ఉభయ సభల్లో కొనసాగిన ప్రతిపక్షాల ఆందోళన

ఉభయ సభల్లో కొనసాగిన ప్రతిపక్షాల ఆందోళన
  • సోనియాకు ఈడీ నోటీసులపై కాంగ్రెస్ నిరసనలు
  • లోక్​సభ నుంచి మెజారిటీ ప్రతిపక్షాల వాకౌట్
  • రాజ్యసభలో మాత్రం యథావిధిగా క్వశ్చన్​ అవర్

న్యూఢిల్లీ: పార్లమెంట్​లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. లోక్​సభ, రాజ్యసభల్లో ప్రతిపక్షాలు ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం, జీఎస్టీ రేట్ల పెంపు, అగ్నిపథ్​ స్కీములపై నిరసనలను కొనసాగించాయి. ప్రతిపక్షాల ఎంపీలు వెల్​లోకి దూసుకెళ్లి సభా కార్యకలాపాలను అడ్డుకున్నారు. దీంతో ఉభయ సభలు పలు మార్లు వాయిదా పడ్డాయి.

లోక్​సభలో నిరసనలు.. నినాదాలు
గురువారం ఉదయం 11 గంటలకు లోక్​సభ ప్రారంభం కాగానే ప్రతిపక్ష సభ్యులు కాంగ్రెస్​ చీఫ్ సోనియా గాంధీకి ఈడీ నోటీసులు, ధరల పెరుగుదల, జీఎస్టీ రేట్లపై ఆందోళనకు దిగాయి. సభ సజావుగా నడిచేందుకు సహకరించాలని స్పీకర్​ ఓంబిర్లా కోరినా.. ప్రతిపక్ష ఎంపీలు వెల్​లోకి దూసుకొచ్చి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో స్పీకర్​ కొద్దిసేపు సభను వాయివా వేశారు. 11.30 నిమిషాలకు సభ తిరిగి మొదలైనా పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. సోనియాకు ఈడీ నోటీసులపై కాంగ్రెస్​ సభ్యులు సభను బాయ్​కాట్​ చేసి.. పార్లమెంట్​ బయట ఆందోళనకు దిగారు. ధరల పెరుగుదల, జీఎస్టీ రేట్ల పెంపుపై చర్చకు స్పీకర్​ అనుమతి ఇవ్వకపోవడంతో డీఎంకే, ఎస్పీ, బీఎస్పీ, టీఎంసీ, టీఆర్ఎస్ సభ్యులు సభ నుంచి వాకౌట్​ చేశారు. ప్రతిపక్షాలు ధరల పెరుగుదలపై చర్చకు పట్టుబడుతున్నాయని, అందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఫైనాన్స్​ మినిస్టర్ నిర్మలా సీతారామన్​ ఆరోగ్యం మెరుగుపడగానే దీనిపై చర్చిద్దామని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్​ జోషి చెప్పారు. కాంగ్రెస్​ ప్రెసిడెంట్​ కాబట్టి సోనియా సూపర్​ హ్యూమన్​ కాదని, చట్టం దగ్గర అందరూ సమానమే అనే విషయాన్ని ప్రతిపక్షాలు గుర్తించాలని సూచించారు. అయినా పరిస్థితిలో మార్పు లేకపోవడంతో సభను మధ్యాహ్నం 2.15 వరకు సభ వాయిదా పడింది. సభ తిరిగి మొదలయ్యాక ఇండియన్​ అట్లాంటిక్​ బిల్లు 2022పై చర్చ జరగాల్సి ఉంది. మెజారిటీ ప్రతిపక్ష సభ్యులు సభలో లేకపోవడంతో ఈ బిల్లుపై చర్చను వాయిదా వేశారు. అనంతరం సభను శుక్రవారానికి వాయిదా వేశారు.

మూడు రోజుల తర్వాత క్వశ్చన్​ అవర్
రాజ్యసభలో కూడా ప్రతిపక్షాల నిరసనలు కొనసాగాయి.  సభ మొదలుకాగానే ధరల అంశం, జీఎస్టీపై చర్చకు పట్టుబడుతూ కార్యకలాపాలను ప్రతిపక్షాలు అడ్డుకున్నాయి. దీంతో 12 గంటలకు వాయిదా పడింది. ఆపై సభలో క్వశ్చన్​ అవర్​ మొదలైంది. సభ్యులు అడిగిన ప్రశ్నలకు కేంద్ర మంత్రులు సమాధానాలు ఇచ్చారు. ఈ సమయంలోనూ ప్రతిపక్షాల నిరసనల మధ్యే సభను కొనసాగించారు. రాజ్యసభలో ద వెపన్స్​ ఆఫ్ మాస్​ డిస్ట్రక్షన్, డెలివరి సిస్టమ్స్(ప్రొహిబిషన్​ ఆఫ్​ అన్​లాఫుల్​ యాక్టివిటీస్) అమెండ్​మెంట్​ బిల్లు, 2022పై చర్చ మొదలైంది. ఇందులో బీజేడీ, అన్నాడీఎంకే, వైఎస్సార్‌‌‌‌సీపీ, ఆర్జేడీ, టీడీపీ, జేడీయూ, బీజేపీ, డీఎంకే సభ్యులు పాల్గొన్నారు. మెజారిటీ ప్రతిపక్ష సభ్యులు సభలో లేకపోవడంతో ఈ కీలకమైన బిల్లుపై తర్వాత చర్చిద్దామని పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి వి.మురళీధరన్​ సభను కోరారు. ఆ తర్వాత సభను శుక్రవారానికి వాయిదా వేశారు.