
- బడ్జెట్‌లో తెలంగాణ ప్రస్తావన లేకపోవడం బాధాకరం
- మా ఎంపీలు ఉంటే కేంద్ర వైఖరిని వ్యతిరేకించే వాళ్లం
- బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్, వెలుగు: కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణ ప్రస్తావన లేకపోవడం బాధాకరమని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. 8 మంది ఎంపీలను ఇచ్చిన రాష్ట్రానికి, నిధులు కేటాయించని బీజేపీకి రాబోయే రోజుల్లో ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. తెలుగు కోడలు నిర్మలా సీతారామన్ తెలంగాణకు నిధులు కేటాయిస్తారని ఆశిస్తే, ఎప్పటిలాగే గుండు సున్నా దక్కిందని ఆవేదన వ్యక్తం చేశారు.
బడ్జెట్‌లో ములుగు యూనివర్సిటీకి అదనపు నిధులు, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఊసే లేదన్నారు. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వాలని ఎన్నిసార్లు అడిగినా పట్టించుకోవటం లేదన్నారు. తెలంగాణ నుంచి ముంబై-, నాగపూర్, బెంగళూరు,- చెన్నై మార్గాల్లో పారిశ్రామిక కారిడార్లకు నిధులు అడిగినప్పటికీ స్పందన లేదన్నారు. రాష్ట్రంలోని16 ఎంపీ స్థానాలను జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్కు ఇస్తే ఏం జరిగిందో తెలంగాణ ప్రజలు ఆలోచించాలని పిలుపునిచ్చారు.
సీఎం రేవంత్, మంత్రులు ఢిల్లీ వెళ్లి నిధులు అడిగినా కేంద్రం పట్టించుకోలేదని చెప్పారు. పార్లమెంటులోని బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు, కేంద్ర మంత్రులు ఒక్క మాట కూడా మాట్లాడలేదని మండిపడ్డారు. గులాబీ కండువా కప్పుకున్న ఎంపీలు పార్లమెంటులో ఉంటే కేంద్ర వ్యతిరేక వైఖరిని గట్టిగా వ్యతిరేకించే వాళ్లని చెప్పారు.