మూడోసారి కూడా మోడీనే ప్రధాని: సీఎం హిమంత

మూడోసారి కూడా మోడీనే ప్రధాని: సీఎం హిమంత

ప్రధాని నరేంద్ర మోడీ ముచ్చటగా మూడోసారి ప్రధాని అవుతారని అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ ధీమా వ్యక్తంచేశారు. ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి అనుమానం అవసరం లేదన్నారు. ప్రజల ఆశీర్వాదంతో మళ్లీ మోడీ ప్రధాని కావడం ఖాయమని చెప్పారు. రజతం, కాంస్య పతకాలు ఎవరికి వస్తాయో తాను ఆందోళన చెందడం లేదని..పరోక్షంగా కాంగ్రెస్ ను ఉద్దేశించిన వ్యాఖ్యలు చేశారు. ఆర్ఎస్ఎస్, బీజేపీ తన గురువుగా భావిస్తున్నట్టు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై సీఎం హిమంత బిశ్వ శర్మ స్పందించారు. రాహుల్ గాంధీ నాగ్ పూర్ లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయానికి వెళ్లాలని సూచించారు.

బీజేపీని తన గురువుగా భావిస్తున్నానని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ‘ఎలాంటి పనులు అస్సలు చేయకూడదు’అనే విషయాన్ని బీజేపీని చూసి నేర్చుకున్నట్లు చెప్పారు.  తన భవిష్యత్ కు ఒక రోడ్ మ్యాప్ ను కూడా బీజేపీయే చూపిస్తోందని రాహుల్ సెటైర్ వేశారు. బీజేపీ వాళ్లు కాంగ్రెస్ పార్టీపై తీవ్రంగా దాడి చేయాలని నేను కోరుకుంటున్నా...దాని వల్ల కాంగ్రెస్ పార్టీ తమ సైద్ధాంతికతను, భావజాలాన్ని గ్రహించేందుకు ఆస్కారం కలుగుతుంది’’ అని రాహుల్ అన్నారు. 

భారత్ జోడో యాత్రను ప్రారంభించినప్పుడు.. అది కేవలం కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు  సాగే సాధారణ యాత్రలా కనిపించింది. క్రమక్రమంగా ప్రజలతో మమేకం అవుతూ ఈ యాత్రకు భావం, భావోద్వేగాలు సైతం ఉన్నాయని గ్రహించాను. భారత్ జోడో యాత్ర తలుపులు అందరి కోసం ఎప్పుడూ తెరిచే ఉంటాయి. ఎవరైనా ఈ యాత్రలో మమేకం కావచ్చు. అఖిలేశ్ జీ, మాయావతీ జీ సహా ‘మొహబ్బత్ కా హిందుస్తాన్’ కోరుకునే ప్రతి ఒక్కరు యాత్రలో భాగస్వాములు కావచ్చని’  రాహుల్ అన్నారు.