మొదలైన ఆన్‌లైన్ క్లాసులు..

మొదలైన ఆన్‌లైన్ క్లాసులు..

రాష్ట్రంలో నేటి నుంచి కేజీ టు పీజీ స్టూడెంట్స్‌కు ఆన్‌లైన్ క్లాసులు మొదలయ్యాయి. కరోనాతో ఈ ఏడాది ఫిజికల్ క్లాసులు నిర్వహించేందుకు వీలుకాక పోవడంతో ఆన్‌లైన్‌లోనే తరగతులు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ జూనియర్ కాలేజీల విద్యార్థులకు గతేడాది లాగానే ఆన్లైన్ క్లాసులు చెబుతున్నారు. ప్రతీ విద్యార్థి టీ శాట్ యాప్ డౌన్లోడ్ చేసుకునేలా విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. విద్యార్థులంతా ఆన్‌లైన్ తరగతులకు హాజరయ్యేలా వారి తల్లిదండ్రులతో కోఆర్డినేట్ చేసుకోవాలని టీచర్లు, హెడ్ మాస్టర్లకు ఆదేశాలు ఇచ్చారు. మూడో తరగతి నుంచి ఇంటర్మీడియెట్ వరకు ప్రతీ రోజు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆన్‌లైన్ క్లాసులు చెప్పనున్నారు. అదేవిధంగా టీశాట్‌లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4.30 వరకు సబ్జెక్టుకు 30 నిమిషాల చొప్పున లైవ్‌లో క్లాసులు ప్రసారం కానున్నాయి. డీడీ యాదగిరి, టీ శాట్ చానళ్లలో ఈ పాఠాలు ప్రసారం అవుతున్నాయి. క్లాసుల నిర్వహణను.. జిల్లా కలెక్టర్లు కూడా మానిటర్ చేస్తారు. అవసరమైతే టీచర్లు విద్యార్థుల ఇంటికి వెళ్లి తల్లిదండ్రులతో, విద్యార్థులతో మాట్లాడాలని అధికారులు ఆదేశాలు ఇచ్చారు. టీవీలలో టీ శాట్ ప్రసారాలు రానిచోట.. స్థానిక కేబుల్ ఆపరేటర్లతో కలెక్టర్లు మాట్లాడి టీ శాట్, దూరదర్శన్ చానల్స్ వచ్చేలా ఏర్పాట్లు చేశారు. 

గవర్నమెంట్ స్కూళ్లల్లో 3 నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు 16 లక్షలకు పైగానే ఉన్నారు. మరో పది లక్షల మంది విద్యార్థులు ఇంటర్ చదువుతున్నారు. ఇప్పటికే టీ శాట్ యాప్ 10లక్షలకు పైగా విద్యార్థులు డౌన్లోడ్ చేసుకున్నారని టీశాట్ సీఈవో శైలేష్ రెడ్డి తెలిపారు. రోజూ విద్యార్థులకు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు స్పెషల్ క్లాసులు ఆన్‌లైన్‌లో అందిస్తున్నామన్నారు. రికార్డెడ్ క్లాసులు కూడా విద్యార్థులకు అందుబాటులో ఉంటాయన్నారు. ఆన్‌లైన్ పాఠాలకు సంబంధించి వర్క్ షీట్లను విద్యార్థులకు అందజేసి వారితో హోంవర్క్ చేయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు.