ఊటీలో జీరో డిగ్రీలు.. ఈ సీజన్ లో ఏంటీ విచిత్రం

ఊటీలో జీరో డిగ్రీలు.. ఈ సీజన్ లో ఏంటీ విచిత్రం

ఊటీ: తమిళనాడులోని ఊటీలో ఉష్ణోగ్రతలు 0 డిగ్రీలకు పడిపోయాయి. సాధారణంగా నవంబర్, డిసెంబర్ నెలలో ఇలాంటి పరిస్థితి ఉంటుంది. కానీ జనవరిలో కూడా ఉష్ణోగ్రతలు అత్యంత కనిష్టానికి పడిపోవడంపై స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఇది వారి ఆరోగ్యం, వ్యవసాయం పై ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. 

ఊటీలోని హిల్ జిల్లాలో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. దట్టమైన పొగమంచు కమ్ముకొని పరిసర ప్రాంతాలు పూర్తి మంచుతో కమ్ముకొని ఉన్నాయి. చాలా ప్రాంతాల్లో చలిని తరిమికొట్టేందుకు ప్రజలు భోగి మంటల వేసుకుంటున్నారు. అకాల చలి వారి నిత్య జీవితానికి అంతరాయం కలిగిస్తుండటంతో స్థానికుల్లో ఆందోళన స్పష్టంగా కనిపిస్తోంది. 

ఉదక మండలంలోని కాంతల్, తలైకుంటలో ఉష్ణోగ్రతలు 1 డిగ్రీ సెల్సియస్ కు పడిపోయాయి. బొటానికల్ గార్డెన్ లో 2 డిగ్రీలు, శాండినల్లాలలో  3డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు అయింది. 
ఊటీలో అకాల చలి గురించి నెటిజన్ల సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. హిల్ స్టేషన్ ను దక్షిణ కాశ్మీర్ అని అంటున్నారు కొందరు నెటిజన్లు. పచ్చని నీలగిరి మధ్య చల్లటి వాతావరణం ఎంత బాగుందో అంటూ కొందరు కామెంట్ చేయగా మరికొందరు ఆరోగ్యం , వ్యవసాయం గురించి పలు రకాల ఆందోళలను వ్యక్తం చేశారు. 

నీలగిరి ఎన్విరాన్ మెంట్ సోషల్ ట్రస్ట్ కి చెందిన శివదాస్ ఈ మార్పును గ్లోబల్ వార్మంగ్ ,ఎల్ నినో ఎఫెక్ట్ ఫలితమంటున్నారు. చలి ఆలస్యంగా ప్రారంభం కావడం దీని ఫలితమే అంటున్నారు. నీలగిరిలో ఈ వాతావరణ సవాల్ ను అర్థం చేసుకొని పరిష్కరించేందుకు సమగ్ర అధ్యయనం అవసరమంటున్నారు. 

వాతావరణంలో మార్పులు నీలగిరి కొండల్లో వ్యవసాయంపై ముఖ్యంగా తేయాకు తోటలపై తీవ్ర ప్రభావం చూపుతుందంటున్నారు నిపుణులు. డిసెంబర్ లో భారీ వర్షాలు, ప్రస్తుత చలి ప్రభావంతో టీ తోటల పెంపకంపై ప్రతికూల పడిందంటున్నారు. దీంతో రానున్న రోజుల్లో ఉత్పత్తి తగ్గుముఖం పట్టొచ్చంటున్నారు నిపుణులు.