ఆటతో ఆకాశమంత ఎత్తుకు.. హత్యకేసుతో పాతాళానికి

ఆటతో ఆకాశమంత ఎత్తుకు.. హత్యకేసుతో పాతాళానికి

సుశీల్‌‌ కుమార్. వరల్డ్‌‌ రెజ్లింగ్‌‌లో అతనో ఐకాన్. ఇండియా స్పోర్ట్స్ హిస్టరీలోని గొప్ప అథ్లెట్లలో ఒకడు. ఒలింపిక్స్‌‌లో ఇండియాకు రెండు ఇండివిడ్యువల్ మెడల్స్‌‌ అందించిన ఏకైక అథ్లెట్‌‌గా ఘన చరిత్ర అతడి సొంతం. రెజ్లింగ్‌‌ వరల్డ్‌‌ చాంపియన్‌‌గా నిలిచిన తొలి ఇండియన్‌‌​గా ఘన కీర్తి. కుస్తీ పేరు చెబితేనే తన పేరే గుర్తొచ్చేలా చేసిన ఘనత. తన ఆటతో పాటు వ్యక్తిత్వంతోనూ ఇండియన్‌‌ రెజ్లింగ్‌‌కు ముఖచిత్రంగా మరి ఆకాశమంత ఎత్తుకు ఎదిగిన సుశీల్‌‌ కుమార్ పాతాళానికి పడిపోయాడు. 
మట్టి నుంచి మ్యాట్‌‌పైకి మారిన పురాతన ఆట కుస్తీకి దేశంలో విశేష ఆదరణ తెచ్చిపెట్టి.. దేశవ్యాప్తంగా ఎంతో మంది యంగ్‌‌స్టర్స్‌‌ రెజ్లింగ్‌‌ను ప్రొఫెషన్‌‌గా ఎంచుకునేలా చేసిన సుశీల్‌‌ ఖ్యాతి మసకబారింది. ఎన్నో పతకాలు అందుకొని పోడియంపై గర్వంగా నిల్చున్న అతను ఇప్పుడు  ఓ యువ రెజ్లర్​ హత్య కేసులో కటకటాల వెనక్కువెళ్లి తలదించుకున్నాడు. తాను ఓఎస్డీగా ఉన్న ఢిల్లీ ఛత్రసాల్‌‌ స్టేడియంలో జరిగిన ఈ హత్య తర్వాత  19 రోజులు పరారీలో ఉన్న సుశీల్‌‌ను ఢిల్లీ పోలీసులు ఎట్టకేలకు ఆదివారం జలంధర్​లో అరెస్ట్‌‌ చేశారు. రెండు ఒలింపిక్‌‌ మెడల్స్‌‌, మూడు కామన్వెల్త్‌‌ గేమ్స్‌‌, ఓ వరల్డ్‌‌ చాంపియన్‌‌షిప్‌‌ గోల్డ్‌‌, 4 ఏషియన్‌‌ చాంపియన్‌‌షిప్‌‌ మెడల్స్‌‌ సాధించి  ఇండియాలో రెజ్లింగ్‌‌కు స్టార్​డమ్‌‌ తెచ్చిన సుశీల్  సరిగ్గా వరల్డ్‌‌ రెజ్లింగ్ డే నాడు అరెస్ట్‌‌ అవ్వడం అతని పతనం అనొచ్చు.


