రైతులను గోస పుచ్చుకుంటున్న రైస్​మిల్లుల యజమానులు

 రైతులను గోస పుచ్చుకుంటున్న రైస్​మిల్లుల యజమానులు

మిర్యాలగూడ, వెలుగు : ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు మద్దతు ధర ఇప్పించండని రైతన్నలు పోలీసులను వేడుకోవాల్సిన దుస్థితి దాపురించింది. సప్ప వడ్ల ధరలను కొన్ని రోజులుగా తగ్గిస్తూ వస్తున్న నేపథ్యంలో మిర్యాలగూడ మిల్లుల్లో తనిఖీలకు వచ్చిన పోలీసులకు అన్నదాతలు తమ బాధను చెప్పుకున్నారు. క్వాలిటీ వడ్లు తెచ్చినా సరైన ధర ఇవ్వడం లేదని, ధాన్యం తూకాల్లో మోసాలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సీజన్​ ప్రారంభంలో మంచి ధర ఇచ్చిన మిల్లర్లు క్రమంగా రేటు తగ్గించడంతో మంగళవారం మిర్యాలగూడ పోలీసులు.. మిర్యాలగూడ టౌన్​, రూరల్​, వేములపల్లి సహా ఇతర ప్రాంతాల్లోని రైస్​ మిల్లుల్లో తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా మిల్లర్లు సిండికేటై పచ్చగింజ, తాలు, ఇతర కొర్రీల పేరిట క్వింటాల్​ సన్న వడ్లకు రూ. 1900 నుంచి 1970‌‌, 1980 వరకు చెల్లిస్తూ దోచుకుంటున్నారని తేల్చారు.    

క్వింటాల్​కు రూ. 2 వేల కంటే తక్కువ 

సుమారు మూడు వారాల నుంచి మిర్యాలగూడ ప్రాంత రైస్​మిల్లులకు నల్గొండ, సూర్యాపేట జిల్లాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి రైతులు సన్న వడ్లను తీసుకువస్తున్నారు. మొదట్లో మెరుగైన ధర ఇచ్చిన మిల్లర్లు కొనుగోళ్లు ప్రారంభమైన వారం నుంచే  తగ్గిస్తూ వస్తున్నారు. ఈ దశలో పోలీస్​ఆఫీసర్ల ఆదేశాల మేరకు మంగళవారం మిర్యాలగూడ రూరల్​, పట్టణ సీఐలతో పాటు సుమారు 9 మంది ఎస్​ఐలు మిర్యాలగూడ పట్టణ, మండలంతో పాటు వేములపల్లి పరిధిలోని రైస్​మిల్లుల్లో తనిఖీలు చేశారు. రైతులతో మిల్లర్లు ఎంత ధర ఇస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. రైతులకు ఇచ్చిన రశీదులను పరిశీలించి...తక్కువ ధరకే కొంటున్నట్టు గుర్తించారు. ఆ  రశీదులను స్వాధీనం చేసుకుని స్టేషన్​కు రావాలని మిల్లర్లను ఆదేశించారు. మిర్యాలగూడ మండల పరిధిలోని అవంతీపురం శివారులో ఉన్న సూర్యతేజ రైస్​మిల్లులో సుమారు 24 మంది రైతులకు రూ. 1950 నుంచి 1980 వరకే చెల్లించినట్లు గుర్తించారు. అలాగే మిర్యాలగూడ, వేములపల్లి మండలాల పరిధిలో ఏర్పాటు చేసిన అన్ని రైస్ మిల్లుల్లో సన్న వడ్లకు రూ. 2 వేల లోపే ఇస్తున్నారని తెలుసుకున్నారు. ఖచ్చితంగా రూ.2 వేలకు పైనే ఇవ్వాలని చెప్పారు. క్వింటాల్​కు రూ.2 వేలకు తక్కువ ఇస్తే తమను సంప్రదించాలని రైతులకు సూచించారు. మరో పది రోజుల పాటు తనిఖీలు నిర్వహిస్తామన్నారు.  మిర్యాలగూడ నియోజకవర్గంతో పాటు నాగార్జున సాగర్​ పరిధిలోని రైస్​ మిల్లులను కూడా తనిఖీ చేసినట్లు చెప్పారు.  

ధాన్యం తూకాల్లోనూ మోసం ..!

