ఎమ్మెల్యే రాజాసింగ్ కు మరోసారి నోటీసులు

ఎమ్మెల్యే రాజాసింగ్ కు మరోసారి నోటీసులు

గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కు మరోసారి 41CRPC కింద  పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ ఏడాది ఫిబ్రవరి 19, ఏప్రిల్ 12 తేదీల్లో వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసుల్లో షాహినాత్ గంజ్, మంగళ్ హాట్ పోటీసులు రాజాసింగ్ కు నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసులపై మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని పోలీసులు ఆదేశించారు.  అయితే తెలంగాణ పోలీసులు తనను ఇవాళ అరెస్ట్ చేసేందుకు కుట్ర చేస్తున్నారని ఎమ్మెల్యే రాజాసింగ్ తెలిపారు. పోలీస్ డిపార్ట్ మెంట్ ఇన్నాళ్లు నిద్రపోయిందని తాను అనుకోవడం లేదన్నారు. నాలుగైదు నెలల కింద నమోదైన కేసుల్లో ఇప్పుడు నోటీసులు ఇవ్వడంపై ఆయన స్పందించారు.

సోషల్ మీడియాలో రాజాసింగ్ అప్ లోడ్ చేసిన వీడియో పై  పోలీసుులు నోటీసులు జారీ చేశారు. మునావర్ ఫరూఖీ ఈ నెల 20వ తేదీన హైద్రాబాద్ లో కామెడీ షో నిర్వహించారు.ఈ షోకు అనుమతివ్వవద్దని రాజాసింగ్ కోరారు. అయితే ఈ షో కి పోలీసులు అనుమతించారు. ఈ షో ను అడ్డుకుంటామని రాజాసింగ్ ప్రకటించారు. కానీ భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడంతో కార్యక్రమానికి ఎలాంటి ఇబ్బందులు కలగలేదు. దీంతో మునావర్ ఫరూఖీ షోకి వ్యతిరేకంగా కార్యక్రమాలను నిర్వహిస్తామని రాజాసింగ్ ప్రకటించారు. ఇందుకు అనుగుణంగానే యూట్యూబ్ లో వీడియోను  పోస్టు చేశారు. ఈ వీడియోలో మహ్మద్ ప్రవక్తను ఉద్దేశించి కించపర్చేలా వ్యాఖ్యలు ఉన్నాయని ఎంఐఎం ఆరోపిస్తుంది.

ఈ విషయమై  రాజాసింగ్ పై చర్యలు తీసుకోవాలని ఈ నెల 22 రాత్రి నుండి 23వ తేదీ ఉదయం వరకు ఆందోళనలు నిర్వహించారు. ఈ క్రమంలోనే  ఈ నెల 23వ తేదీన ఉదయం మంగళ్ హాట్ పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసులో పోలీసులు రాజాసింగ్ ను అరెస్ట్ చేశారు. అదే రోజు సాయంత్రం పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరుపర్చారు. 41 సీఆర్ పీసీ సెక్షన్ కింద నోటీసులు ఇవ్వకుండానే పోలీసులు అరెస్ట్ చేశారని రాజాసింగ్ తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకు వచ్చారు. దీంతో రాజాసింగ్ కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 41 సీఆర్  పీసీ సెక్షన్ కింద ఇవాళ ఉదయం మంగళ్ హట్ పోలీసులు నోటీసులు జారీ చేశారు.