ప్రభుత్వ ఆస్పత్రుల్లో పెరిగిన అవయవాల మార్పిడి కేసులు

ప్రభుత్వ ఆస్పత్రుల్లో పెరిగిన అవయవాల మార్పిడి కేసులు
  • అతి త్వరలో గాంధీ ఆస్పత్రిలో కూడా..

హైదరాబాద్: ప్రభుత్వ ఆస్పత్రుల్లో అవయవాల మార్పిడి కేసులు పెరుగుతున్నాయి. కరోనా కారణంగా గత రెండేళ్లుగా తగ్గిన అవయవాల మార్పిడి ( ట్రాన్స్ ప్లాంటేషన్) కేసులు మళ్లీ ఊపందుకున్నాయి. నిమ్స్, ఉస్మానియా, గాంధీ ప్రభుత్వ దవాఖానాల్లో ఆర్గాన్ ట్రాన్సప్లాంటేషన్ జరుగుతున్నాయి. త్వరలో గాంధీ హాస్పిటల్ లో అన్ని అవయవాల మార్పిడీలకు సంబంధించిన కొత్త బ్లాక్ వస్తోంది. జిల్లాల్లోనూ ట్రాన్స్ ప్లాంటేషన్లకు ఏర్పాట్లు చేస్తోంది  వైద్య ఆరోగ్యశాఖ. 

ప్రస్తుతం టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో  అవయవాల మార్పిడి ఆపరేషన్లు ( ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంటేషన్) కాస్త సులభతరం అయ్యాయి.  అవయవాలు పాడైన వారు మరొకరి అవయవాల ద్వారా పునర్జన్మ పొందుతున్నారు. టెక్నాలజీ అందుబాటులో ఉన్నా.. లక్షలు, కోట్లు ఖర్చు చేస్తే కానీ.. ఆర్గాన్ ట్రాన్సప్లాంటేషన్ జరగట్లేదు. కానీ.. ప్రభుత్వ హాస్పిటల్స్ లో ఇవి ఉచితంగా జరుగుతున్నాయి. నిమ్స్, ఉస్మానియా, గాంధీ లాంటి దవాఖానాల్లో అవయవాల మార్పిడి విజయవంతంగా సాగుతున్నాయి.  
ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంటేషన్స్.. కుటుంబ సభ్యులు లేదా.. బ్రెయిన్ డెడ్ అయిన కేసుల నుంచే జరుగుతాయి. ఉస్మానియా హాస్పిటల్ లో ఇప్పటి వరకు 752 కిడ్నీల మార్పిడీలు జరిగాయి. వాటిల్లో లైవ్ గా 7 వందలు జరిగాయి. లివర్ మార్పిడితో 18 మందికి ప్రాణం పోయగా, అందులో కడవర్ 12, లైవ్ 5 జరిగినట్లు ఉస్మానియా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నాగేంద్ర వెల్లడించారు. 

గాంధీ ఆస్పత్రిలో కొత్త బ్లాక్
గాంధీ హాస్పిటల్ లో త్వరలో అన్ని అవయవాలను మార్పిడి శస్త్ర చికిత్సలు చేసేందుకు వైద్యశాఖ సన్నాహాలు చేస్తోంది. 8వ ప్లోర్ లో కొత్త బ్లాక్ ఏర్పాటు చేస్తున్నారు. ఈమధ్యే బ్లాక్ ను వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హారీష్ రావు ప్రారంభించారు. అయితే పనులన్నీ పూర్తయి అందుబాటులోకి రావడానికి మరో ఆరు నెలలు పట్టనుంది. ఈ బ్లాక్ లో గుండె, కిడ్నీ, లివర్.. ఇలా అన్ని అవయవాల మార్పిడి చేయొచ్చు. 

ఆరోగ్యశ్రీ ఉంటే చికిత్స.. మందులు కూడా జీవితాంతం ఉచితం

అవయవాల మార్పిడి ఆపరేషన్లు ఎక్కువగా నిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో జరుగుతున్నాయి. కిడ్నీ, లివర్, గుండె, లంగ్ తదితర అవయవాలను ఒకరి నుంచి మరొకరికి అమరుస్తున్నారు. నిమ్స్, గాంధీ, ఉస్మానియాలోనే కాకుండా.. జిల్లాల్లోనూ ఆర్గాన్ ట్రాన్సప్లాంటేషన్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది వైద్యశాఖ. బ్రెయిన్ డెడ్ పేషంట్స్ అవయవాలు వృధాగా మారి, పనికి రాకుండా పోతున్న నేపథ్యంలో  జిల్లాల్లోనూ ఆపరేషన్లు చేయాలని ప్రణాళిక సిద్ధం చేస్తోంది వైద్య ఆరోగ్యశాఖ. అవయవాల మార్పిడిని ఆరోగ్యశ్రీ ఉన్నవారందరకీ.. ఉచితంగా చేస్తున్నాయి ప్రభుత్వ హాస్పిటల్స్.

అంతేకాక.. లైఫ్ టైం ఉచితంగా మందులు అందిస్తోంది. దీంతో.. ప్రైవేట్ కి పోయి లక్షలు పోగొట్టుకోవడం కంటే.. ప్రభుత్వ ఆస్పత్రే మేలని వస్తున్నారు పేదలు. అవయవాలు (ఆర్గాన్స్) పాడైన కేసులు రోజు రోజుకి పెరుగుతుండటంతో.... సర్కార్ హాస్పిటల్స్ లో ట్రాన్స్ ప్లాంటేషన్ వసతులను మరింత పెంచేందుకు కృషి చేస్తోంది వైద్యశాఖ. తక్కువ వయసున్న వారిలో అవయవాలు పాడై వేలమంది ప్రాణాలు కోల్పోవడంతో.. ప్రభుత్వ దావాఖానల్లో అవయవాల మార్పిడి జరిగితే పేదలకు మేలు జరుగుతుందంటున్నారు రోగులు.