ఆటలొద్దని కొట్టా.. ఇప్పుడు దేశం గర్వించేలా చేశాడు: కన్నీళ్లతో తండ్రి మాటలు

ఆటలొద్దని కొట్టా.. ఇప్పుడు దేశం గర్వించేలా చేశాడు: కన్నీళ్లతో తండ్రి మాటలు

భోపాల్: అది మారుమూల పల్లెటూరు.. అక్కడ ఒక నిరుపేద కుటుంబంలో ఓ రెబెల్ పిల్లగాడు పుట్టాడు. కానీ ఆ తండ్రికి ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు. పిల్లలు చదువుకుంటేనే మంచి భవిష్యత్తు ఉంటుందని అందరు తల్లిదండ్రుల్లానే ఆయన కూడా నమ్మాడు. కానీ వారిలో ఒక కొడుకు మాత్రం తండ్రి, టీచర్లు ఎంత చెప్పినా వినేవాడు కాదు. ఎప్పుడూ ఆటల్లోనే బిజీగా ఉండేవాడు. దీంతో కోపం వచ్చి తండ్రి చాలా సార్లు ఆటలు వద్దు రా.. బాగా చదువుకో అంటూ చెంప పగలగొట్టిన సందర్భాలు ఉన్నాయి. అయినా ఆ పిల్లోడు వినలేదు.. నాడు మొండిగా ఆటలు ఆడిన ఆ పిల్లాడే దేశం మొత్తం గర్వించేలా చేశాడని పొంగిపోతూ చెబుతున్నాడు ఆ తండ్రి. నాడు తాను కొట్టినందుకు బాధపడుతున్నానని భావోద్వేగానికి గురయ్యాడు. ఇంతకీ ఆ పిల్లాడు ఎవరా అనుకుంటున్నారా.. 41 ఏండ్ల తర్వాత సరికొత్త చరిత్రను సృష్టిస్తూ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన పురుషుల హాకీ టీమ్‌లో ఒకడైన వివేక్ సాగర్ ప్రసాద్‌.

ఆటలు తిండి పెట్టవని తిట్టా..

మధ్యప్రదేశ్‌లోని మారుమూల ప్రాంతమైన చాందోన్ గ్రామంలో పుట్టాడు వివేక్ సాగర్ ప్రసాద్. 21 ఏండ్ల ఈ కుర్రాడు ఇప్పుడు ఒక్క తన తల్లిదండ్రులకే కాక.. మొత్తం దేశానికే గర్వకారణంగా నిలిచాడు. టోక్యో ఒలింపిక్స్‌లో హాకీ మెన్స్‌ టీమ్‌లో తన వంతుగా జట్టుతో కలిసి పోరాడి భారత్ ఖాతాలో కాంస్య పతకాన్ని వేశాడు. వివేక్ తండ్రి రోహిత్ సాగర్ ప్రసాద్ ఒక మామూలు ప్రైమరీ స్కూల్ టీచర్. ఆయనకు నలుగురు పిల్లలు. ఇద్దరు అమ్మాయిలు. ఇద్దరు అబ్బాయిలు. నలుగురిలోనూ వివేక్ సాగర్ చిన్నవాడు. చిన్నప్పుడు అందరి తండ్రుల మాదిరిగానే వివేక్ నాన్న కూడా చదువు చదువు అంటూ పిల్లల వెంటపడేవాడు. కానీ వివేక్  మనసు మాత్రం ఆటలపైనే ఉండేది. ఖాళీ టైమ్‌ దొరికితే హాకీ స్టిక్ పట్టుకుని గ్రౌండ్‌లో కనిపించేవాడు. దీంతో ఆటలు తిండి పెట్టవు రా అంటూ తాను అనేకసార్లు తిట్టానని తండ్రి రోహిత్ చెబుతున్నాడు. ఒక టీచర్‌‌గా తాను ఎప్పుడూ మంచి మార్కులు వస్తేనే పిల్లాడికి భవిష్యత్తు బాగుంటుందని నమ్మేవాడినని అంటున్నాడు. వివేక్ హాకీ ఆడకుండా అడ్డుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేశానని, కానీ తన బిడ్డ ఎప్పుడూ తన కలను వదిలిపెట్టలేదని, దేశానికి ఆడాలన్న కోరికను నెరవేర్చుకున్నాడని అన్నాడు. చిన్నప్పుడు ఆటలొద్దని ఎంత చెప్పినా వినకపోవడంతో చాలా సార్లు చెంప చెళ్లుమనిపించిన సందర్భాలు కూడా ఉన్నాయని ఇప్పుడు బాధపడుతూ చెప్పుకొస్తున్నాడు.

చెంప దెబ్బల నుంచి కాపాడిన అక్కలు, అన్న

కొట్టినా సరే వివేక్ ఇంటి వెనుక డోర్ నుంచి వెళ్లడం లాంటివి చేసేవాడని, నాన్న చెంప దెబ్బల నుంచి అక్కలు, అన్న కాపాడుతూ కవర్ చేసేవాళ్లని కుటుంబసభ్యులు తెలిపారు. కాలేజీ రోజుల్లో కూడా మధ్యప్రదేశ్ హాకీ అకాడమీలో ట్రైనింగ్ తీసుకునేందుకు తన తండ్రి ఒప్పుకోలేదని వివేక్ అక్క పూజా ప్రసాద్ చెప్పింది. చదువులు, అకాడమీ ట్రైనింగ్ ఖర్చులు భరించలేనని నాన్న గట్టిగా చెప్పేశాడని, హాకీలో నిలదొక్కుకోలేకపోతే తాను చూసుకుంటానని అన్న విద్యా సాగర్ చెప్పడంతో చివరికి ఒప్పుకొన్నాడని, 17 ఏండ్ల వయసులోనే ఇండియా టీమ్‌లో ఆడిన రెండో ప్లేయర్‌‌గా వివేక్ రికార్డు సృష్టించాడని ఆమె చెప్పింది.

నాడు కొట్టినందుకు కన్నీళ్లు ఆగలే..

ఒలింపిక్స్‌ కాంస్య మెడల్ మ్యాచ్‌లో జర్మనీపై మన టీమ్ ఆడుతుండగా మొన్న చాందోన్‌ గ్రామంలో ఉన్న జనాల్లో చాలా మంది వివేక్ ఇంట్లోనే టీవీలకు అతుక్కుపోయారు. మ్యాచ్ గెలిచి మెడల్ ఖాయం అయ్యాక అందరూ కంగ్రాట్స్ చెబుతుంటే తనకు ఎమోషన్‌లో కన్నీళ్లు ఆగలేదని, చిన్నప్పుడు వివేక్‌ను కొట్టిన దెబ్బలే గుర్తొచ్చాయని రోహిత్ సాగర్ ప్రసాద్ చెప్పారు. నాడు తాను కొట్టినా మాట వినకుండా ఆటలపైనే తన దృష్టి పెట్టిన తన కొడుకు ఈ రోజు దేశం మొత్తం గర్వించేలా చేశాడని అన్నాడు. తన బిడ్డ నిజంగా రత్నం అంటూ రోహిత్ మురిసిపోతున్నాడు. కాగా, హాకీ టీమ్‌ గెలుపు తర్వాత వివేక్ సాగర్ ప్రసాద్‌కు మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కోటి రూపాయల ప్రైజ్ మనీ ప్రకటించారు.

 

మరిన్ని వార్తలు