హత్య కేసులో అరెస్ట్‌‌‌‌ వారెంట్, లుకౌట్‌‌‌‌ నోటీసులు, ఆచూకి చెబితే రూ. లక్ష నజరానా, ముందస్తు బెయిల్‌‌‌‌ పిటిషన్‌‌‌‌ కొట్టివేత.. ఇలా గత పదిహేను రోజులుగా వార్తల్లో నిలిచిన స్టార్ రెజ్లర్​ సుశీల్‌‌‌‌ కుమార్​ పోలీసులకు చిక్కాడు. ఆటతో తాను ఓనమాలు నేర్చుకొని, చాంపియన్‌‌‌‌గా మారి, మరెందరినో తీర్చిదిద్దుతున్న ఢిల్లీ ఛత్రసాల్‌‌‌‌ స్టేడియంలో యంగ్‌‌‌‌ రెజ్లర్​ సాగర్​ ధాంకర్​హత్య కేసులో సుశీల్‌‌‌‌ అరెస్ట్‌‌‌‌ అవడం ఇండియన్‌‌‌‌ స్పోర్ట్స్‌‌‌‌ హిస్టరీలోనే అనూహ్య పరిణామం అనొచ్చు. రెండు  దశాబ్దాల క్రితం ఇండియన్‌‌‌‌ క్రికెట్‌‌‌‌ను కుదిపేసిన మ్యాచ్‌‌‌‌ ఫిక్సింగ్‌‌‌‌ ఉదంతం తర్వాత ఆటకే  చెడ్డ పేరు తెచ్చిన ఘటన ఇది. ఇండియన్‌‌‌‌ రెజ్లింగ్‌‌‌‌పై చెరగని ముద్రవేసిన ఓ లెజెండ్‌‌‌‌ ఇన్వాల్వ్‌‌‌‌ అవడంతో ప్రభావం ఎక్కువగా ఉంది. 

అలాంటి సుశీల్...

తన హవా నడిచిన టైమ్‌‌‌‌లో సుశీల్‌‌‌‌ స్టార్​డమ్‌‌‌‌, అతని ఫ్యాన్‌‌‌‌ ఫాలోయింగ్‌‌‌‌ చూసిన వాళ్లకు అతను ఆటకు మించి ఎదిగాడని అనిపించేది. ఢిల్లీలోని బప్రోలా గ్రామంలోని  సాధారణ కుటుంబం నుంచి వచ్చిన ఈ పహిల్వాన్‌‌‌‌.. తన మామ, 1982 ఏషియన్‌‌‌‌ గేమ్స్‌‌‌‌ చాంపియన్‌‌‌‌ సత్పాల్‌‌‌‌ సింగ్‌‌‌‌ స్ఫూర్తితో రెజ్లింగ్‌‌‌‌లోకి వచ్చాడు. తక్కువ కాలంలోనే ఆటలో దూసుకెళ్లాడు. షూటర్​అభినవ్‌‌‌‌ బింద్రా హిస్టారికల్‌‌‌‌ గోల్డ్‌‌‌‌, బాక్సర్​ విజేందర్​ సింగ్‌‌‌‌ బ్రాంజ్‌‌‌‌ మెడల్‌‌‌‌ నెగ్గిన 2008 బీజింగ్‌‌‌‌ ఒలింపిక్స్‌‌‌‌లో ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన సుశీల్‌‌‌‌ కాంస్య పతకంతో  అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఆపై, 2012 లండన్‌‌‌‌ ఒలింపిక్స్‌‌‌‌లో సిల్వర్ మెడల్‌‌‌‌తో హిస్టరీ క్రియేట్‌‌‌‌ చేయడంతో అతని స్టార్​డమ్‌‌‌‌ అమాంతం పెరిగింది. ఆ తర్వాత సుశీల్‌‌‌‌ ఏ ఈవెంట్‌‌‌‌కు గెస్ట్‌‌‌‌గా వెళ్లినా అభిమానులు పోటెత్తేవారు. ఎంతో ప్రేమతో అతనికి  నెయ్యి డబ్బాలు, బాదం ప్యాకెట్లు గిఫ్ట్‌‌‌‌గా ఇచ్చేవాళ్లు. దీనికి తోడు సుశీల్‌‌‌‌ చాలా హుందాగా, మర్యాదగా ఉండేవాడు. అందరితో ప్రేమగా మాట్లాడేవాడు. తానో స్టార్​ను, లెజెండ్‌‌‌‌ను అన్న గర్వం కనిపించేది కాదు. అలాంటి వ్యక్తి పోలీసుల మధ్య ముఖం దాచుకొని మీడియా ముందుకురావడాన్ని ఫ్యాన్స్‌‌‌‌ జీర్ణించుకోలేకపోతున్నారు.

స్వయంకృతమే!

