లక్ష రూపాయల ఐఫోన్ ఆర్డర్ చేస్తే బియర్డ్ ఆయిల్ డెలివరీ.. ఫ్లిప్‌కార్ట్‌కు కోర్టు గట్టి షాక్

లక్ష రూపాయల ఐఫోన్ ఆర్డర్ చేస్తే బియర్డ్ ఆయిల్ డెలివరీ.. ఫ్లిప్‌కార్ట్‌కు కోర్టు గట్టి షాక్

ఆన్‌లైన్‌లో ఖరీదైన వస్తువులు కొనుగోలు చేసే సమయంలో వినియోగదారులు ఎంత అప్రమత్తంగా ఉండాలనే విషయాన్ని ముంబైలో జరిగిన ఓ ఘటన మరోసారి గుర్తు చేసింది. రూ.లక్షా 11వేలు చెల్లించి ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 14 ప్రో ఆర్డర్ చేసిన ఓ వ్యక్తికి స్మార్ట్‌ఫోన్ బదులుగా బియర్డ్ గ్రోత్ ఆయిల్ ఉన్న పార్సెల్ రావడంతో షాక్‌కు గురయ్యాడు. వెంటనే కంప్లెయింట్ చేసినప్పటికీ సమస్య పరిష్కారం కాకపోవడంతో చివరకు వినియోగదారుల కోర్టును ఆశ్రయించాడు. సుదీర్ఘ విచారణ అనంతరం కోర్టు వినియోగదారుడికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది.

ముంబైలోని పవాయ్ ప్రాంతానికి చెందిన వ్యక్తి 2023 ఏప్రిల్ 22న ఫ్లిప్‌కార్ట్‌లో రూ.లక్షా11వేల 793 విలువైన ఆపిల్ ఐఫోన్ 14 ప్రో (128 జీబీ)ను నో-కాస్ట్ ఈఎంఐ పద్ధతిలో ఆర్డర్ చేశాడు. అదే సమయంలో ఆర్డర్ చేసిన మొబైల్ కవర్, ఛార్జర్ సక్రమంగా డెలివరీ అయ్యాయి. అయితే ప్రధాన పార్సెల్ తెరిచి చూడగా అందులో ఐఫోన్‌కు బదులుగా బియర్డ్ గ్రోత్ ఆయిల్ బాటిల్, కొంత ప్యాకింగ్ మెటీరియల్ మాత్రమే కనిపించాయి.

దీంతో షాక్‌కు గురైన బాధితుడు వెంటనే ఫ్లిప్‌కార్ట్ కస్టమర్ సపోర్ట్‌ను సంప్రదించాడు. ఏప్రిల్ నుంచి మే 2023 మధ్య పలుమార్లు ఫిర్యాదు చేస్తూ.. కోరిన అన్ని డాక్యుమెంట్స్, వివరాలు సమర్పించాడు. అయినప్పటికీ రీఫండ్ ఇవ్వకపోవడం, కొత్త ఐఫోన్ పంపకపోవడంతో పాటు ప్రతి సారి ఫిర్యాదును "రిజాల్వ్డ్"గా మూసివేయడం జరిగిందని ఆరోపించాడు.

►ALSO READ | యజమాని హామీతో ఉద్యోగులకు లోన్స్.. కొత్త లోన్ యాప్ లాంచ్ చేసిన అష్నీర్ గ్రోవర్

దీంతో బాధితుడు ముంబై జిల్లా వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్‌ను ఆశ్రయించాడు. కేసును విచారించిన కమిషన్ ఫ్లిప్‌కార్ట్, సెల్లర్ అయిన ఇంటర్నేషనల్ వాల్యూ రిటైల్ ప్రైవేట్ లిమిటెడ్ వినియోగదారుడికి సరైన ఉత్పత్తిని అందించడంలో విఫలమయ్యారని పేర్కొంది. ఫిర్యాదు వచ్చిన వెంటనే దానిపై చర్యలు తీసుకోకుండా.. రీఫండ్ లేదా రీప్లేస్‌మెంట్ ఇవ్వకుండా పదేపదే ఫిర్యాదును క్లోజ్ చేయటం సేవల్లో లోపమే కాకుండా అన్యాయమైన వాణిజ్య పద్ధతిగా కోర్టు పేర్కొంది.

కోర్టు ఫ్లిప్‌కార్ట్, సెల్లర్ ఇద్దరూ కలిసి బాధితుడికి రూ.లక్షా11వేల 793 పూర్తిగా తిరిగి చెల్లించాలని, 2023 ఏప్రిల్ 22 నుంచి చెల్లింపు పూర్తయ్యే వరకు ఏడాదికి 9 శాతం వడ్డీ కూడా ఇవ్వాలని ఆదేశించింది. అలాగే మానసిక వేదన, ఇబ్బందులకు పరిహారంగా రూ.50 వేలతో పాటు న్యాయపరమైన ఖర్చుల కింద మరో రూ.20 వేలు చెల్లించాలని 45 రోజుల్లో కోర్టు తీర్పును అమలు చేయాలని స్పష్టం చేసింది.

ఈ కేసులో ఆపిల్ ఇండియాను కూడా ప్రతివాదిగా చేర్చినా, ప్యాకింగ్, డెలివరీ, సెల్లర్ కార్యకలాపాల్లో తమకు ఎలాంటి సంబంధం లేదని సంస్థ కోర్టుకు తెలిపింది. ఈ వాదనను అంగీకరించిన కమిషన్ ఆపిల్ ఇండియాపై ఉన్న ఫిర్యాదును కొట్టివేసింది. ఆన్‌లైన్ షాపింగ్‌లో తప్పు వస్తువు అందితే వెంటనే ఆధారాలు భద్రపరచడం, సంబంధిత సంస్థకు సమాచారం ఇవ్వడం, అవసరమైతే చట్టపరంగా న్యాయపరమైన చర్యలు చేపట్టడం ఎంత ముఖ్యమో ఈ ఘటన స్పష్టం చేసింది.