ఇయ్యాల, రేపు రాష్ట్రంలో ఆరెంజ్‌ అలర్ట్‌ 

ఇయ్యాల, రేపు రాష్ట్రంలో ఆరెంజ్‌ అలర్ట్‌ 

జగిత్యాల జిల్లా ఐలాపూర్‌లో 9.6 సెం.మీ వర్షం
ఇయ్యాల, రేపు రాష్ట్రంలో ఆరెంజ్‌ అలర్ట్‌ 


హైదరాబాద్‌ : రాష్ట్రంలో వానలు దంచికొడుతున్నాయి. అనేక చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో రానున్న నాలుగు రోజులు ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. వారం రోజులుగా రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా వానలు పడుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో మంగళవారం వర్షాలు పడ్డాయి. టీఎస్‌డీపీఎస్‌ డేటా ప్రకారం జగిత్యాల జిల్లాలోని ఐలాపూర్‌లో 9.6 సెంటీమీటర్లు, సంగారెడ్డిలోని కంగ్టిలో 8.7, నిజామాబాద్‌లోని మెండోరలో 8.2, మహబూబ్‌నగర్‌లోని భూత్‌పూర్‌లో 7.6, నాగర్‌కర్నూల్‌లోని మంగనూర్‌లో 7.5, నిర్మల్‌లోని పెంబిలో 7.3 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం రికార్డయ్యింది.

బుధ, గురువారాల్లో వాతావరణ శాఖ ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది. బుధవారం ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, వరంగల్‌, హనుమకొండ, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో భారీ వర్షాలు కురవచ్చని అంచనా వేసింది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో వర్షాలు పడుతుండటంతో కడెం ప్రాజెక్టులోకి వరద చేరుతోంది. ఇప్పటికే ప్రాజెక్టు నిండగా.. వరద ఇంకింత పెరగొచ్చని అంచనా వేసిన ఇంజనీర్లు ఒక గేటు ఎత్తి నీటిని కిందికి వదులుతున్నారు. కడెం ప్రాజెక్టు నిల్వ సామర్థ్యం 7.60 టీఎంసీలకు గాను ప్రస్తుతం 6.12 టీఎంసీలు ఉన్నాయి.