క్లీన్‌‌‌‌ ఇమేజ్‌‌‌‌ ఉన్నప్పటికీ సుశీల్‌‌‌‌ ఇది వరకే కొన్ని వివాదాల్లో చిక్కుకున్నాడు. తన వెయిట్‌‌‌‌ కేటగిరీలో రియో ఒలింపిక్స్‌‌‌‌కు క్వాలిఫై అయిన తోటి రెజ్లర్​నర్సింగ్‌‌‌‌ యాదవ్‌‌‌‌  డోపీగా తేలడంలో కుట్ర చేశాడన్న ఆరోపణలు ఎదుర్కొన్నాడు.  2017లో ఢిల్లీలో జరిగిన కామన్వెల్త్‌‌‌‌ గేమ్స్ (2018) ట్రయల్స్‌‌‌‌ సందర్భంగా  స్టేడియం బయట రెజ్లర్​పర్వీన్‌‌‌‌ రాణాపై సుశీల్‌‌‌‌ అనుచరులు దాడి చేయడం అప్పట్లో సంచలనంగా మారింది. అలాగే, సుశీల్ ప్రెసిడెంట్‌‌‌‌గా ఉన్న స్కూల్‌‌‌‌ గేమ్స్‌‌‌‌ ఫెడరేషన్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ఇండియా (ఎస్‌‌‌‌జీఎఫ్‌‌‌‌ఐ) అనేక వివాదాలతోపాటు, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటోంది. రాణా హత్య జరిగిన ఢిల్లీ ఛత్రసాల్‌‌‌‌ స్టేడియానికి 2016 నుంచి సుశీల్‌‌‌‌ ఓఎస్డీగా ఉన్నాడు.  సుశీల్‌‌‌‌ ఫ్యామిలీ కనుసన్నల్లో నడుస్తున్న ఈ స్టేడియం గ్యాంగ్‌‌‌‌స్టర్స్‌‌‌‌, రౌడీ షీటర్లకు అడ్డగా మారిందన్న ఆరోపణలు ఉన్నాయి. ఇవన్నీ ఒకెత్తయితే ఓ హత్య కేసులో సుశీల్‌‌‌‌ ఇన్వాల్వ్‌‌‌‌ అయ్యాడన్న విషయాన్ని చాలా మంది నమ్మలేకపోతున్నారు.  చాన్నాళ్లుగా సుశీల్‌‌‌‌ను చూస్తున్న వాళ్లు అతనిది స్వయంకృతమే అంటున్నారు. పోలీసులు తన కోసం వారెంట్‌‌‌‌ జారీ చేసినప్పటి నుంచి తప్పించుకోవడం, ముందస్తు బెయిల్‌‌‌‌ కోసం కోర్టును ఆశ్రయించడం, దాన్ని కోర్టు కొట్టివేయడం, లుకౌట్‌‌‌‌ నోటీసులు, నాన్‌‌‌‌ బెయిలబుల్‌‌‌‌ వారెంట్, ఆచూకీ చెబితే రూ. లక్ష నజరాన ఇస్తామన్న పోలీసుల ప్రకటన అతని ఇమేజ్‌‌‌‌ను దెబ్బతీశాయి. ఈ పరిణామాలన్నీ చూస్తే సుశీల్‌‌‌‌ తప్పు చేశాడనే భావన కలుగుతోంది. అయితే ఛత్రసాల్‌‌‌‌ స్టేడియంలో గొడవ బయటి వ్యక్తుల పని అని సుశీల్‌‌‌‌ అంటున్నాడు. లెజెండరీ రెజ్లర్​పై కుట్ర జరుగుతోందని అతని సన్నిహితులు ఆరోపిస్తున్నారు. మరోవైపు తన వ్యాపారాల కోసం సుశీల్‌‌‌‌ గ్యాంగ్‌‌‌‌స్టర్స్‌‌‌‌తో  సంబంధాలు ఏర్పరచుకున్నాడన్న వార్తలు వస్తున్నాయి. ఇన్నాళ్లు పోలీసులకు చిక్కకుండా కాపాడింది వాళ్లే అన్న అభిప్రాయాలున్నాయి. ఇది నిజమో కాదో పోలీసులు తేల్చాల్సినప్పటికీ ఓ స్పోర్ట్స్​ ఐకాన్‌‌‌‌కు క్రిమినల్‌‌‌‌ గ్యాంగ్‌‌‌‌తో పనేంటి?. చెడు స్నేహాల వల్లే సుశీల్‌‌‌‌కు ఈ పరిస్థితి వచ్చిందని పలువురు ఆరోపిస్తున్నారు. తన ఆటతో  ఓ తరానికి స్ఫూర్తిగా నిలిచిన వ్యక్తికి ఎవరితో స్నేహం చేయాలో తెలియదా?  మొత్తంగా ఛత్రసాల్‌‌‌‌ స్టేడియంలో ఏం జరిగింది? హత్యలో సుశీల్‌‌‌‌ హస్తం ఉందా? అన్నది తేల్చాల్సింది పోలీసులు, న్యాయస్థానమే. దానికి కాస్త సమయం పట్టొచ్చు. కానీ, పోలీసులకు దొరకకుండా తప్పించుకున్న ఇండియా గ్రేటెస్ట్‌‌‌‌ ఒలింపియన్ సరైన దారిని ఎంచుకోలేదన్నది మాత్రం నిజం. తప్పు చేయకుంటే పారిపోవడం ఎందుకు? అని అంతా ప్రశ్నిస్తున్నారు.  సుశీల్‌‌‌‌పై వచ్చిన ఆరోపణలతోనే ఇండియన్ రెజ్లింగ్‌‌‌‌ పేరు చెడిపోయిందని స్వయంగా రెజ్లింగ్‌‌‌‌ ఫెడరేషన్‌‌‌‌ ఆవేదన వ్యక్తం చేసింది. మొత్తంగా ఈ ఎపిసోడ్‌‌‌‌ మిగతా స్టార్​ ప్లేయర్లు, వర్థమాన ఆటగాళ్లకు గుణపాఠం అనొచ్చు. తమ జీవితాలను, ఆటను నాశనం చేసే వివాదాలకు దూరంగా ఉండటం నేర్చుకోవాలి.

ఆరు రోజుల పోలీసు కస్టడీకి సుశీల్

న్యూఢిల్లీ: మాజీ జూనియర్​ నేషనల్‌‌ చాంపియన్‌‌ సాగర్ ధాంకర్‌‌  హత్య కేసులో  స్టార్​ రెజ్లర్ సుశీల్‌‌కుమార్, అతని ప్రధాన అనుచరుడు అజయ్‌‌ కుమార్​ను ఆరో రోజుల పోలీసు కస్టడీకి తరలించారు.  ఢిల్లీ పోలీసులు ఈ ఇద్దరికీ 12 రోజుల కస్టడీ కోరినప్పటికీ రోహిణి కోర్టు ఆరు రోజులే మంజూరు చేసింది. ఢిల్లీ పోలీసులు సుశీల్‌‌, అజయ్‌‌ను ఆదివారం ఉదయం అరెస్టు చేశారు. హత్య తర్వాత తప్పించుకొని హరిద్వార్, మీరట్, బహదుర్​గఢ్​, చండీగఢ్​లో తలదాచుకుని  ఖర్చుల కోసం ఓ వ్యక్తి వద్ద డబ్బులు తీసుకునేందుకు బయటకు వచ్చిన ఈ ఇద్దరూ పోలీసులకు చిక్కారు. అనంతరం కోర్టు ఆవరణలోనే వీళ్లను విచారించారు. ఈ నెల 4న ఛత్రసాల్‌‌ స్టేడియం కాంప్టెక్స్‌‌లో 23 ఏళ్ల సాగర్​, మరో ఇద్దరిపై సుశీల్‌‌ అతని అనుచరులు దాడి చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. దాడిలో  గాయపడ్డ సాగర్​ తర్వాతి రోజు మృతి చెందాడు. అపార్ట్‌‌మెంట్‌‌ అద్దె విషయంలో గొడవతో పాటు  సుశీల్‌‌ గురించి తప్పుగా మాట్లాడిన సాగర్‌‌కు బుద్ది చెప్పాలనే దాడి చేశారని పోలీసులు చెప్పారు. దాడి జరిగినప్పుడు తాను స్టేడియం ప్రాంగణంలోనే ఉన్నానని సుశీల్‌‌ కోర్టులో అంగీకరించాడు. 

