- గ్లైకోజెన్ స్టోరేజ్ తో మృత్యువు అంచున బాబు
- తండ్రి కాలేయంతో ట్రాన్స్ ప్లాంట్ చేసి జీవం పోసిన డాక్టర్లు
- 14 గంటల పాటు ఆపరేషన్
హైదరాబాద్, వెలుగు: ఉస్మానియా హాస్పిటల్ డాక్టర్లు క్లిష్టమైన లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ ను విజయవంతంగా నిర్వహించి 18 నెలల చిన్నారికి ప్రాణం పోశారు. అత్యంత ఖర్చుతో కూడిన అరుదైన చికిత్సను ఫ్రీగా చే ప్రభుత్వ హాస్పిటల్స్ ఘనతను మరోసారి చాటారు. హైదరాబాద్ కు చెందిన మహ్మద్ ఇర్ఫాన్, సాజియా దంపతుల కుమారుడు అఫన్ (18 నెలలు) గత కొంతకాలంగా వింత లక్షణాలతో బాధపడుతున్నాడు.
బాబు ఎప్పుడూ ఆకలితో ఏడుస్తూ ఉండడం, మత్తుగా కనిపించడం, పొట్ట విపరీతంగా ఉబ్బిపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనతో ఉస్మానియాకు తీసుకొచ్చారు. పరీక్షించిన డాక్టర్లు... బాబు శరీరంలోని గ్లైకోజెన్ ను గ్లూకోజ్ గా మార్చే ఎంజైమ్ లోపించిందని నిర్ధారించారు. దీనినే వైద్య పరిభాషలో ‘గ్లైకోజెన్ స్టోరేజ్ డిసీజ్ (టైప్-3)’ అంటారు. దీనివల్ల కాలేయం అసాధారణంగా పెరిగిపోయి బాబు ప్రాణాపాయ స్థితికి చేరుకున్నాడు.
- తండ్రి నుంచి 240 గ్రాముల కాలేయం తీసి...
చిన్నారి ప్రాణాలను కాపాడాలంటే లివర్ ట్రాన్స్ ప్లాంట్ చేయాలని డాక్టర్లు నిర్ణయించారు. అయితే 18 నెలల వయసు,10 కిలోల బరువున్న చిన్నారికి లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయడం అత్యంత సవాలుతో కూడుకున్నది. కానీ బాబును కాపాడడానికి అదే ఏకైక మార్గమని డాక్టర్ మధుసూదన్ నేతృత్వంలోని సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ బృందం నిర్ణయించింది. బాబు తండ్రి ఇర్ఫాన్ ముందుకు వచ్చి తన కాలేయాన్ని ఇచ్చేందుకు సిద్ధపడ్డారు. డాక్టర్లు తండ్రి కాలేయం నుంచి 240 గ్రాములను సేకరించి, 14 గంటల పాటు శ్రమించి బాబుకు అమర్చారు. అత్యంత సున్నితమైన ఈ శస్త్రచికిత్సను ఎటువంటి ఆటంకాలు కలగకుండా విజయవంతంగా పూర్తి చేశారు. ప్రస్తుతం బాబు కోలుకుంటున్నాడని, ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు వెల్లడించారు.
- రూ. 50 లక్షల వైద్యం ఫ్రీగా...
ఈ తరహా అరుదైన శస్త్రచికిత్సకు ప్రైవేట్, కార్పొరేట్ హాస్పిటల్స్ లో సుమారు రూ. 40 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు ఖర్చవుతుంది. అంత పెద్ద మొత్తాన్ని భరించే స్తోమత లేని ఆ పేద కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వ రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఫ్రీగా చేశారు. ఒక్క పైసా ఖర్చు లేకుండా ఈ ఆపరేషన్ పూర్తి చేయడమే కాకుండా, ట్రాన్స్ ప్లాంటేషన్ అనంతరం అవసరమైన ఖరీదైన మందులను కూడా ప్రభుత్వమే ఉచితంగా అందిస్తోంది. ప్రభుత్వ రంగంలో ఇటువంటి క్లిష్టమైన ఆపరేషన్లు జరగడం వైద్య రంగంలో ఒక మైలురాయి అని ఉస్మానియా సూపరింటెండెంట్ డాక్టర్ రాకేశ్ సహాయ్ కొనియాడారు.
- డాక్టర్లకు మంత్రి అభినందనలు...
ప్రాణాపాయ స్థితిలో ఉన్న చిన్నారిని కాపాడిన ఉస్మానియా డాక్టర్ల టీమ్ ను రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అభినందించారు. ప్రభుత్వ దవాఖానలపై ప్రజల్లో నమ్మకాన్ని పెంచేలా డాక్టర్లు కృషి చేస్తున్నారన్నారు. పేదలకు అత్యుత్తమ వైద్యం అందించాలన్న ప్రభుత్వ లక్ష్యానికి ఈ విజయం ఒక నిదర్శనమని మంత్రి పేర్కొన్నారు.

