
- టీ-సాట్ను సందర్శించిన ఓయూ వీసీ
హైదరాబాద్, వెలుగు: రాబోయే రోజుల్లో టీసాట్ ద్వారా ఉన్నత విద్యకు సంబంధించిన కార్యక్రమాలు రూపొందించి విద్యార్థులకు అందిస్తామని, ఓయూకు చెందిన సబ్జెక్టు నిపుణులతో కార్యక్రమాలను రూపొందిస్తామని ఉస్మానియా యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ మొలుగరం కుమార్ తెలిపారు. ఈ మేరకు ఓయూ అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. శుక్రవారం ఆయన అంబేద్కర్ ఓపెన్ వర్శిటీలోని టీసాట్ చానల్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రతీ ఇంటికి ఉన్నత విద్యను చేర్చాలనే ఆశయంతో, టీసాట్‌తో కలిసి పనిచేస్తామన్నారు. దీనికి సంబంధించి గతంలోనే టీసాట్‌తో ఎంఓయూ కుదిరిందని పేర్కొన్నారు.
టీసాట్ సీఈవో వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ, విద్యను అందరికీ చేర్చేందుకు టీసాట్ కృషి చేస్తుందని వివరించారు. రాబోయే రోజుల్లో ఓయూతో కలిసి మరింత విస్తృతంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నత విద్యను ప్రతీ ఇంటికి చేర్చే లక్ష్యాన్ని సాధిస్తామని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఓయూ రిజిస్ట్రార్ ప్రొ.జి.నరేష్ రెడ్డి, వీసీ ఓఎస్డీ ప్రొ. జితేందర్ కుమార్ నాయక్, ఓయూ యూజీసీ అపైర్స్ డీన్ ప్రొ. లావణ్య, ఈఎంఆర్సీ డైరెక్టర్ రఘుపతి పాల్గొన్నారు.