రెజ్లింగ్‌‌‌‌కు చెడ్డపేరు.. నిజం తెలియాలి..    సుశీల్‌‌‌‌ అరెస్ట్‌‌‌‌పై స్పోర్ట్స్‌‌‌‌ ఫెటర్నటీ మిశ్రమ స్పందన

న్యూఢిల్లీ : టాప్‌‌‌‌ రెజ్లర్‌‌‌‌ సుశీల్‌‌‌‌ కుమార్‌‌‌‌.. ఓ హత్య కేసులో అరెస్ట్‌‌‌‌ అవ్వడంపై ఇండియన్‌‌‌‌ స్పోర్ట్స్‌‌‌‌ ఫెటర్నిటీ తీవ్ర నిరాశ వ్యక్తం చేసింది. ‘ఇండియన్‌‌‌‌ స్పోర్ట్స్‌‌‌‌కు సుశీల్‌‌‌‌ చేసిన దానిని ఎప్పటికీ మార్చలేము.  అసలు నిజమేంటో బయటికి రావాలి. జరిగిన ఘటనపై నేను కామెంట్‌‌‌‌ చేయదలుచుకోలేదు. ఈ సిచ్యువేషన్‌‌‌‌లో ఇంతకంటే ఎక్కువ మాట్లాడాలని లేదు’ అని బీజింగ్‌‌‌‌ ఒలింపిక్స్‌‌‌‌లో సుశీల్‌‌‌‌తో పాటు మెడల్‌‌‌‌ సాధించిన బాక్సర్‌‌‌‌ విజేందర్‌‌‌‌ సింగ్‌‌‌‌ అన్నాడు. సుశీల్‌‌‌‌ నిజంగా తప్పు చేసి ఉంటే అది ఇండియన్‌‌‌‌ స్పోర్ట్స్‌‌‌‌కే మాయని మచ్చగామిగులుతుందని టేబుల్‌‌‌‌ టెన్నిస్‌‌‌‌ టాప్​ ప్లేయర్‌‌‌‌ ఆచంట శరత్‌‌‌‌ కమల్‌‌‌‌ అన్నాడు. 

‘సుశీల్‌‌‌‌ నిజంగా తప్పు చేసుంటే అది చాలా దురదృష్టకరం. ఈ ఘటన ఇండియన్‌‌‌‌ స్పోర్ట్స్‌‌‌‌ చరిత్రలోనే  ఓ మచ్చగా మిగిలిపోతుంది.  ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచిన సుశీల్​ ఇలాంటి ఘటనలో ఉండటం చాలా బాధాకరం.జరిగిన దాంట్లో సుశీల్‌‌‌‌ పాత్ర ఉంటే అది రెజ్లింగ్‌‌‌‌తోపాటు ఇతర అథ్లెట్లపై కూడా చెడు ప్రభావం చూపుతుంది’ అని శరత్‌‌‌‌ కమల్‌‌‌‌ అభిప్రాయపడ్డాడు. అయితే, సుశీల్‌‌‌‌ తప్పు చేశాడా లేదా అనేది పోలీసుల దర్యాప్తులో తేలుతుందని, మొత్తం వ్యవహారం రెజ్లింగ్‌‌‌‌ ప్రతిష్ఠను దెబ్బ తీసిందని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ టాప్‌‌‌‌ రెజ్లర్‌‌‌‌ అన్నాడు. కాగా, సుశీల్‌‌‌‌ ఘటన రెజ్లింగ్‌‌‌‌ ప్రతిష్ఠను తాత్కాలికంగా దెబ్బతీస్తుందని ఓ ప్రముఖ బ్యాడ్మింటన్‌‌‌‌ ప్లేయర్‌‌‌‌ పేర్కొన్నారు. ‘ సుశీల్‌‌‌‌ టాప్‌‌‌‌ అథ్లెట్‌‌‌‌ కాబట్టి.. ఈ కేసు వల్ల రెజ్లింగ్‌‌‌‌కు చెడ్డ పేరు వస్తుంది. కానీ ఆట ముందు అది శాశ్వతం కాదు. క్రికెట్‌‌‌‌లో మ్యాచ్‌‌‌‌ ఫిక్సింగ్, స్పాట్‌‌‌‌ ఫిక్సింగ్‌‌‌‌ వంటివి మనం చూశాం.  కానీ స్పోర్ట్‌‌‌‌ ఆగలేదు. ఆట కంటే ఏదీ గొప్పది కాదు’ అని ఆ షట్లర్‌‌‌‌ తెలిపారు.