నీట్‎పై చర్చకు విపక్షాల పట్టు.. పార్లమెంట్ ఉభయ సభలు వాయిదా

నీట్‎పై చర్చకు విపక్షాల పట్టు.. పార్లమెంట్ ఉభయ సభలు వాయిదా

న్యూఢిల్లీ: పార్లమెంట్ ఉభయ సభల్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. ప్రతిపక్షాల ఆందోళనలతో సోమవారం (జులై 27) మధ్యాహ్నం 12 గంటల వరకు పార్లమెంట్ ఉభయ సభలు వాయిదా పడ్డాయి. సోమవారం సభ ప్రారంభం కాగానే నీట్ పేపర్ లీకేజీపై విపక్షాలు చర్చకు పట్టుబట్టాయి. అలాగే, నీట్ పేపర్ లీక్‎కు వ్యతిరేకంగా యువత చేపట్టిన పార్లమెంట్ మార్చ్ కార్యక్రమంలో విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగం, పెల్లెట్ గన్స్ ఉపయోగించడంపై ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి.

పోలీసుల దమనకాండపై సమగ్ర దర్యాప్తుకు ఆదేశించాలని డిమాండ్ చేశాయి. ఈ ఘటనలపై చర్చ చేపట్టాలని ఉభయ సభల్లో ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్ష ఎంపీలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. విపక్షాల ఆందోళనలతో లోక్ సభ, రాజ్య సభలో గందరగోళం ఏర్పడింది. ఈ క్రమంలో ప్రతిపక్షాల ఆందోళనపై లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నోత్తరాల తర్వాత అన్ని అంశాలపై చర్చ చేపడదామని తెలిపారు. 

చర్చకు అంగీకరించిన ఆందళన చేయడం కరెక్ట్ కాదన్నారు. సభ సజావుగా సాగేందుకు సహకరించాలని విపక్ష ఎంపీలకు సూచించారు. ఆందోళన చేసే సభ్యులపై చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. అయినప్పటికీ విపక్ష ఎంపీలు వెనక్కి తగ్గకుండా ఆందోళన కొనసాగించారు. దీంతో విపక్ష సభ్యుల నినాదాల మధ్య లోక్ సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు స్పీకర్. రాజ్య సభలోనే సేమ్ ఇదే సీన్ కొనసాగించింది. దీంతో రాజ్య సభ చైర్మన్ సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు.