ముంబైలో మహిళపై ఎంఎన్ఎస్ కార్యకర్తల దాడి

ముంబైలో మహిళపై ఎంఎన్ఎస్ కార్యకర్తల దాడి

ముంబైలో మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (MNS) కార్యకర్తలు రెచ్చిపోయారు. ఓ మహిళ పట్ల వీధి రౌడీల్లా ప్రవర్తించారు. తన షాపు ముందు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయొద్దని  ప్రకాష్ దేవి అనే మహిళ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇక అంతే కార్యకర్తలకు కోపం కట్టలు తెంచుకుంది. పరుషమైన పదజాలంతో దుర్భాషలాడుతూ ఆమె పట్ల అమానుషంగా ప్రవర్తించారు. ఫ్లెక్సీలు ఏర్పాటును అడ్డుకోబోయిన ఆమెపై దాడిచేసి నెట్టివేయడంతో కిందపడిపోయింది. కానీ ఆమె మాత్రం వారిని ధైర్యంగా ఎదుర్కొనేందుకు పలుమార్లు ప్రయత్నించింది. ఇంత జరుగుతున్నా రోడ్డుపై అటుగా వెళ్తున్న వారిలో ఒక్కరు కూడా జోక్యం చేసుకోలేదు. ఏదో సినిమా షూటింగ్ జరుగుతున్నట్లు చోద్యం చూస్తూ ఉండిపోయారు. అన్యాయం కళ్లముందు కనబడుతున్నా అడ్డుకునేందుకు ఒక్కరూ ముందుకు రాలేదు.

వినోద్ ఆర్గిలే ఆధ్వర్యంలో కమతిపురాలో వెదరు కర్రలను ఏర్పాటు చేసి వాటిపై ఫ్లెక్సీలు కట్టేందుకు కార్యకర్తలు సిద్ధమయ్యారు. అయితే తన మెడికల్ షాపు ముందు వెదరు కర్రలు పెట్టి ఫ్లెక్సీలు ఏర్పాటు చేయొద్దని ప్రకాష్ దేవి వారించింది. ఇలా ఇస్తే తమ షాపుకు కస్టమర్లకు ఇబ్బందులు ఏర్పడతాయని..తమ గిరాకీ దెబ్బతింటుందని చెప్పారు. అయినా వారు వినిపించుకోకుండా తమ పని తాము చేసుకుంటున్నారు. కార్యకర్తలను వద్దని వారించినందుకు తనపై విచక్షణా రహితంగా దాడి చేశారని బాధిత మహిళ తెలిపారు. ఇష్టమొచ్చినట్లు దుర్భాషలాడారని చెప్పారు. ఈ ఘటన గత నెల ఆగస్టు 28న జరిగింది. మహిళను కొడుతున్న సమయంలో అక్కడున్న వారు సెల్ ఫోన్లలో షూట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడు ఈ వీడియో వైరల్ గా మారింది. మహిళపై దాడి చేసిన మూడు రోజుల తర్వాత బాధితురాలు ఆగస్టు 31న పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. మహిళపై దాడి చేసిన నిందితులను పట్టుకుని కఠిన చర్యలు తీసుకుంటామని పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు.