సైబరాబాద్​లోనూ ‘ఆపరేషన్ రోప్’

సైబరాబాద్​లోనూ ‘ఆపరేషన్ రోప్’

గచ్చిబౌలి, వెలుగు: సిటీలో రోడ్లపై ట్రాఫిక్​కు ఇబ్బంది లేకుండా సిటీ పోలీసులు చేపట్టిన ‘ఆపరేషన్ రోప్’(రిమూవల్‌‌ ఆఫ్‌‌ అబ్‌‌స్ట్రక్టివ్‌‌ పార్కింగ్‌‌ అండ్‌‌ ఎన్‌‌క్రోచ్‌‌మెంట్స్‌‌)ను సైబరాబాద్ కమిషనరేట్ లోనూ అమలు చేయనున్నారు. ఇందుకోసం మంగళవారం సైబరాబాద్ కమిషనరేట్​లో పనిచేస్తున్న ట్రాఫిక్ పోలీసులు, సిబ్బందితో సీపీ స్టీఫెన్ రవీంద్ర సమీక్షా సమావేశం నిర్వహించారు. చీఫ్ గెస్టుగా హాజరైన సిటీ సీపీ ఆనంద్ సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు ఆపరేషన్ రోప్ పై అవగాహన కల్పించారు. అనంతరం సీవీ ఆనంద్ మాట్లాడుతూ.. ట్రాఫిక్ సిబ్బంది జీహెచ్ఎంసీ, ఇతర విభాగాలతో సమన్వయం చేసుకుంటూ పనిచేయాలన్నారు. ఎప్పటికప్పుడు స్పెషల్ డ్రైవ్​లు నిర్వహించాలన్నారు.

ఆపరేషన్ రోప్​లో భాగంగా ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్ తయారు చేశామన్నారు. ఇందులో ఎన్​ఫోర్స్​మెంట్, ఎడ్యుకేషన్ అండ్ ఇంజనీరింగ్ ​ఆఫ్ ట్రాఫిక్ మేనేజ్ మెంట్ ప్రధానమన్నారు. ట్రాఫిక్ సజావుగా ఉండాలంటే ఆక్రమణల తొలగింపు, అక్రమ పార్కింగ్​లపై ఫోకస్ చేయాలన్నారు. అనంతరం సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర మాట్లాడుతూ..  సైబరాబాద్ పరిధిలో ‘ఆపరేషన్ రోప్’ ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇక నుంచి   ట్రాఫిక్‌‌ సిగ్నల్స్‌‌ వద్ద  స్టాప్‌‌ లైన్‌‌ ముందు ఆగడం, ఫ్రీ లెఫ్ట్​లను వదిలేయడం, రోడ్లపై క్యారేజ్‌‌ వేలను సాఫీగా ఉంచడంపై వాహనదారుల్లో అవగాహన పెరుగుతుందన్నారు. కార్యక్రమంలో సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాసరావు, మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి, ట్రాఫిక్ ఏడీసీపీ శ్రీనివాస్ రెడ్డి, ఏసీపీలు, ఇన్​స్పెక్టర్లు పాల్గొన్నారు.