కేబీఆర్ పార్క్ చుట్టూ సండే (జూన్ 21) వన్ వే.. ఉదయం 10 నుంచి రాత్రి 8 గంటల వరకు.. ఆల్టర్నేట్ రూట్లు ఇవే

కేబీఆర్ పార్క్ చుట్టూ సండే (జూన్ 21) వన్ వే.. ఉదయం 10 నుంచి రాత్రి 8 గంటల వరకు.. ఆల్టర్నేట్ రూట్లు ఇవే
  • సైన్‌‌బోర్డులు, గైడ్​లైన్స్​ అనుసరిస్తూ వెళ్లండి: జాయింట్ కమిషనర్ జోయల్ డేవిస్  

బషీర్‌‌బాగ్, వెలుగు: హెచ్-సిటీ ప్రాజెక్టులో భాగంగా బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో స్టీల్ ఫ్లైఓవర్, అండర్‌‌పాస్ నిర్మాణ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో కేబీఆర్ పార్క్ పరిసర ప్రాంతాల్లో జూన్ 21 (ఆదివారం) ప్రత్యేక ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నట్లు ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ జోయల్ డేవిస్ తెలిపారు. 

బషీర్ బాగ్ సీసీఎస్ ఆఫీసులో శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పార్క్ చుట్టూ ఉన్న మెయిన్​రోడ్డుపై వన్‌‌వే ట్రయల్ రన్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ట్రాఫిక్ పోలీసులు ఏర్పాటు చేసిన సైన్‌‌బోర్డులు, గైడ్​లైన్స్​అనుసరిస్తూ వెళ్లాలన్నారు.

ఎన్‌‌ఎఫ్‌‌సీఎల్ వైపు నుంచి సాగర్ సొసైటీ, కేబీఆర్ పార్క్ ఎంట్రన్స్, జూబ్లీహిల్స్ చెక్‌‌పోస్ట్, రోడ్డు నంబర్ 36, 45, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ వైపు వెళ్లే వాహనాలు ఎన్టీఆర్ భవన్ నుంచి బసవతారకం క్యాన్సర్ దవాఖాన, అగ్రసేన్ ఐలాండ్, ఒమేగా హాస్పిటల్, భారతీయ విద్యాభవన్ రూట్​లో ప్రయాణించాలని చెప్పారు. 

యూసుఫ్‌‌గూడ, శ్రీనగర్ కాలనీ ప్రాంతాల నుంచి జూబ్లీహిల్స్, మాదాపూర్ వైపు వెళ్లే వాహనాలకు ఇందిరానగర్ గడ్డ రోడ్, వెంకటగిరి జంక్షన్, డైమండ్ హౌస్, రోడ్డు నంబర్ 10, అల్-కాజర్ మార్గాల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. అన్నపూర్ణ స్టూడియో బైలేన్, ఎన్టీఆర్ భవన్, బసవతారకం ఆసుపత్రి, ఫిలింనగర్, షేక్‌‌పేట్ వైపు కూడా ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించుకోవచ్చన్నారు.

ఐటీసీ కోహినూర్, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ ప్రాంతాల నుంచి జూబ్లీహిల్స్ చెక్‌‌పోస్ట్, వెంకటగిరి, పంజాగుట్ట వైపు వెళ్లే వాహనాలు రోడ్డు నంబర్ 60, 67, రోడ్డు నంబర్ 1 మీదుగా ప్రయాణించాలని సూచించారు. ఎక్కడా యూ-టర్న్‌‌లకు అనుమతి ఉండదన్నారు.  అత్యవసర పరిస్థితుల్లో ట్రాఫిక్ హెల్ప్‌‌లైన్ నంబర్ 90102 03626ను సంప్రదించాలని సూచించారు.

  • పాతబస్తీలో ఏనుగు ట్రయల్ వాక్ సందర్భంగా..

ఈ నెల 25న  మొహర్రం సందర్భంగా ఏనుగు ఊరేగింపు కోసం ముందస్తుగా ఏనుగు ట్రయల్ వాక్ ని పోలీసులు శనివారం నిర్వహించనున్నారు. దీనికోసం మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ట్రాఫిక్​ఆంక్షలు, మళ్లింపులు విధించారు. బీబీ కా అలవా, షేక్ ఫైజ్ కమాన్, ఎతెబార్ చౌక్, గంగా నగర్ నాలా, చార్మినార్, మీరాలం మండి, అలవా సర్తాక్ తదితర ప్రాంతాల్లో వాహనాల రాకపోకలను నిలిపివేసి ప్రత్యామ్నాయ మార్గాల్లో మళ్లిస్తారు.

ఊరేగింపును బట్టి ట్రాఫిక్‌‌ను డబీర్‌‌పురా, చంచల్‌‌గూడ, కోట్ల అలీజా, పురాణీ హవేలీ, మదీనా, సిటీ కాలేజీ, అఫ్జల్‌‌గంజ్, గౌలిగూడ వైపు వెళ్లాల్సి ఉంటుంది. జిల్లా బస్సులు ఉదయం10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు రంగమహల్, అఫ్జల్‌‌గంజ్ 
రూట్లలో వెళ్లాలి.