- ఇరాన్ యుద్ధం, రూపాయి పతనం వంటి కారణాలతో తగ్గిన ఫారిన్ ట్రిప్‌లు
- మార్చిలో మొత్తం ఔట్‌వర్డ్ రెమిటెన్స్ రూ.24,864 కోట్లు
న్యూఢిల్లీ: క్రూడాయిల్ ధరలు పెరగడంతో దేశ ఫారెక్స్ నిల్వలు పడిపోతున్న వేళ, భారతీయులు తమ విదేశీ ప్రయాణాలు, హాలిడే ట్రిప్‌లను భారీగా తగ్గించుకుంటున్నారు. ఇరాన్ యుద్ధం వల్ల ఎయిర్‌స్పేస్‌లు మూతపడడం, విమాన టికెట్ ఛార్జీలు పెరగడం, రూపాయి పతనంతో డాలర్లలోకి కన్వర్షన్ ఖర్చు పెరగడం ఇందుకు కారణం కావొచ్చు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) తాజా రిపోర్ట్ ప్రకారం, ఈ ఏడాది ఫిబ్రవరితో పోలిస్తే మార్చిలో భారతీయుల విదేశీ ప్రయాణ ఖర్చులు 212.43 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.2,030 కోట్లు) తగ్గి 1.09 బిలియన్ డాలర్లకు (సుమారు రూ.9,500 కోట్లకు) పరిమితమయ్యాయి.
ఈ ఏడాది జనవరిలో విదేశీ ప్రయాణాల కోసం 1.65 బిలియన్ డాలర్లు, ఫిబ్రవరిలో 1.3 బిలియన్ డాలర్ల మేర నిధులు విదేశాలకు వెళ్లగా, మార్చి నాటికి ఈ వ్యయం మరింత తగ్గడం గమనార్హం. కాగా, లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ (ఎల్‌ఆర్‌ఎస్) కింద జరిగిన మొత్తం విదేశీ నిధుల బదిలీ 2.59 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.24,864 కోట్ల)కు చేరగా, అందులో సింహభాగం ప్రయాణాలకే ఖర్చయింది.
హాలిడే ట్రిప్‌లు, క్రెడిట్ కార్డ్ సెటిల్‌మెంట్లు వంటివి ఉన్న ఇతర ప్రయాణాల కేటగిరీ కింద అత్యధికంగా 623.05 మిలియన్ డాలర్లు ఖర్చయ్యాయి. ఇది మొత్తం ప్రయాణ ఖర్చుల్లో దాదాపు 57 శాతానికి సమానం.
ఇతర ఖర్చులు
విదేశీ విద్య కోసం చేసి ప్రయాణాలు, హాస్టల్ ఖర్చులు, ఫీజుల కోసం 450.16 మిలియన్ డాలర్లు ఖర్చయ్యాయి. అంతర్జాతీయ బిజినెస్ పర్యటనలు, వైద్య చికిత్సలు, పుణ్యక్షేత్రాల సందర్శన కోసం మొత్తంగా 21.39 మిలియన్ డాలర్లు ఖర్చయ్యాయి.
విదేశాల్లో నివసిస్తున్న దగ్గరి బంధువుల నిర్వహణ,పోషణ కోసం మార్చిలో 389.78 మిలియన్ డాలర్లు బదిలీ అయ్యాయి. ఇది ఫిబ్రవరిలోని 266.18 మిలియన్ డాలర్ల కంటే ఎక్కువ. విదేశాలకు ప్రయాణించకుండా ఇక్కడి నుంచే కరస్పాండెన్స్ కోర్సులు లేదా ఆన్‌లైన్ విద్య అభ్యసించే 'స్టడీస్ అబ్రాడ్' విభాగంలో మార్చిలో 151.71 మిలియన్ డాలర్లు ఖర్చయ్యాయి.
ఇది జనవరి, ఫిబ్రవరి నెలల కంటే తక్కువ. మార్చిలో భారతీయులు విదేశీ ఈక్విటీ, డెట్ అసెట్స్‌లో 440.22 మిలియన్ డాలర్ల భారీ పెట్టుబడులు పెట్టారు. అయితే విదేశాలలో స్థిరాస్తుల (ఇళ్లు/భూములు) కొనుగోలు వ్యయం మాత్రం 38.68 మిలియన్ డాలర్లకు తగ్గింది.
గత ఆర్థిక సంవత్సరం (2024-25) మొత్తంలో ఎల్‌ఆర్‌ఎస్ కింద భారతీయులు 29.56 బిలియన్ డాలర్లను విదేశాలకు పంపగా, అందులో కేవలం ప్రయాణాల వాటానే గరిష్టంగా 16.96 బిలియన్ డాలర్లుగా నమోదైంది.
ఎల్‌ఆర్‌ఎస్ అంటే..
రిజర్వ్ బ్యాంక్ ఎల్‌ఆర్‌ఎస్ నిబంధనల ప్రకారం.. మైనర్లతో సహా భారతదేశంలో నివసించే ఏ వ్యక్తైనా ఒక ఆర్థిక సంవత్సరంలో (ఏప్రిల్-మార్చి) గరిష్టంగా 2,50,000 డాలర్ల వరకు విదేశాలకు ఉచితంగా పంపుకోవచ్చు. ఇంతకంటే ఎక్కువ పంపాలి అంటే ఆర్‌బీఐ అనుమతి ఉండాలి. చార్జీలు కట్టాలి.
ఈ స్కీమ్ కింద ప్రయాణాలు, విదేశాల్లో చదువులు, బంధువుల కోసం పంపడం, విదేశీ ఈక్విటీ/డెట్ మార్కెట్లలో పెట్టుబడులు వంటి వివిధ కేటగిరీల కింద నిధులను పంపొచ్చు. కంపెనీలు విదేశాల్లో ఇన్వెస్ట్ చేయాలంటే ఓవర్‌సీస్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ కింద ఫండ్స్‌ను ట్రాన్స్‌ఫర్ చేస్తాయి.
