ఓయూ బడ్జెట్ రూ.796.45 కోట్లు..  లోటు బడ్జెట్‌గా ఆమోదం

ఓయూ బడ్జెట్ రూ.796.45 కోట్లు..  లోటు బడ్జెట్‌గా ఆమోదం

ఓయూ, వెలుగు: ఉస్మానియా యూనివర్సిటీ 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్​ను గురువారం పరిపాలన భవనంలోని అకాడమీ సెనేట్ హాల్లో కామర్స్ విభాగం సీనియర్ ప్రొఫెసర్ వి.అప్పారావు ప్రవేశపెట్టారు. బడ్జెట్ లో ఆదాయాన్ని రూ.718.86 కోట్లుగా చూపెట్టారు. గత ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి రూ.32.91 కోట్ల ఓపెనింగ్ బ్యాలెన్స్​తో కలిపి మొత్తం రూ.751.77 కోట్ల నిధులు అందుబాటులో ఉండగా, వ్యయం రూ.796.45 కోట్లుగా చూపించారు.

మొత్తంగా రూ.44.68 కోట్ల లోటుతో బడ్జెట్​ను ఆమోదించారు. ప్రభుత్వం ఇచ్చే బ్లాక్ గ్రాంట్ రూ.487.03 కోట్లు మినహా,  మిగిలిన నిధులను యూనివర్సిటీ అంతర్గతంగా సమకూర్చుకోనుంది. బడ్జెట్​సెషన్​సందర్భంగా వీసీ ప్రొఫెసర్ రవీందర్ యాదవ్ మాట్లాడుతూ.. 2023–24 వార్షిక నివేదికను చదివి వినిపించారు. చేపట్టిన అభివృద్ధి పనులు, తీసుకున్న నిర్ణయాలు, వర్సిటీ నిర్వహించనున్న కామన్ ఎంట్రెన్స్ టెస్టుల వివరాలను తెలియజేశారు.

అధ్యాపకులకు యూజీసీ పే స్కేల్ బకాయిలు చెల్లించేందుకు ప్రత్యేక గ్రాంట్​రూపంలో ప్రభుత్వం నుంచి రూ.55.00 కోట్లు మంజూరైందన్నారు. రూ.35.63 కోట్లు అంతర్గత ఆదాయాల ద్వారా, ఎగ్జామినేషన్ బ్రాంచ్, యూనివర్సిటీ ఫారెన్ రిలేషన్స్ ఆఫీస్, పీజీఆర్ఆర్సీడీఈ, డైరెక్టరేట్ ఆఫ్ పీజీ అడ్మిషన్స్, డైరెక్టరేట్ ఆఫ్ అకాడమిక్ ఆడిట్, టీఎస్పీజీఈటీ కన్వీనర్ తదితర సంస్థల నుంచి నిధుల మళ్లింపు ద్వారా రూ.138.50 కోట్లు, లోన్లు, అడ్వాన్సులు వసూల ద్వారా రూ.2.70 కోట్లు సమకూర్చుకుంటామని పేర్కొన్నారు. మొత్తం బడ్జెట్​లో అధ్యాపకులు, ఉద్యోగుల వేతనాలకు రూ.451.28 కోట్లు, పెన్షన్లకు రూ.295 కోట్లు కేటాయించారు.

అత్యవసరాలకు రూ.47.17 కోట్లు, ఉద్యోగుల లోన్లకు రూ.3 కోట్లు కేటాయించారు. కాగా, ఉద్యోగుల వేతనాలు, పదవీ విరమణ చేసిన వారి పెన్షన్లకే బడ్జెట్​సరిపోతోంది. ఉద్యోగుల వేతనాలకు రూ.451.28 కోట్లు అవసరముండగా, ఇది వర్సిటీ మొత్తం బడ్జెట్లో 56.66 శాతంగా, పెన్షన్లకురూ.295 కోట్లు కేటాయించగా, ఇది 37.04 శాతంగా ఉంది. మిగిలినదాంట్లో 5.92 శాతం కాంటింజెన్సీకి, 0.38 శాతం ఉద్యోగుల రుణాలకు కేటాయించారు. 2015-–16 ఆర్థిక సంవత్సరంలో ఈ శాతం 65.75గా ఉండగా, ఉద్యోగులకు వేతనాలు పెరిగిన దృష్ట్యా యూనివర్సిటీపై మరింత భారం పడింది.