మన హైదరాబాద్.. మన బీజేపీ

మన హైదరాబాద్.. మన బీజేపీ

ఇదే నినాదంతో జీహెచ్ఎంసీ ఎలక్షన్లకు వెళ్లాలని పార్టీ నిర్ణయం

పెద్ద సంఖ్యలో చేరికలపై నజర్
త్వరలోనే ఎమ్మెల్సీ క్యాండిడేట్ల ప్రకటన
బీజేపీ ఆఫీసు బేరర్ల సమావేశంలో నిర్ణయం

హైదరాబాద్, వెలుగు: ‘మన హైదరాబాద్.. మన బీజేపీ’ నినాదంతో గ్రేటర్ హైదరాబాద్​ ఎలక్షన్లకు రెడీ కావాలని బీజేపీ నిర్ణయించింది. డివిజన్లలో సర్వేలు చేసి, వాటి ఆధారంగానే కార్పొరేటర్ క్యాండిడేట్లను ప్రకటించాలని, వీలైనంత త్వరగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని భావిస్తోంది. ఇతర పార్టీల్లోని అసంతృప్తులు, జనంతో మంచి సంబంధాలున్న నేతలను బీజేపీలో చేర్చుకోవాలని ఆలోచనకు వచ్చింది. శనివారం హైదరాబాద్​లోని పార్టీ స్టేట్ ఆఫీసులో బీజేపీ రాష్ట్ర ఆఫీసు బేరర్ల సమావేశం ప్రధానంగా చర్చించింది. పార్టీ రాష్ట్ర చీఫ్​ బండి సంజయ్ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్, సీనియర్​ నేతలు వివేక్ వెంకటస్వామి, మంత్రి శ్రీనివాసులు, ప్రేమేందర్ రెడ్డి, బంగారు శృతి తదితరులు పాల్గొన్నారు. గ్రేటర్  హైదరాబాద్​ పరిధిలో ప్రజా సమస్యలను పరిష్కరించేది బీజేపీ మాత్రమేనని.. గత జీహెచ్ఎంసీ ఎలక్షన్లలో టీఆర్ఎస్ ఎన్నో హామీలు గుప్పించి ఒక్కటి కూడా అమలు చేయలేదన్న విషయాన్ని జనంలోకి బలంగా తీసుకెళ్లాలని నిర్ణయించారు. ‘‘డబుల్​ బెడ్రూం ఇండ్ల హామీతో 2016లో గెలిచిన టీఆర్ఎస్.. ఇప్పటికీ ఇండ్లు కట్టించలేదు. దీన్ని గ్రేటర్ ఎన్నికల్లో ప్రధాన ప్రచారాస్త్రంగా వాడుదాం. విశ్వనగరం హామీని కూడ జనంలో ఎండగడుదాం. సర్కార్ ఎల్ఆర్ఎస్ పేరుతో పేద, మధ్య తరగతి వర్గాలపై ఆర్థిక భారం మోపుతోంది. టీఆర్ఎస్ సర్కార్ తీరును ప్రజలకు వివరిద్దాం..” అని అభిప్రాయపడ్డారు.

ఎమ్మెల్సీ ఎలక్షన్లపైనా చర్చ

త్వరలో జరగనున్న హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్.. వరంగల్, నల్గొండ, ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లపైనా మీటింగ్లో చర్చించారు. హైదరాబాద్ సిట్టింగ్ సీటుతో పాటు గత ఎలక్షన్​లో రెండో ప్లేస్​లో నిలిచిన వరంగల్ సీటును కూడా ఈసారి గెలుచుకునేలా కృషి చేస్తామని నేతలు పేర్కొన్నారు. డిసెంబర్ 31 వరకు కొత్త ఓటర్ల ఎన్ రోల్ మెంట్ కు గడువు ఉండడంతో పెద్ద సంఖ్యలో యువతను, ఉపాధ్యాయ, ఉద్యోగ వర్గాలను చేర్పించాలని నిర్ణయించారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో పార్టీ కేడర్​ ప్రాణాలను తెగించి పని చేసిందని, కార్యకర్తలు, నేతల పనితీరు బాగుందని అందరూ మెచ్చుకున్నారు. అయితే అధికార పార్టీ నేతలు సిద్దిపేట బీజేపీ నేతలపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేయడాన్ని, భయాందోళనలకు గురి చేయడాన్ని ఖండించారు. టీఆర్ఎస్ ఎంత అధికార దుర్వినియోగానికి పాల్పడినా, కోట్లు కుమ్మరించినా దుబ్బాక రిజల్ట్ బీజేపీకి అనుకూలంగా వస్తుందన్న ధీమా వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నారని, ఈ తీరును నిలదీస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడదామని నిర్ణయించారు. .

గిరిజన యువతిపై అత్యాచారం చేసినవాళ్లను కఠినంగా శిక్షించాలె..

సూర్యాపేట జిల్లా పిక్లా తండాకు చెందిన గిరిజ న యువతి రేప్, మర్డర్ కేసులో పోలీసులు సరైన చర్యలు తీసుకోలేదని ఆమె తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై శనివారం బీజేపీ స్టేట్ ఆఫీసులో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర చీఫ్​బండి సంజయ్ లను కలిసి గోడు వెళ్లబోసుకున్నారు. వెంటనే నిందితులను అరెస్టు చేసి పూర్తిస్థాయిలో విచారణ జరపాలని.. కఠినశిక్ష పడేలా చర్యలు చేపట్టాలని కోరారు.

మాయ మాటలతో మళ్లీ వస్తరు.. నమ్మొద్దు: ప్రేమేందర్​రెడ్డి

జీహెచ్ఎంసీ ఎలక్షన్లలో గెలిచేందుకు టీఆర్ఎస్​ నాయకులు మళ్లీ మాయ మాటలతో వస్తారని.. వారిని నమ్మి మోసపోవద్దని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. గత జీహెచ్ఎంసీ ఎలక్షన్లలో టీఆర్ఎస్​ ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ నెరవేర్చలేదని ఆరోపించారు. టీఆర్ఎస్ కు ప్రజలు తగిన బుద్ధి చెప్పాలన్నారు. మేయర్ పీఠం దక్కించుకోవడమే లక్ష్యంగా బీజేపీ గ్రేటర్ ఎన్నికల బరిలోకి దిగుతోందని చెప్పారు.

For More News..

నాన్ అగ్రికల్చర్ ఆస్తుల రిజిస్ట్రేషన్​ ఎప్పుడు?