
ప్రధాని మోడీ తెలంగాణ పర్యటనను నిరసిస్తూ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ వద్ద విద్యార్థి సంఘం నాయకులు ఆందోళన నిర్వహించారు. మోడీ తెలంగాణ రాష్ట్రంలోకి అడుగుపెట్టొద్దు అంటూ టీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో.. విద్యార్థి సంఘం నాయకులు నిరసనకు దిగారు. నల్ల జెండాలతో ఆందోళన వ్యక్తం చేశారు. మోడీ గో బ్యాగ్ అంటూ నినాదాలు చేశారు. నిరసనకారులను పోలీసులు అరెస్టు చేసేందుకు ప్రయత్నించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు, నిరసనకారుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కొందరు విద్యార్థులను బలవతంగా పోలీసులు వ్యాన్ ఎక్కంచి స్టేషన్కు తరలించారు.
ఇదిలా ఉంటే.. బంజారాహిల్స్ లోని కేబీఆర్ పార్కు వద్ద తెలంగాణ చేనేత యూత్ ఫోర్స్ నిరసన వ్యక్తం చేశారు. గో బ్యాక్ మోడీ అంటూ నినాదాలు చేశారు. నల్ల బెలూన్లు గాల్లోకి ఎగురవేసి యూత్ ఫోర్స్ సభ్యులు నిరసన తెలిపారు. చేనేత మీద ఐదు శాతం జీఎస్టీని ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.
మరోవైపు.. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలో సీపీఐ, సీపీఎం నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు. మోడీ పర్యటనను అడ్డుకుంటామన్న సిపిఐ, సిపిఎం నాయకులను ఎక్కడికక్కడ అరెస్టు చేస్తున్నారు. మధ్యాహ్నం మోడీ తెలంగాణ పర్యటనకు రానున్న నేపథ్యంలో.. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో పోలీసులు గస్తీ కాస్తున్నారు. మోడీ పర్యటనలో ఎలాంటి ఆటంకం కలుగకుండా భద్రత కట్టుదిట్టం చేశారు.