లగ్జరీ కార్లకు VIP నంబర్ల పట్ల క్రేజ్ పెరుగుతూనే ఉంది. జైపూర్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త రాహుల్ తనేజా ఒకప్పుడు ఆటో రిక్షా డ్రైవర్. కానీ ఇప్పుడు రాహుల్ తనేజా రాజస్థాన్‌లో అత్యంత ఖరీదైన VIP నంబర్ ప్లేటును సొంతం చేసుకున్నాడు. తన కొడుకు రెహన్ తనేజాకు 18వ పుట్టినరోజు గిఫ్ట్ ఆడి RSQ 8 కారు కోసం RJ 60 CM 0001 అనే VIP నంబర్‌ను కొనడానికి 31 లక్షలు ఖర్చు చేశాడు.
రాజస్థాన్‌లో ఇప్పటివరకు ఇదే అత్యంత ఖరీదైన VIP నంబర్ ప్లేట్. రాహుల్ తనేజాకి కార్లంటే ఇష్టం. అతను గతంలో కూడా చాల ఖరీదైన VIP నంబర్ ప్లేట్లను కొన్నాడు. 2011లో తన మొదటి లగ్జరీ కార్ BMW 7 సిరీస్ కోసం 10 లక్షలు పోసి RJ 14 CP 0001 నంబర్‌ను కొన్నాడు. ఆ తర్వాత 2018లో తన జాగ్వార్ XJL కోసం RJ 45 CG 0001 నంబర్‌ను కొన్నాడు, అప్పట్లో రాజస్థాన్‌లో ఇది అత్యంత ఖరీదైన నంబర్.
రాహుల్ తనేజా తన కొడుకు కోసం ఈ కొత్త నంబర్ కొన్నానని, ఏడు సంవత్సరాల క్రితం తనకి 18 ఏళ్లు నిండినప్పుడు అతనికి ఇష్టమైన కారును గిఫ్ట్ గా ఇస్తానని చెప్పినట్లు తెలిపాడు. నాలాగే నా కొడుకుకి కూడా కార్లంటే ఇష్టం.. నా ఆనందం నా కొడుకు చిరునవ్వు. అతని ఆనందం కోసం 31 లక్షలు ఖర్చు చేయడం నాకు పెద్ద విషయం కాదని అన్నారు.
రాహుల్ తనేజా మధ్యప్రదేశ్‌లోని మాండ్లా జిల్లాలోని కాట్రా గ్రామంలో జన్మించాడు. అతని తండ్రి సైకిల్ పంక్చర్‌లు చేసేవాడు, అతని తల్లి పొలాల్లో పనిచేసేది. ఆర్థిక ఇబ్బందులు ఉండటంతో రాహుల్ 11 ఏళ్ల వయస్సులోనే పని చేయడం ప్రారంభించాడు. మొదట జైపూర్‌లోని ఆదర్శ్ నగర్‌లోని ఒక చిన్న ధాబాలో వెయిటర్‌గా పనిచేశాడు. ఆ తర్వాత అతను పటాకులు, రంగులు, గాలిపటాలు, రాఖీలు, కామిక్స్ అమ్మడం నుండి కొరియర్ సర్వీస్, న్యూస్ పేపర్ డెలివరీ వరకు చిన్న చిన్న ఉద్యోగాలు చేశాడు.
16 నుండి 18 సంవత్సరాల మధ్య అతను దుర్గాపుర రైల్వే స్టేషన్‌లో రాత్రిపూట ఆటో నడిపాడు. ఈ ఇబ్బందుల మధ్య అతను 19 సంవత్సరాల వయస్సులో కార్ డీలర్‌షిప్ "కార్ ప్యాలెస్"ను ప్రారంభించాడు. తరువాత మోడలింగ్‌లోకి కూడా అడుగుపెట్టి మిస్టర్ జైపూర్, మిస్టర్ రాజస్థాన్, మేల్ ఆఫ్ ది ఇయర్ వంటి అవార్డులు గెలుచుకున్నాడు.
20 సంవత్సరాల వయసులో లైవ్ క్రియేషన్స్ అనే ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీని ప్రారంభించి తరువాత ముంబైలో ఇండియన్ ఆర్టిస్ట్.కామ్ అనే ఆర్టిస్ట్ మేనేజ్‌మెంట్ కంపెనీని ప్రారంభించాడు. 2010లో రాహుల్ తనేజా ప్రీమియం వెడ్డింగ్స్ అనే వెడ్డింగ్ ఈవెంట్స్ వ్యాపారాన్ని ప్రారంభించి విజయ శిఖరాలకు చేరుకున్నాడు. రాహుల్ తనేజా లగ్జరీ కార్ల పట్ల మక్కువ ఉన్న వ్యాపారవేత్తగా ప్రసిద్ధి చెందాడు. మీ కలలు ఎంత పెద్దవైనా, నిజమైన కృషితో వాటిని సాధించవచ్చని ఇతని జీవిత కథ రుజువు చేస్తుంది.
