పార్లమెంట్లో నిరుద్యోగ, అధిక ధరలపై చర్చకు విపక్షాల డిమాండ్

పార్లమెంట్లో నిరుద్యోగ, అధిక ధరలపై చర్చకు విపక్షాల డిమాండ్

పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో నిరుద్యోగ, అధిక ధరలపై ప్రధానంగా చర్చ జరగాలని అఖిలపక్ష సమావేశంలో ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. రక్షణమంత్రి, లోక్ సభ ఉపనాయకుడు రాజ్నాథ్సింగ్ అధ్యక్షత అఖిలపక్ష భేటీ జరిగింది. కాంగ్రెస్‌, టీఎంసీలు నిరుద్యోగం అంశాన్ని ప్రధానంగా లేవనెత్తాయి. అదేవిధంగా కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగంపై చర్చకు కాంగ్రెస్‌ పట్టుబట్టింది. మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై చర్చించాలని బిజూ జనతాదళ్‌ కోరింది. కొలీజియం వ్యవస్థ వంటి అంశాల్లో ఎలాంటి రాజకీయాలు ఉండకూడదని ఈ అంశంపై విస్తృత చర్చ జరగాలని బీజేడీ మరో డిమాండ్‌ చేసింది.

దేశానికి అతిపెద్ద సవాలుగా ఉన్న జనాభా నియంత్రణ బిల్లును ప్రభుత్వం తీసుకురావాలని శివసేన డిమాండ్ చేసింది. ఈ సమావేశంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ధరల పెరుగుదలపై ప్రత్యేకించి పెట్రోల్‌, డీజిల్‌ ధరలను నియంత్రించాల్సిన అవసరాన్ని లేవనెత్తింది. నిబంధనల ప్రకారం అన్ని అంశాలపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని  పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి  తెలిపారు.  సెషన్ తేదీలను ప్రకటించే ముందు పండుగ కాలాన్ని పరిగణనలోకి తీసుకోవడం చాలా ముఖ్యం అని కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు పేర్కొన్నాయి. అన్ని పరిగణలోకి తీసుకున్నాకే సెషన్ తేదీలను ఖరారు చేశామని చెప్పారు. డిసెంబర్ 7 నుంచి డిసెంబర్ 29 వరకు పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి. 

ఈ సమావేశానికి ప్రభుత్వం తరఫున పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషి, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రులు మురళీధరన్‌, అర్జున్‌ మేఘ్వాల్, లీడర్‌ ఆఫ్‌ ది హౌస్‌ పీయూష్‌ గోయల్ హాజరయ్యారు. ప్రతిపక్షాల నుంచి అధిర్‌ రంజన్‌ చౌధరి (కాంగ్రెస్‌), సుదీప్‌ బందోపాధ్యాయ్‌, డెరెక్‌ ఓబ్రియాన్‌ (టీఎంసీ), తిరుచ్చి శివ, టీఆర్‌ బాలు (డీఎంకే), పశుపతి పరాస్‌ (ఎల్జేపీ), వందనా చవాన్‌ (ఎన్‌సీపీ), ఫరూఖ్‌ అబ్దుల్లా (నేషనల్ కాన్ఫరెన్స్‌), బినోయ్‌ విశ్వం (సీపీఐ) తదితరులు సమావేశానికి హాజరయ్యారు.