హైదరాబాద్, వెలుగు: ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను ప్రోత్సహించే లక్ష్యంతో మిల్లెట్ మార్వెల్స్ ఆధ్వర్యంలో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్ (ఐఐఎంఆర్), న్యూట్రీహబ్ సహకారంతో ‘రోజుకు ఒక పూట చిరు ధాన్యాల భోజనం’ జాతీయ మిషన్‌ను రాజేంద్రనగర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్ లో ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా చిరు ధాన్యాల వినియోగంపై ప్రజల్లో అవగాహన పెంచడం, ఆరోగ్యకరమైన జీవనశైలికి దారితీసే ఉద్యమంగా రూపుదిద్దడం లక్ష్యం.
ఈ మిషన్‌కు ఏపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, సినీ నటుడు అక్కినేని నాగార్జున మద్దతు తెలిపారు. నాగార్జున వీడియో సందేశం ద్వారా రోజు వారీ ఆహారంలో చిరు ధాన్యాలను చేర్చాలని పిలుపునిచ్చారు. ప్రతిరోజూ ఒక మిల్లెట్ ఆధారిత భోజనాన్ని ఆహారంలో చేర్చుకోవాలని, మిల్లెట్ల ప్రయోజనాలపై అవగాహన కల్పించాలని, మరో ముగ్గురిని ఉద్యమంలో భాగస్వాములను చేయాలని ప్రతిజ్ఞ చేశారు.
మిల్లెట్ మార్వెల్స్ వ్యవస్థాపకుడు, సీఈఓ డాక్టర్ భరత్ రెడ్డి మాట్లాడుతూ రోజుకు కనీసం ఒక భోజనం చిరుధాన్యాలతో తీసుకోవడం ద్వారా ఆరోగ్యం మెరుగుపడుతుందని, దీనివల్ల జీవనశైలి వ్యాధులను తగ్గించుకోవచ్చన్నారు. ఐసీఏఆర్-ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్ డైరెక్టర్ డాక్టర్ తారా సత్యవతి, న్యూట్రీహబ్ డైరెక్టర్, సీఈఓ డాక్టర్ జే స్టాన్లే తదితరులు పాల్గొన్నారు.
