తాలిబన్లతో భారత్ చర్చలపై ఒమర్ అబ్దుల్లా ఆగ్రహం

తాలిబన్లతో భారత్ చర్చలపై ఒమర్ అబ్దుల్లా ఆగ్రహం

భారత రాయబారి.. తాలిబన్లతో మంగళవారం చర్చలు జరపడంపై నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ నేత ఒమర్ అబ్దుల్లా తీవ్రంగా విమర్శించారు. తాలిబన్లను టెర్రరిస్టులుగా పరిగణిస్తున్నారా లేదంటే మరింకే రకంగానైనా చూస్తున్నారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం కశ్మీర్‌లో నిర్వహించిన ఓ మీడియా సమావేశంలో మాట్లాడిన ఒమర్.. కేంద్ర ప్రభుత్వ వైఖరిని తప్పుపట్టారు. ఏదేమైనా.. ఒక్క విషయానికి మాత్రం కచ్చితమైన సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తాలిబన్లు ఉగ్రవాదులా, కాదా? మా అందరికీ ఈ విషయంపై భారత ప్రభుత్వం వివరణ ఇవ్వాలన్నారు. తాలిబన్లను ఒకవేళ ఉగ్రవాదులే అయితే వారితో ఎందుకు చర్చలు జరిపారని ప్రశ్నించారు. లేదు అనుకుంటే ఐక్యరాజ్యసమితికి వెళ్లి ఉగ్రవాద సంస్థ కాదని చెప్పగలరా అని అన్నారు ఒమర్ అబ్దుల్లా.

అఫ్ఘాన్‌ గడ్డపై తమకు వ్యతిరేక కార్యకలాపాలు జరగకుండా చూడాలని తాలిబాన్లకు భారత్‌ సూచించింది. ఆగస్టు 14న అఫ్ఘనిస్థాన్ పై  పూర్తిస్థాయిలో పట్టు సాధించినప్పటి నుంచి తాలిబాన్లు భారత్‌కు అనుకూల ప్రకటనలు చేస్తూ వచ్చారు. ఈ క్రమంలో తాలిబాన్ల కోరిక ప్రకారం ఖతార్‌లోని భారత రాయబారి దీపక్‌ మిత్తల్‌ వారితో భేటీ అయ్యారు. తాలిబాన్ల రాజకీయ విభాగం సీనియర్‌ నేత మహమ్మద్‌ అబ్బాస్‌ స్థానెక్జాయ్‌ ఈ భేటీలో పాల్గొన్నారు. అఫ్ఘానిస్థాన్‌లో ఉగ్రవాదానికి తావు ఉండకూడదు... అఫ్ఘాన్‌ గడ్డపైన భారత్‌కు వ్యతిరేక కార్యకలాపాలు, కుట్రలు జరగడానికి వీల్లేదని  మిత్తల్‌ తేల్చి చెప్పారు. అన్ని విషయాలను సానుకూలంగా స్వీకరిస్తామని.. అలాంటి కార్యకలాపాలకు తావు ఉండదని హామీ ఇచ్చారు స్థానెక్జాయ్‌.