రెడ్లా.. నాన్‌ రెడ్లా?: పీసీసీ చీఫ్​ పోస్టుపై అభిప్రాయాల సేకరణ షురూ

రెడ్లా.. నాన్‌ రెడ్లా?: పీసీసీ చీఫ్​ పోస్టుపై అభిప్రాయాల సేకరణ షురూ

లీడర్లతో మాణిక్కం ఠాగూర్​ భేటీలు
మూడు రోజుల పాటు ఇక్కడే మకాం
అందరి అభిప్రాయాలు తీసుకున్నాక సోనియాకు రిపోర్టు
పార్టీ మారే ఆలోచన లేదు: జానారెడ్డి

హైదరాబాద్‌, వెలుగు: కొత్త పీసీసీ ప్రెసిడెంట్​ కోసం కాంగ్రెస్​ కసరత్తు మొదలుపెట్టింది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జి మాణిక్కం ఠాగూర్‌  దీనికి సంబంధించి పని షురూ చేశారు. బుధవారం గాంధీభవన్‌లో పార్టీ రాష్ట్ర కోర్‌ కమిటీతో భేటీ అయ్యారు. ఈ భేటీలో పీసీసీ చీఫ్​ ఉత్తమ్ సహా దాదాపు 25 మంది నేతలు పాల్గొని చర్చించారు. తర్వాత ఒక్కో లీడర్​తో విడివిడిగా మాట్లాడే పనికి మాణిక్కం ఠాగూర్​ శ్రీకారం చుట్టారు. అర్థరాత్రి వరకు కొందరితో మాట్లాడారు. ఇంకో 3 రోజుల పాటు ఆయన హైదరాబాద్​లోనే ఉండి.. లీడర్ల అభిప్రాయాలను తీసుకోనున్నారు. అయితే ఏ కులానికి చెందినవారికి పీసీసీ చీఫ్​ పోస్టు దక్కుతుందన్నది హాట్​టాపిక్​గా మారింది. రెడ్లకే పదవి ఇస్తరా, వేరే కులానికి చెందిన వారికి చాన్స్​ ఉంటదా అని చర్చలు జరుగుతున్నాయి.

ఏ వర్గానికి ఇస్తే బెటరని..

ప్రస్తుత పీసీసీ చీఫ్​ ఉత్తమ్‌‌ బాధ్యతలు చేపట్టి ఐదేండ్లు దాటుతోంది. 2015 మార్చిలో ఆయన పీసీసీ చీఫ్​ బాధ్యతలు చేపట్టారు. తర్వాత కొద్దికాలానికే జీహెచ్ఎంసీ ఎలక్షన్లు జరిగాయి. అందులో కాంగ్రెస్​ ఘోర పరాజయం పాలైంది. ఆ తర్వాత కూడా వరుసగా ఎలక్షన్లలో కాంగ్రెస్‌‌  దెబ్బతింటూనే వచ్చింది. ప్రతిసారీ పీసీసీ చీఫ్​ మారుతారంటూ.. అనేక మంది పేర్లు తెర మీదకు వచ్చాయి. కొన్నిసార్లు లీడర్లు బహిరంగంగా కామెంట్లు కూడా చేసి.. పార్టీ క్రమశిక్షణ చర్యలకు గురయ్యారు. చివరికి తాజా గ్రేటర్‌‌ ఎలక్షన్​ రిజల్ట్​లోనూ దెబ్బతినడంతో.. ఉత్తమ్‌‌ రాజీనామా చేశారు. అధికారికంగా రాష్ట్ర చీఫ్​ పదవి కోసం కొత్త నేత ఎంపిక ప్రక్రియ మొదలైంది. కొత్తగా వచ్చే అధ్యక్షుడి ఆధ్వర్యంలోనే 2023 అసెంబ్లీ ఎలక్షన్లకు వెళ్లాల్సి వస్తుంది కాబట్టి ఎంపికపై హైకమాండ్​ చాలా పర్టిక్యులర్‌‌గా ఉందని నేతలు అంటున్నారు. ఈ దిశగానే మాణిక్కం ఠాగూర్‌‌కు కొన్ని సూచనలు చేసి పంపినట్టు తెలిసింది. హైకమాండ్​ సూచనల మేరకే.. కొత్త పీసీసీ చీఫ్ ఎంపికలో ఎలాంటి కుల సమీకరణ ఉండాలన్న దానిపై ఆయన నజర్​ పెట్టినట్టు సమాచారం. ముఖ్యంగా మళ్లీ రెడ్లను పీసీసీ చీఫ్​గా ఎంపిక చేయడమా, నాన్‌‌ రెడ్డి అయితే బెటరా.. బీసీ, ఎస్సీ వర్గాలకు పదవి ఇస్తే ఎక్కువ బెనిఫిట్‌‌ ఉంటుందా  అన్న దానిని సీరియస్​గా పరిశీలిస్తున్నట్టు తెలిసింది. మాణిక్కం అన్ని వర్గాల నేతలతో మాట్లాడి.. రెడ్డి, బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల నుంచి పదవి ఆశిస్తున్న నేతలతో విడివిడిగా లిస్టు రెడీ చేసే చాన్స్​ ఉందని.. ప్రతి కులం నుంచి ఇద్దరు, ముగ్గురు నేతల పేర్లను చేర్చి హైకమాండ్​కు సమర్పిస్తారని సీనియర్​ నేత ఒకరు చెప్పారు.

ఈ టైంలో చాన్స్​ వస్తే..

తెలంగాణ ఇచ్చినందున కాంగ్రెస్‌‌ అధికారంలోకి వస్తుందని ఆశించిన హైకమాండ్​కు నాటి నుంచి ఇప్పటివరకు ఎదురుదెబ్బ తగులుతూనే వచ్చింది. రాష్ట్రంలో కాంగ్రెస్​ బలం పడిపోయింది. ఇలాంటి టైంలో పార్టీకి ముందు నిలిచి.. పరిస్థితి మెరుగుపరిస్తే హైకమాండ్​ వద్ద మంచి పేరు వస్తుందని పార్టీ నేతలు భావిస్తున్నారు. ఇదే ఆలోచనతో పీసీసీ చీఫ్​ పదవికి పోటీపడుతున్నారు. మాణిక్కం ఠాగూర్​ కూడా మీడియాతో మాట్లాడుతూ..150 మందిదాకా రేసులో ఉన్నారని, అందరి అభిప్రాయాన్ని పరిశీలిస్తానని చెప్పడం గమనార్హం.

వేరే కులాలకు ఇస్తెనె..

ఐదేండ్లుగా రెడ్డి కులానికే చెందినవారే పీసీసీ ప్రెసిడెంట్‌‌గా ఉన్నారని, లాస్ట్‌‌ టర్మ్‌‌లో సీఎల్పీ పదవి కూడా ఆ కులానికే (జానారెడ్డి)కే తక్కినందున.. నాన్‌‌ రెడ్డికి పీసీసీ చీఫ్​ పదవి ఇవ్వడం సమంజసంగా ఉంటుందనే వాదన పార్టీలో ఉంది. రాష్ట్రంలో రెడ్లు మూడు పార్టీల (టీఆర్‌‌ఎస్‌‌, బీజేపీ, కాంగ్రెస్‌‌) మధ్య చీలిపోయి ఉండటంతో ఆ కులానికి పీసీసీ ఇవ్వడం కన్నా వేరే వారికి కట్టబెట్టడమే కరెక్టనే అభిప్రాయం వినిపిస్తోంది. కాంగ్రెస్‌‌కు బీసీ, ఎస్సీ, ఎస్టీల బలం బాగా ఉంటుందని.. వాళ్లే నిజమైన క్యాడర్‌‌, ఓటర్లని ఇటీవల వారంతా పార్టీకి దూరమైపోయారని కొందరు నేతలు వాదిస్తున్నారు. అందుకే నాన్‌‌ రెడ్డికి అధ్యక్ష పదవి ఇస్తే అంతా మళ్లీ పార్టీకి దగ్గరవుతారని ఠాగూర్​కు కొందరు చెప్పినట్టు తెలిసింది. హైకమాండ్​ ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకోవచ్చని ఓ ముఖ్య నేత తెలిపారు.

న్యూట్రల్​ నేతకు ఇస్తరా?

కులాల వారీ సమీకరణలను పక్కన పెడితే.. న్యూట్రల్‌‌ గా ఉండే నేతను పీసీసీ చీఫ్​గా నియమించే అంశాన్నీ కాంగ్రెస్​ హై కమాండ్​ పరిశీలిస్తున్నట్టు సమాచారం. దీనికి సంబంధించి శ్రీధర్‌‌ బాబు, జానారెడ్డిల పేర్లు వినిపిస్తున్నాయి. అయితే అన్ని అంశాలను పరిశీలించాకే పీసీసీ చీఫ్​ను ఫైనల్​ చేసే చాన్స్​ ఉందని కాంగ్రెస్​ నేతలు అంటున్నారు.

సోనియాదే తుది నిర్ణయం: ఉత్తమ్‌‌

కోర్‌‌ కమిటీ భేటీ తర్వాత బయటికి వచ్చిన ఉత్తమ్‌‌ కుమార్‌‌రెడ్డితో మీడియా మాట్లాడింది. కొత్త చీఫ్​గా ఎవరిని ఎన్నుకునే చాన్స్​ ఉందని ప్రశ్నించగా.. సోనియా గాంధీదే తుది నిర్ణయమని ఉత్తమ్​ చెప్పారు. ఆమె ఎవరిని ఎంపిక చేసినా అందరం కట్టుబడి ఉంటామని తెలిపారు.

ఏ వర్గం నుంచి ఎవరు?

రెడ్ల నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్‌రెడ్డి రేసులో ముందంజలో ఉంటే.. మర్రి శశిధర్‌ రెడ్డి, జగ్గారెడ్డి కూడా పీసీసీ చీఫ్​ పోస్టు కోసం పోటీ పడుతున్నారు. పీసీసీ చీఫ్​ పోస్టు పట్ల తనకు అంతగా ఆసక్తి లేదని జానారెడ్డి పార్టీ నేతలతో చెప్తున్నా.. హైకమాండ్​ ఎంపిక చేస్తే మాత్రం అభ్యంతరమేమీ లేదని అంటున్నట్టు తెలిసింది. ఇక బీసీల నుంచి పొన్నం, వీహెచ్, అంజన్‌ కుమార్‌, మధుయాష్కీ, పొన్నాల పోటీలో ఉన్నారు. ఎస్సీ వర్గం నుంచి భట్టి, రాజనర్సింహ, సంపత్‌కుమార్‌లు రేసులో ఉన్నట్లు తెలిసింది.