- సాఫ్ట్ వేర్ను చెక్ చేసిన అధికారులు
- షోరూం నుంచి ఓ కారు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ సక్సెస్
హైదరాబాద్సిటీ, వెలుగు: షో రూమ్లో కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ విధానం శనివారం నుంచి అమలులోకి రానుంది. ఆర్టీఏ అధికారులు ప్రయోగాత్మకంగా దీనిని హైదరాబాద్లో ప్రారంభిస్తున్నారు. టూ వీలర్, కారు కొన్న వాళ్లు రవాణా శాఖ ఆఫీస్కు వెళ్లాల్సిన అవసరం లేకుండా డీలర్ వద్దే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం ఈ నెల 8న నిర్ణయం తీసుకుంది.
ఇందుకు అనుగుణంగా రవాణా శాఖ అధికారులు సాఫ్ట్ వేర్ ను తయారు చేసి శుక్రవారం శ్రీ కృష్ణ ఆటోమోటివ్స్ షో రూమ్ లో పరీక్షించారు. కారు కొన్న ఓ వాహనదారుడికి కొత్త విధానం ద్వారా షోరూమ్ నుంచి ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్చేశారు. సాఫ్ట్ వేర్ విజయవంతం కావడంతో శనివారం నుంచి వాహనాల రిజిస్ట్రేషన్ ఆన్లైన్లోనే చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
కొత్త విధానంలో ఇలా..
వాహనం కొనుగోలు చేసిన అధికారిక డీలరే శాశ్వత రిజిస్ట్రేషన్ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేస్తారు. ఇన్వాయిస్, ఫారం–21, ఫారం–22, బీమా, చిరునామా రుజువు, వాహన ఫొటోలు మొదలైనవి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేస్తారు. తర్వాత రవాణా శాఖ అధికారి దరఖాస్తును పరిశీలించి రిజిస్ట్రేషన్ నంబర్ కేటాయిస్తారు. ఆర్సీ నేరుగా స్పీడ్ పోస్ట్ ద్వారా వాహన యజమానికి పంపుతారు. ఈ విధానం వల్ల వాహనదారులకు సమయం ఆదా కావడంతోపాటు ఆర్టీవో ఆఫీస్కు వెళ్లే అవసరం ఉండదు. వాహన రిజిస్ట్రేషన్ వేగంగా, పారదర్శకంగా పూర్తవుతుంది. ఈ సౌకర్యం టూ వీలర్, కార్లకే వర్తిస్తుంది. ట్రాన్స్‌పోర్ట్ వాహనాలకు ఇది వర్తించదు.
