బెంగళూరు: బిహార్ ఎన్నికలపై వెల్లడైన మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ NDAకు అనుకూలంగా రావడంపై కాంగ్రెస్ జాతీయాధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే స్పందించారు. బెంగళూరులో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఎగ్జిట్ పోల్స్ అన్నీ బిహార్ లో NDA ఆధిక్యం కనబరుస్తుందని చెప్తున్నాయని.. మహాఘట్ బంధన్కు బిహార్ ప్రజల నుంచి ఆశించిన మద్దతు రాలేదని అంచనా వేస్తున్నాయని అన్నారు. కానీ.. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఎంత తప్పయ్యాయో ఒక్కసారి గుర్తు చేసుకోవాలని ఆయన సూచించారు. హర్యానాపై.. ఎగ్జిట్ పోల్స్ అన్నీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తాయని అంచనా వేశాయని.. కానీ హర్యానాలో బీజేపీ అధికారంలోకి వచ్చిందని ఆయన గుర్తు చేశారు. ఎగ్జిట్ పోల్స్ కాదని.. నవంబర్ 14న వెల్లడయ్యే ఫలితాలను చూడాలని ఖర్గే చెప్పారు.
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, జేడీయూ నేతృత్వంలోని అధికార నేషనల్ డెమోక్రటిక్ అలయెన్స్(ఎన్డీయే) కూటమికే ప్రజలు మళ్లీ పట్టం కట్టనున్నారని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడించిన సంగతి తెలిసిందే. మ్యాజిక్ ఫిగర్ ను దాటి భారీ మెజార్టీతో ఎన్డీయే ఘన విజయం సాధించనుందని తెలిపాయి. కాంగ్రెస్, ఆర్జేడీ నేతృత్వంలోని ప్రతిపక్ష మహాఘట్ బంధన్ కూటమికి మళ్లీ నిరాశ తప్పదని అంచనా వేశాయి. ఇక పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిశోర్ నేతృత్వంలోని జన్ సురాజ్ పార్టీ(జేఎస్పీ) ఈ ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపలేదని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేశాయి.
మంగళవారం సాయంత్రం బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు రెండో (ఆఖరి) విడత పోలింగ్ ముగియగానే ఆయా సర్వే సంస్థలు తమ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను ప్రకటించాయి. రాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 243 సీట్లు ఉండగా, ప్రభుత్వ ఏర్పాటుకు కనీస మెజార్టీ(మ్యాజిక్ ఫిగర్) 122 సీట్లు అవసరం. ఈ ఎన్నికల్లో ఎన్డీయే మ్యాజిక్ ఫిగర్ ను ఈజీగా దాటి 130 కంటే ఎక్కువ సీట్లనే గెలుచుకోవచ్చని 7 ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి.
ఓవరాల్ గా కనీస మెజార్టీ కంటే 8 నుంచి 45 సీట్లు ఎక్కువే సొంతం చేసుకోవచ్చని సర్వే సంస్థలు అంచనా వేశాయి. మహాఘట్ బంధన్ కూటమి 73 నుంచి 108 సీట్లకే పరిమితం కావచ్చని, మ్యాజిక్ ఫిగర్ కు 14 నుంచి 49 సీట్ల దూరంలోనే ఉండిపోవచ్చని పేర్కొన్నాయి. ఇక జేఎస్పీ 0 నుంచి 4 సీట్లకు మించి గెలుచుకోకపోవచ్చని స్పష్టం చేశాయి. అయితే, ఎన్నికల్లో జేఎస్పీ ప్రభావం స్వల్పమే అయినప్పటికీ, ఆ స్వల్ప ఓటింగ్ శాతమే మహాఘట్ బంధన్ ను గట్టిగా దెబ్బతీసే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.
ఎన్డీయే అభ్యర్థులు గెలిచే చోట్ల జేఎస్పీకి ఓట్లు పడలేదని, ఆ పార్టీకి ఓట్లు పడిన చోట్లలో మహాఘట్ బంధన్ అభ్యర్థులే ఓటమిపాలయ్యే అవకాశాలు ఉన్నాయని పేర్కొంటున్నారు. కాగా, ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఓటర్ల సెంటిమెంట్ ను ప్రతిబింబించేలా ఉంటాయని భావిస్తున్నా.. తరచూ అవి తలకిందులయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. అందుకే ఈ నెల 14న ఓట్ల లెక్కింపు తర్వాతే ఏ కూటమి భవితవ్యం ఏమిటనేది స్పష్టం కానుందని చెప్తున్నారు.
Bengaluru, Karnataka | On Bihar elections Exit Polls, Congress National President Mallikarjun Kharge says, "All the exit polls are showing a lead for the NDA. They indicate that there isn’t much support for the Mahagathbandhan. Similarly, in Haryana, exit polls had shown that… pic.twitter.com/KUUqEoq9bb
— ANI (@ANI) November 12, 2025
