కాచిగూడ ఎస్సీ హాస్టల్ ను వెంటనే తెరవాలి.. పూర్వ, ప్రస్తుత విద్యార్థులు డిమాండ్

కాచిగూడ ఎస్సీ హాస్టల్ ను వెంటనే తెరవాలి.. పూర్వ, ప్రస్తుత విద్యార్థులు డిమాండ్

బషీర్ బాగ్,- వెలుగు: కాచిగూడ నింబోలిఅడ్డలోని ఎస్సీ హాస్టల్ ను మళ్లీ తెరవాలని పూర్వ, ప్రస్తుత విద్యార్థులు డిమాండ్ చేశారు. హాస్టల్లో చదువుకున్న ఎంతో మంది విద్యార్థుల్లో డిప్యూటీ సీఎంలు, ఎంపీలు, ఐపీఎస్, ఐఏఎస్, ఇతర ప్రజాప్రతినిధులు అయ్యారని, ప్రస్తుతం మంచి స్థానాల్లో ఉన్నారని, వారంతా స్పందించి హాస్టల్ కు కొత్త బిల్డింగ్ నిర్మించేందుకు కృషి చేయాలని కోరారు.

ఆదివారం హాస్టల్ ముందు ధర్నా చేసిన అనంతరం మీడియాతో పూర్వ విద్యార్థులు రుద్రవరం లింగస్వామి, సంగమేశ్వర్, గిరి, రామ్మూర్తి మాట్లాడారు. హాస్టల్ సొంత బిల్డింగ్ శిథిలావస్థకు చేరిందనే కారణంతో విద్యార్థులను ఇతర హాస్టళ్లకు తరలించి మూసివేశారని పేర్కొన్నారు. సొంత భవనం వదిలిపెట్టి, అద్దె భవనాల్లో హాస్టల్​ను నడపడం ఏంటని ప్రశ్నించారు. కాసుల కక్కుర్తి కోసమే ప్రైవేట్ భవనాల్లో హాస్టళ్లు నడిపిస్తున్నారని వారు ఆరోపించారు. ధర్నాలో కిరణ్, చారి, జగదీశ్​, రాము, గోవిందు, గణేశ్,రమేశ్, నవీన్ పాల్గొన్నారు.