విదేశీ గేమింగ్ ముఠాల చేతికి .. మన బ్యాంక్​ అకౌంట్లు

విదేశీ గేమింగ్ ముఠాల చేతికి .. మన బ్యాంక్​ అకౌంట్లు
  • సప్లయ్​ చేస్తున్న సైబర్​నేరగాడి అరెస్ట్.. రూ.1.40 కోట్లు స్వాధీనం
  • 52 డెబిట్ కార్డులు, హార్డ్‌‌డిస్క్‌‌లు సీజ్

హైదరాబాద్‌‌, వెలుగు :  చైనా, హాంకాంగ్‌‌, దుబాయ్‌‌ అడ్డాగా ఆన్‌‌లైన్‌‌ గేమింగ్ నిర్వహిస్తూ కోట్లు కొల్లగొడుతున్న సైబర్ నేరగాళ్లకు బ్యాంక్ అకౌంట్స్, మర్చంట్‌‌ ఐడీలను అందిస్తున్న వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. హర్యానాకు చెందిన సైబర్ నేరగాడు హితేశ్‌‌ గోయల్‌‌(36)ను సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి రూ.1.40 కోట్ల నగదు, 36 చెక్ బుక్స్‌‌, 52 డెబిట్ కార్డులు, 23 సెల్‌‌ఫోన్స్, 3 హార్డ్‌‌ డిస్క్‌‌లు స్వాధీనం చేసుకున్నారు. ఈ గ్యాంగ్‌‌ వివరాలను సిటీ జాయింట్ సీపీ ఏవీ రంగనాథ్‌‌తో కలిసి హైదరాబాద్‌‌ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి శనివారం వెల్లడించారు.

కమీషన్లు ఇచ్చి అకౌంట్స్ ​సేకరణ..

హర్యానాకు చెందిన హితేష్‌‌ గోయల్‌‌ ఆన్‌‌లైన్‌‌ గేమింగ్‌‌ ద్వారా మోసాలకు పాల్పడుతున్నాడు. ఇందుకోసం ఢిల్లీలో ఆఫీస్‌‌ ఓపెన్ చేశాడు. చైనా, హాంకాంగ్‌‌, దుబాయి, ఫిలిఫిన్స్ సహా వివిధ దేశాల్లోని సైబర్ నేరగాళ్లతో నెట్‌‌వర్క్‌‌ ఏర్పాటు చేసుకున్నాడు. డపాబెట్‌‌. కామ్‌‌ అనే ఆన్‌‌లైన్‌‌ బెట్టింగ్ ఆర్గనైజర్లతో కలిసి మోసాలకు పాల్పడుతున్నాడు. సంజీవ్ అనే తన ఫ్రెండ్‌‌తో కలిసి బ్యాంక్ అకౌంట్స్ సేకరించేవాడు. అకౌంట్‌‌ హోల్డర్లకు కమీషన్స్‌‌ ఇచ్చేవారు. గేమింగ్‌‌ ఆర్గనైజర్లకు బ్యాంక్ అకౌంట్స్, మర్చంట్‌‌ ఐడీలను అందించేవాడు. ఈ క్రమంలోనే ఆన్‌‌లైన్ ట్రాన్సాక్షన్స్ కోసం అవసరమైన మర్చంట్ ఐడీలు, నెట్‌‌బ్యాంకింగ్‌‌ క్రియేట్‌‌ చేసేవారు.

రూ.70 లక్షలు కోల్పోయిన బాధితుడి ఫిర్యాదుతో..

బ్యాంక్ అకౌంట్స్‌‌తో లింక్ అయిన ఫోన్‌‌ నంబర్స్‌‌ తమ వద్దనే ఆపరేట్ చేసేవారు. ఇంటర్నేషనల్ సైబర్‌‌‌‌ నేరగాళ్లు ఇండియా ఫోన్‌‌ నంబర్స్‌‌తో విదేశాల నుంచి కాల్స్ చేస్తుండే వారు. ఇలా డపాబెట్‌‌. కామ్‌‌ వెబ్‌‌సైట్‌‌ ద్వారా ఆన్‌‌లైన్‌‌ మోసాలకు పాల్పడుతున్నారు. గతేడాది సోమాజిగూడకు చెందిన ఓ వ్యక్తిని మోసం చేశారు. ఆన్‌‌లైన్ గేమింగ్‌‌లో విన్నర్‌‌‌‌గా చూపుతూ మొదట్లో డబ్బులు డిపాజిట్‌‌ చేశారు. ఆ తర్వాత పెద్ద మొత్తంలో బెట్టింగ్‌‌ పెట్టిస్తున్నారు. ఇలా రూ.70 లక్షలు వసూలు చేశారు. చివరకు మోసపోయానని గుర్తించిన బాధితుడు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఏసీపీ శివమారుతి ఆధ్వర్యంలో పోలీసులు దర్యాప్తు చేశారు. ఢిల్లీ బ్యాంక్‌‌ అకౌంట్స్‌‌ను గుర్తించారు. హితేష్‌‌ గోయల్‌‌ను అరెస్ట్ చేశారు.