తినడానికి తిండిలేక చీమలు తింటున్నారు

తినడానికి తిండిలేక చీమలు తింటున్నారు

భద్రాచలం, వెలుగుఛత్తీస్‌గడ్‌కు పక్కనే ఉన్న ఆంధ్రా–తెలంగాణ సరిహద్దుల్లో 208కి పైగా ఉన్న ఆదివాసీ గ్రామాల్లో 22 వేల మందికి పైగా గిరిజనులు జీవనం సాగిస్తున్నారు. వలస ఆదివాసీలు కావడంతో వారికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అందే సంక్షేమ పథకాలు అరకొరే. ప్రస్తుత కరోనా ఆపత్కాలంలో వారికి చేసుకుందామంటే కూలీ పనులు లేవు. చేతిలో పైసలు లేవు. తినేందుకు ఆహారం దొరకడం లేదు. దీంతో అడవుల్లో దొరికే దుంపలు, కాయలతోపాటు జిన్నె చెట్లపై ఉన్న ఎర్ర చీమలు, వాటి గుడ్లను సేకరించి ఆహారంగా తీసుకుంటున్నారు.

చీమలు కుడుతున్నా..

అడవుల్లో తిరుగుతున్నప్పుడు పుట్టెడు చీమలున్న చెట్ల కొమ్మలను ఈ గిరిజనులు నరుకుతుంటారు. ఓ పక్క చీమలు కుడుతున్నా నొప్పిని భరిస్తూ వాటిని గిన్నెల్లో నింపుతుంటారు. గిన్నెను ఆకుల్లో చుట్టి పొయ్యిలో బోర్లించి కాలుస్తారు. తర్వాత రొయ్యల కూరలా వండుతారు. వారు సాగుచేసుకున్న జొన్నలతో అంబలి చేసుకుని అందులో చీమల కూరను నంజుకుని తింటున్నారు. విచిత్రమైన ఈ చీమల కూరకు ఆదివాసీలు పెట్టుకున్న పేరు ‘చప్రాహ్‍’. ఎర్రచీమలతో పాటు వాటి గుడ్లను కలిపి చట్నీలా తయారు చేస్తారు. అప్పటికప్పుడు ఎండుమిర్చిని నానబెట్టి మెత్తగా నూరి అందులో చీమలను, వాటి గుడ్లను కలిపి చట్నీ చేస్తారు. వారు పండించిన పంట ఏడాదంతా సరిపోదు. వేరే ఉపాధి లేక ఆకలిని తట్టుకునేందుకు ఇలా చీమల్ని తింటున్నామని అంటున్నారు. భారీ వృక్షాలకు పట్టిన గండు చీమల గూళ్లను దులిపి వాటిలోని గుడ్లను సేకరించి పచ్చడిలా నూరుకుంటున్నారు. కొందరు ఎర్ర చీమల మిశ్రమంతో చారు కాచుకుంటున్నారు. అయితే.. ఈ ఆహారంలో ప్రొటీన్స్ కూడా ఎక్కువగా ఉంటాయని డాక్టర్లు సైతం చెబుతున్నారు.