
జగిత్యాల జిల్లాలో ఇంటి ఆవరణలో ఈతవనం పెంచుతున్నాడు ఓ గీతకార్మికుడు. కల్లు గీసేందుకు అడవికి వెళ్లే అవసరం లేకుండా ఇంటినే ఈత వనంలా మార్చేశాడు. ప్రభుత్వం సాయమందిస్తే దాన్ని మరింత అభివృద్ధి చేస్తానంటున్నాడు.
గంగారం గీత కార్మికుడు
జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం మోహన్ రావు పేట గ్రామానికి చెందిన గంగారం గీత కార్మికుడు. 30 ఏళ్లుగా కులవృత్తి చేసుకుంటున్నాడు. రోజూ గ్రామానికి నాలుగైదు కిలోమీటర్ల దూరంలోని అడవి ప్రాంతంలో ఉన్న ఈత చెట్ల నుంచి కల్లు తీసి అమ్ముతూ జీవనం సాగిస్తున్నాడు. గతంలో ఊరి దగ్గరలోని పట్టా భూములలో ఈత చెట్లు ఉండేవి. భూ యజమానులు రియల్ ఎస్టేట్ కోసం కొందరు, వ్యవసాయం కోసం మరికొందరు చెట్లను నరికేసి చదును చేశారు. దీంతో గ్రామానికి దూరంగా ఉన్న ఈత చెట్లే గీత కార్మికులకు ఆధారమయ్యాయి.
గంగారంకు ఇబ్బంది
వయోభారం వల్ల అటవి ప్రాంతంలోని ఈత వనానికి వెళ్లడం గంగారంకు ఇబ్బందిగా మారింది. దీంతో తన ఇంటి ఆవరణంలోని ఆరు గుంటల భూమిలో మూడేళ్ల కిందట 170 ఈత చెట్లను నాటి పెంచుతున్నాడు. ఈ ఈత చెట్లు కల్లు తీయడానికి ఇంకా నాలుగేళ్లు పడుతుంది. అప్పుడు అడవిలోకి వెళ్లకుండా ఇంటి దగ్గరే కల్లు తీసి అమ్ముకోవచ్చని గంగారం అంటున్నాడు.