వైట్‌‌హౌస్ సమీపంలో కాల్పులు..ఇద్దరు నేషనల్ గార్డ్ సిబ్బంది మృతి

వైట్‌‌హౌస్ సమీపంలో కాల్పులు..ఇద్దరు నేషనల్ గార్డ్ సిబ్బంది మృతి

 

 

  • బలగాలే టార్గెట్‌‌గా అఫ్గాన్ వాసి ఫైరింగ్ 
  • ఎదురుకాల్పుల్లో నిందితుడికి గాయాలు, అరెస్టు 

వాషింగ్టన్: అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలోని అధ్యక్ష భవనం వైట్ హౌస్ కు సమీపంలో ఓ యువకుడు జరిపిన కాల్పుల్లో ఇద్దరు నేషనల్ గార్డ్ సభ్యులు మృతిచెందారు. బుధవారం మధ్యాహ్నం వైట్ హౌస్ కు దగ్గర్లోని మెట్రో స్టేషన్ వద్ద ఈ ఘటన జరిగింది. మెట్రో స్టేషన్ వద్ద నక్కి ఉన్న దుండగుడు అకస్మాత్తుగా భద్రతా బలగాలపైకి తుపాకీతో కాల్పులు జరిపాడు. దీంతో తీవ్రంగా బుల్లెట్ గాయాలైన ఇద్దరు గార్డులు చనిపోయారు. ఈ సందర్భంగా నిందితుడిపైకి నేషనల్ గార్డు సభ్యుడొకరు ఎదురుకాల్పులు జరపగా..  బుల్లెట్ గాయాలతో అతడు కూలబడ్డాడు. వెంటనే అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని అఫ్గానిస్తాన్ నుంచి శరణార్థిగా వచ్చిన రహ్మానుల్లా లకన్ వాల్(29)గా గుర్తించారు. భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకునే నిందితుడు కాల్పులు జరిపినట్టు ఎఫ్ బీఐ డైరెక్టర్ కాష్ పటేల్, వాషింగ్టన్ మేయర్ మురీల్ బౌజర్ తెలిపారు. ఈ ఘటనలో నిందితుడు ఒక్కడే కాల్పులు జరిపాడని, ఇతర అనుమానితులెవరూ లేరని ప్రాథమికంగా నిర్దారణకు వచ్చినట్టు పేర్కొన్నారు. అయితే, థ్యాంక్స్ గివింగ్ డే (పండగ సెలవు)కు ఒక రోజు ముందు దేశ రాజధానిలో జరిగిన ఈ ఘటన కలకలం సృష్టించింది. కాగా, అఫ్గాన్ నుంచి అమెరికా సేనలు తిరిగి వచ్చిన తర్వాత 2021లో అప్పటి ప్రెసిడెంట్ జో బైడెన్ అఫ్గాన్ శరణార్థులకు అనుమతి ఇచ్చారు. అఫ్గాన్ లో తాలిబాన్లకు వ్యతిరేకంగా, అమెరికన్ బలగాలకు మద్దతుగా పనిచేసిన వేలాది మంది శరణార్థులుగా అమెరికా వచ్చేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని అమలు చేశారు. తాజాగా కాల్పులకు పాల్పడిన రహ్మానుల్లా కూడా అప్పుడే అమెరికాకు రెఫ్యూజీగా వచ్చినట్టుగా గుర్తించారు.

అఫ్గాన్ల ఇమిగ్రేషన్ అప్లికేషన్లు రద్దు

వైట్ హౌస్ వద్ద కాల్పుల ఘటన దేశంపై జరిగిన ఉగ్రదాడేనని ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ‘‘థ్యాంక్స్ గివింగ్ హాలిడే సందర్భంగా వైట్ హౌస్ కు కొద్దిదూరంలోనే నేషనల్ గార్డు సభ్యులు ఇద్దరు కాల్పుల్లో చనిపోయారు. ఇది చాలా నీచమైన, ద్వేషపూరితమైన, ఉగ్రవాద చర్య. ఇది మొత్తం దేశంపై, మానవత్వంపై జరిగిన దాడి. ప్రపంచంలోనే అతిప్రమాదకర ప్రాంతమైన అఫ్గానిస్తాన్ నుంచి వచ్చిన వ్యక్తి ఈ దారుణానికి పాల్పడ్డాడు” అని ఆయన వెల్లడించారు. ఘటన జరిగిన సమయంలో ఫ్లోరిడాలోని తన మార్ ఏ లాగో క్లబ్ లో ఉన్న ట్రంప్ ఈ మేరకు వీడియో మెసేజ్ రిలీజ్ చేశారు. బైడెన్ హయాంలో అమెరికాకు వచ్చిన అఫ్గాన్ శరణార్థులందరినీ రీఇన్వెస్టిగేషన్ చేస్తామని ప్రకటించారు. వాషింగ్టన్ లో ప్రస్తుతం 2,200 మంది నేషనల్ గార్డ్ సభ్యులు మోహరించి ఉండగా, అదనంగా మరో 500 మందిని రప్పించాలని ఆదేశించారు. కాగా, వైట్ హౌస్ వద్ద కాల్పుల ఘటన నేపథ్యంలో అఫ్గాన్ దేశస్తులు దాఖలు చేసిన ఇమిగ్రేషన్ దరఖాస్తులన్నింటినీ తక్షణమే సస్పెండ్ చేస్తున్నట్టు గురువారం యూఎస్ సిటిజన్ షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ ప్రకటించింది.  

పాక్ ఐఎస్ఐ కుట్ర ఉండొచ్చు: అఫ్గాన్ 

వాషింగ్టన్​లో కాల్పుల ఘటన వెనక పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ కుట్ర ఉండొచ్చని అఫ్గాన్ తాలిబాన్ ప్రభుత్వ ప్రతినిధి సుహైల్ షహీన్ అన్నారు. ‘‘అఫ్గాన్ గడ్డపై నుంచి ఏ వ్యక్తీ ఇతర దేశాలపై దాడులకు మేం అనుమతివ్వం. ఇదే మా పాలసీ. వాషింగ్టన్​లో కాల్పుల ఘటనపై దర్యాప్తు జరిపించాలి. ఇది అఫ్గాన్ ప్రతిష్టను దెబ్బతీసేందుకు ఐఎస్ఐ కుట్ర కావొచ్చు. నిందితుడు ఐఎస్ఐ ద్వారా ప్రభావితుడు అయ్యాడా? ఐఎస్ఐ ఆదేశాల మేరకే చేశాడా? అన్నది తేల్చాలి” అని ఆయన కోరారు.