హైదరాబాద్‎కు ఆరెంజ్ అలర్ట్.. రాబోయే 3 గంటల్లో సిటీలో భారీ వర్షం కురిసే ఛాన్స్

హైదరాబాద్‎కు ఆరెంజ్ అలర్ట్.. రాబోయే 3 గంటల్లో సిటీలో భారీ వర్షం కురిసే ఛాన్స్

హైదరాబాద్‎కు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 3 గంటల పాటు నగరానికి వర్ష సూచన ఉన్నట్లు ఐఎండీ తెలిపింది. సిటీలో మోస్తారు నుంచి అక్కడక్కడ భారీ వర్షం కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. నగరానికి ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడంతో జీహెచ్ఎంసీ, హైడ్రా, మాన్సూన్, ట్రాఫిక్, పోలీసులు అప్రమత్తమయ్యారు. వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. లోతట్టు ప్రాంత ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. అత్యవసరమైతేనే ఇండ్ల నుంచి బయటకు వెళ్లాలని సూచించారు. 

ఇవాళ్టి (ఆగస్ట్ 27) నుంచి గణేషుడి నవరాత్రి ఉత్సవాలు మొదలు కావడంతో నగరంలో సందడి వాతావరణం నెలకొంది. వర్షాన్ని కూడా లెక్క చేయకుండా నగర ప్రజలు బొజ్జ గణపయ్య ఆశ్వీరాదం కోసం వినాయక మండపాలకు తరలి వెళ్తున్నారు. తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఖైరతాబాద్ బడా గణపతి తొలి పూజకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివెళ్లారు. వర్షాన్ని కూడా లెక్క చేయకుండా గణనాథుడి దర్శనం కోసం క్యూ లైన్లలో  వేచి ఉన్నారు. భక్తుల రద్దీతో ఖైరతాబాద్ ప్రాంతం సందడిగా మారింది. 

కాగా, రాష్ట్రంలో ఐదు రోజులు బ్రేక్ తీసుకున్న వర్షాలు మళ్లీ మొదలయ్యాయి. కొన్ని రోజుల నుంచి పొడిగా ఉన్న వాతావరణం మంగళవారం (ఆగస్ట్ 26) ఒక్కసారిగా మారిపోయింది. ఉత్తర పశ్చిమ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడడంతో దాని ప్రభావం తెలంగాణపైనా పడింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మబ్బులు కమ్మేసి ముసురు పట్టింది. హైదరాబాద్‎తో పాటు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసింది.

హైదరాబాద్‎లో మంగళవారం (ఆగస్ట్ 26) రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా ముసురు కురుస్తూనే ఉంది. వర్షం గణనాథుడి దర్శనం కోసం వెళ్లే భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. కాగా, అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా మూడు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించిన విషయం తెలిసిందే.