
ప్యాంటు జేబులో ఉన్న ఫోన్ ఒక్కసారిగా పేలడంతో ఓ వ్యక్తి గాయాల పాలయ్యాడు . ఈ సంఘటన హైదరాబాద్ లోని అల్వాల్ పి.ఎస్ పరిధిలో చోటు చేసుకుంది. మచ్చ బొల్లారానికి చెందిన ఇమ్రాన్ అనే వ్యక్తి ఈ మధ్య కొత్తగా ఒప్పో ఫోనును కొనుక్కున్నాడు. అయితే రోజువారీ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు కూడా ఫోనును జేబులో వేసుకొని పని మీద బైక్‌పై వెళుతుండగా ఫోన్ ఒక్కసారిగా పేలింది. దీంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. పేలుడు ధాటికి తొడ భాగం కాలిపోయింది. ఆ మంటలకు చర్మం పూర్తిగా అంటుకుపోయింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గాయపడిన ఇమ్రాన్ ను స్థానికుల సహయంతో దగ్గర్లోని ఆసుపత్రిలో చేర్పించారు. జేబులో ఫోన్ వేసుకోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని, అదృష్టవశాత్తు ప్రాణాపాయం నుంచి సదరు వ్యక్తి తప్పించుకున్నాడని పోలీసులు అన్నారు. ఒప్పో కంపెనీకి సంబందించిన ఫోన్లలోని ఐ. సి. లో వేడి ఎక్కువ అయ్యి పేలిందని అక్కడి వారు అన్నారు. ఇలాంటి ఘటనల పట్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని ఆసుపత్రి వైద్యులు అన్నారు.