యలో ముందుకు వస్తున్నారు. జిల్లాలో ఇప్పటికే 4 వేల ఎకరాల్లో సాగు జరుగుతుండగా రెండేండ్లుగా పంటల దిగుబడి వస్తోంది. పంటను ఇదివరకు ఖమ్మం జిల్లా అశ్వరావుపేటకు తరలించే రైతులు ఇకపై ఇక్కడే అమ్ముకోవచ్చు.
ఏటా 50 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో..
వంట నూనెల వాడకం పెరిగిపోవడంతో విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. ఈ క్రమంలో తెలంగాణ సర్కార్ పామాయిల్ సాగుకు ప్రాధాన్యమిస్తూ రైతులకు డ్రిప్ఇరిగేషన్పై శిక్షణ ఇచ్చింది. ఎల్‌నినో కారణంగా వర్షాభావ పరిస్థితుల కారణంగా రైతులు పంట మార్పిడి చేసుకోవాలని ప్రభుత్వం సూచిస్తుండడంతో చాలా మంది రైతులు వరి కాకుండా ప్రత్యామ్నాయాల కోసం చూస్తున్నారు. ఆరుతడి పంటలు వేయడంతో పాటు ఆయిల్పామ్తోటలు పెంచాలని నిర్ణయించుకున్నారు. కాల్వశ్రీరాంపూర్మండలంలో 20 ఎకరాల విస్తీర్ణంలో దాదాపు రూ.100 కోట్లతో ఆయిల్పామ్ఫ్యాక్టరీ నిర్మాణం జరుగుతోంది. కొద్ది రోజుల్లోనే అందుబాటులోకి వచ్చే ఈ ప్యాక్టరీలో ఏటా 50 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో ఆయిల్ఉత్పత్తి చేయనున్నారు. దీంతో జిల్లా రైతులు ఆయిల్పామ్వేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.
పామాయిల్‌కే ఇంపార్టెన్స్
ప్రభుత్వం ఆయిల్‌పామ్ రైతులకు డ్రిప్ స్ప్రింక్లర్లను సబ్సిడీపై ఇచ్చేందుకు నిర్ణయించింది. ఆయిల్‌పామ్‌ను డ్రిప్‌ఇరిగేషన్ ద్వారా తక్కువ నీటితో సాగుచేయవచ్చు. ఆరుతడి పంటలు వేసే రైతులను ప్రోత్సహిస్తూ ప్రభుత్వం గతంలో కూడా డ్రిప్ స్ప్రింక్లర్లను సబ్సిడీపై అందజేసింది. ఇప్పుడు హార్టికల్చర్డిపార్ట్మెంట్ ప్రత్యేకంగా పామాయిల్ రైతులకు మాత్రమే సబ్సిడీ ఇస్తుండడంతో చాలా మంది రైతులు గతంలో సాగుచేసిన ఆరుతడి పంటలను పక్కన పెట్టి పామాయిల్ వైపు మొగ్గు చూపుతున్నారు. జిల్లాలో ఇప్పటి నుంచి ఏటా 4 వేల ఎకరాల్లో పామాయిల్సాగు చేయాలని అధికారులు ప్రణాళికలు రూపొందించారు. ఈ సంవత్సరం 3 వేల పైచిలుకు ఎకరాల్లో సాగు ప్రారంభం కాగా ఇందులో 1207 ఎకరాలో డ్రిప్ సాగు నడుస్తోంది. ప్రభుత్వం ప్రోత్సహకాలు అందిస్తుండడం, పంటపై రైతులకు అవగాహన కల్పిస్తుండడంతో సాగు చేసుకునేందుకు రైతులు ముందుకు వస్తున్నారు. దీంతో జిల్లాలో ఆయిల్ పామ్ సాగు మరింత పెరగనుంది.
