జగిత్యాల టౌన్, వెలుగు : ముగ్గురు కొడుకులకు నాలుగు ఎకరాలు ఇచ్చినా.. నాలుగు మెతుకులు కూడా పెట్టడం లేదంటూ జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం ముంజంపల్లికి చెందిన వృద్ధురాలు గాజుల లచ్చమ్మ సోమవారం ప్రజావాణిలో ఆవేదన వ్యక్తం చేసింది. బాధితురాలు లచ్చమ్మ మాట్లాడుతూ తాను, తన భర్త రాజాం కలిసి జీవితాంతం కష్టపడి నాలుగు ఎకరాలు సంపాదించామని, ఆ భూమిని ముగ్గురు కొడుకులకు ఇచ్చామని చెప్పింది.
ఇప్పుడు వృద్ధాప్యంలో ఉన్న తమకు కనీసం తిండి కూడా పెట్టకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఆరోగ్యం బాగున్న రోజుల్లో కూలి పనులకు వెళ్లి వచ్చిన దానితో కడుపు నింపుకుంటున్నామని, పని చేయలేని రోజుల్లో ఉపాసం ఉంటున్నామని భావోద్వేగానికి గురైంది. తాము సంపాదించిన భూమిని కౌలుకు ఇద్దామంటే.. కౌలు చేసేందుకు వచ్చిన వారిని తన కొడుకులు అడ్డుకుంటున్నారని ఆరోపించింది. తనకు, తన భర్తకు బుక్కెడు బువ్వ పెట్టేలా ఆఫీసర్లు చర్యలు తీసుకోవాలని వేడుకుంది. స్పందించిన ఆఫీసర్లు విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
