మా అభివృద్ధి మోడల్ సూపర్ రైతులు, పేదలకు ప్రాధాన్యత.. : హర్యానా సీఎం ఖట్టర్

మా అభివృద్ధి మోడల్ సూపర్ రైతులు, పేదలకు ప్రాధాన్యత.. : హర్యానా సీఎం ఖట్టర్
  • రాష్ట్రంలో జాతీయ, ప్రాంతీయ పత్రికల జర్నలిస్టుల పర్యటన

హైదరాబాద్, వెలుగు: కొత్త విధానాలు, పకడ్బందీ ప్రణాళికలతో ప్రజలకు సేవచేస్తూ అభివృద్ధిలో ముందుకెళుతున్నామని హర్యానా సీఎం మనోహర్​ లాల్​ ఖట్టర్​ చెప్పారు. ఆదివారం తనను కలిసిన వివిధ రాష్ట్రాల జర్నలిస్టులకు వివరించారు. హైదరాబాద్ తో పాటు దేశంలోని ప్రముఖ నేషనల్, రీజియనల్ న్యూస్ పేపర్ల జర్నలిస్టులను అక్కడి ప్రభుత్వం ఆహ్వానించింది. నాలుగు రోజుల పాటు ఆ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో సుమారు 20 మంది జర్నలిస్టుల బృందం పర్యటించింది. అక్కడ క్షేత్ర స్థాయిలో అమలవుతున్న వివిధ పథకాలను పరిశీలించింది. లబ్ధిదారులతో నేరుగా మాట్లాడింది. ఆ తర్వాత చివరగా ఆదివారం సీఎం మనోహార్ లాల్ ఖట్టర్ జర్నలిస్టులతో సమావేశమై తమ ప్రభుత్వ పాలన తీరుపై వివరించారు. పార్టీ పరంగా, పాలనా పరంగా ప్రధాని మోడీ తీసుకుంటున్న నిర్ణయాలు అత్యంత 
ప్రభావవంతంగా ఉన్నాయని చెప్పారు. 


గోల్డెన్ ​డాటా


ఆధార్ లాగానే రాష్ట్రంలో కుటుంబాలకూ ‘పరివార్ పెహచాన్ పత్ర్’ (ఫ్యామిలీ ఐడెంటిటీ కార్డు)’ ఇస్తున్నామన్నారు. ఎవరికైనా ఏదైనా సేవలు, అవసరమైతే ఆ నంబర్ చెప్తే సరిపోతుందని చెప్పారు. ఇప్పటికే కుటుంబాల వెరిఫికేషన్ అంతా పూర్తయిందని, ప్రభుత్వం దగ్గర ఉన్న సమాచారమంతా(గోల్డెన్​డాటా) తాజాదేనన్నారు. రైతులకు ‘‘భవంతార్ భార్పేయి యోజన’’ ద్వారా క్యాష్ ఇన్సెంటివ్స్ ఇస్తున్నామని చెప్పారు. మద్దతు ధర, మార్కెట్ ధర మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. ఇదే స్కీం కింద సుమారు 9 లక్షల మంది రైతులు మేరీ ఫసల్ మేరా బోయ్రా కార్యక్రమంతో లబ్ధి పొందుతున్నారు.


తక్కువ నీటితో పండిస్తే ఎకరానికి 7 వేలు


హర్యానాలో నీళ్ల కరువు తీవ్రంగా ఉంది. భూగర్భజలాలు అడుగంటిపోతున్నాయి. చెరువులు, రిజర్వాయర్ల ద్వారా వచ్చే నీళ్లు తక్కువే. ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం ‘‘మేరా పానీ.. మేరీ విరాసత్’’ తీసుకొచ్చింది. ఆ పథకంతో నీటి అవసరం తక్కువగా ఉండే పంటలు పండించిన రైతులకు ఎకరాకు రూ.7 వేలను ఇస్తున్నది. దీంతో రాష్ట్రంలో లక్ష ఎకరాల మేర వరి సాగు తగ్గింది.


ప్రజలే.. ప్రభుత్వానికి విద్యుత్ అమ్ముతున్నరు


ఇక దేశంలోనే112 కాల్ సెంటర్ నిర్వహణలో హర్యానా రెండో స్థానంలో నిలిచింది. దీని కింద ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్–పోలీస్, అంబులెన్స్, ఫైర్ సర్వీసులన్నీ వస్తాయి. పిల్లలకు ఆధునాతనమైన, శాస్త్ర, సాంకేతికతో కూడిన డిజిటల్, ఈ టెక్నాలజీ విద్యను అందించేందుకు ‘‘ఈ అధిగమ్” పథకం ప్రవేశపెట్టారు. ‘మోడల్ పాండ్స్’ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా నీటి కాలువలు, చెరువులను ఆధునీకీకరిస్తూ మంచి నీరుగా మార్చుతున్నారు. బిజిలీ స్కీం కింద అందుబాటులో ఉన్న వనరులతో విద్యుత్తును ఉత్పత్తి చేసుకోవడం, దాన్ని అమ్ముకొని ఆదాయం పొందడం ఇక్కడి ప్రజలకు ప్రభుత్వం అలవాటు చేసింది.