ఉస్మానియా హాస్పిటల్: సమస్యలకు కేరాఫ్ అడ్రస్

ఉస్మానియా హాస్పిటల్: సమస్యలకు కేరాఫ్ అడ్రస్

ఉస్మానియా హాస్పిటల్ సమస్యలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. పెరుగుతున్న పేషంట్ల సంఖ్యకు అనుగుణంగా సదుపాయాలు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు రోగులు. వ్యాధి నిర్ధారణలో కీలకమైన MRI, సిటీ స్కాన్ లకోసం అవస్థలు నిత్యకృత్యం కాగా… సాధారణ టెస్టుల కోసం కూడా బయటికెళ్లాల్సిన పరిస్థితి వస్తోందంటున్నారు జనం. డాక్టర్లు చికిత్స బాగానే చేస్తున్నా.. రాసిన మందుల్లో సగంకూడా దొరక్కపోవడం పై మండిపడుతున్నారు.

వందేళ్ల చరిత్ర కలిగిన ఉస్మానియా దవాఖానా ప్రజల నమ్మకాన్ని కోల్పోతుంది. ఎన్నో లక్షల మందికి వైద్యం అందించిన ధర్మాసుపత్రిలో అరకొర సౌకర్యాలు దర్శనమిస్తున్నాయి.  అప్పుడప్పుడు రేర్ సర్జరీలు చేస్తున్నామని చెప్పుకుంటున్నా.. సీజనల్ వ్యాదులకు, ట్రామా కేసులతో వచ్చే పేషంట్లకు మాత్రం వైద్యం అంతంత మాత్రంగానే అందుతోందన్న విమర్శలున్నాయి. ఎంఆర్ఐ సిటిస్కాన్, ఆల్ట్రా సౌండ్ లాంటి పెద్దపెద్ద టెస్టుల సంగతి అటుంచి థైరాయిడ్ లాంటి వాటికి కూడా బయటికి వెళ్లాల్సిరావడంపై పేషంట్లు ఆందోళనవ్యక్తం చేస్తున్నారు.

గంటల తరబడి క్యూలో నిలబడి డాక్టర్స్ కు చూపిస్తే…..చివరకు ప్రిస్షిఫ్షన్ లో రాసిన మెడిసిన్స్ కూడా దొరకడం లేదంటున్నారు పేషంట్ల బంధువులు. దీర్ఘకాలిక జబ్బులతో ఇబ్బందిపడ్తున్నవారికి పది, పదిహేనుకు మించి మందు బిళ్లలు ఇవ్వడంలేదంటున్నారు. సాధారణ జబ్బులతో పాటు, సీజనల్ జ్వరాలకు కూడా డాక్టర్స్ రాసే మందుల్లో సగానికిపైగ దొరకడం లేదని… దీంతో బయటికెళ్లి కొనాల్సి వస్తోందని ఆవేదన చెందుతున్నారు.

గతంతో పోలిస్తే..ఉస్మానియా దవాఖానాకు వచ్చే రోగుల సంఖ్య బాగా పెరిగిందంటున్నారు సిబ్బంది. రోగుల సంఖ్యకు అనుగుణంగానే వైద్యం కూడా అందిస్తున్నామంటున్నారు. వాస్తవానికి TSMSIDC నుంచి మందులు త్వరగానే వస్తున్నాయని…వారి నుంచి సప్లై ఆగిపోతే…స్వంతంగా HDS ఫండ్ నుంచి కొనుగోలు చేసే చాన్స్ పరిస్థితి వస్తుందంటున్నారు. టెస్టుల కోసం పేషంట్లను బయటికి పంపడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఘన చరిత్ర కలిగిన ఉస్మానియాలో మెరుగైన వైద్యం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. ఉస్మానియా హాస్పిటల్, ఇతర ప్రభుత్వ హాస్పటల్లలోనూ మెరుగైన సేవలు అందేలా.. చర్యలు తీసుకోవాలంటున్నారు.