రైస్ మిల్లులకు అనుసంధానంగా ఏర్పాటు చేసిన వేయింగ్ మెషీన్లు  లోడుకు 30 నుంచి 50 కిలోలు తక్కువగా జోకుతున్నట్టు ఆరోపణలున్నాయి. తాలు పేరిట లోడుకు 30 కిలోల తరుగు తీయడమే కాకుండా, వేబ్రిడ్జిలపై 50 కిలోల వరకు తగ్గిస్తూ రైతులను దగా చేస్తున్నారు. ఈ నెల 9,10 తేదీల్లో నల్గొండ జిల్లా లీగల్ మెట్రాలజీ ఆఫీసర్ రామకృష్ణ స్వయంగా మిల్లులను విజిట్​చేసి వే బ్రిడ్జిలను తనిఖీ చేశారు. తక్కువ జోకితే సహించేది లేదని హెచ్చరించారు. అయినా ఈ నెల 13న  మిర్యాలగూడ మండలం యాద్గార్ పల్లికి చెందిన సలికంటి శ్రీనివాస్ తన వడ్లను ఇదే ప్రాంతానికి చెందిన వాగ్దేవి రైస్ మిల్లుకు తీసుకువచ్చి కాంటా వేయించాడు. ఇక్కడ 8,460 కిలోలు రాగా రేటు కుదరక ఇదే ఏరియాలోని కల్యాణ్ రామ్ వే బ్రిడ్జి వద్ద కాంటా వేయిస్తే 8,490 కిలోలు వచ్చింది. 

ప్రతి సీజన్​లో ఇంతే 

ఈ ఖరీఫ్​ సీజన్​లో నల్గొండ జిల్లా వ్యాప్తంగా  4.79 లక్షల ఎకరాల వరి సాగు చేయగా 1.98 లక్షల ఎకరాల్లో సన్న రకాలు(చింట్లు, హెచ్​ఎంటీ, పూజలు, ఇతర వెరైటీ)లు వేశారు. 2.81 లక్షల ఎకరాల్లో దొడ్డు (1010, కేఎన్​ఎం 118,జేజీఎల్​ బతుకమ్మ) వడ్లు సాగు చేశారు. దొడ్డు రకం 7 లక్షల మెట్రిక్​ టన్నులు, సన్న రకం సుమారు 5 లక్షల మెట్రిక్​ టన్నుల మేరకు వచ్చే అవకాశం ఉందని ఆఫీసర్లు ప్రకటించారు. అయితే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా సాగైన సన్న వడ్లను మిర్యాలగూడ ప్రాంతంలోని రైస్​ మిల్లులకే తీసుకువస్తూ ఉంటారు. దీంతో ఇక్కడ క్వింటాల్​కు రూ.100 నుంచి రూ.200  వరకు ధర తగ్గిస్తూ మిల్లర్లు దోపిడీ చేస్తున్నారు. ప్రతి సీజన్​లో ఇదే తంతు జరుగుతోంది. 

స్వయంగా పోలీసులే రంగంలోకి ! 

మిర్యాలగూడ ప్రాంతంలో రైస్​ మిల్లులు ఎక్కువగా ఉండడంతో ఆయా ప్రాంతాలకు చెందిన రైతులు సన్న వడ్లను ఇక్కడి మిల్లులకు తీసుకువస్తుంటారు. గతంలో  మిల్లర్లు రేట్లు తగ్గించడం, సరైన టైంలో వడ్లను అన్​లోడ్​ చేసుకోకపోవడం, రైతులను ఇబ్బందులు పెడుతున్న నేపథ్యంలో అప్పటి ఎస్పీ ఏవీ రంగనాథ్ ​ఫీల్డ్ ​లెవెల్​లో పర్యటించి మిల్లుల్లో రికార్డులను పరిశీలించి రైతులకు సరైన ధర ఇప్పించారు. ఈసారి కూడా మిర్యాలగూడ పోలీస్ ​సబ్ డివిజనల్ ఆఫీసర్​ ఆదేశాల మేరకు తనిఖీలు చేసినట్టు పోలీస్ ​అధికారులు చెప్పారు. రైతులకు మెరుగైన ధర ఇప్పించే లక్ష్యంతో ఈ తనిఖీలు నిర్వహించామన్నారు. మిల్లర్లు నష్టపోకుండా, రైతుకు అన్యాయం జరగకుండా వడ్లకు ధర ఉండే విధంగా సూచనలు చేశామన్నారు.

 పోలీసులు తనిఖీ చేస్తుండ్రని రేటు ఇచ్చిన్రు 

మాది మిర్యాలగూడ మండలం యాద్గార్​పల్లి .ఇక్కడి ఏరియాకి వడ్లను అమ్ముకునేందుకు వచ్చిన. నిన్నటి దాకా క్వింటాల్​ వడ్లు రూ.1970 , అంతకు తక్కువే ఇచ్చిన్రు. మిల్లుల్లో పోలీసులు తనిఖీలు చేసి రైతులతో మాట్లాడుతుండ్రని తెలిసి కొద్దిగ మంచి రేటు ఇచ్చిన్రు. మొన్న వాగ్దేవి మిల్లుల కాంటా వేయిస్తే 30 కిలోలు తక్కువ తూకం చూపించింది. రైతులు మోస పోకుండా అధికారులు తనిఖీలు చేస్తనే ఉండాలె. అట్లయితనే వాళ్లకు భయం ఉంటది.  

–  సలికంటి శ్రీనివాస్

సన్నొడ్లకు ధర తక్కువ చేస్తే ఉద్యమిస్తం 

ఉమ్మడి నల్గొండ జిల్లాతో పాటు ఇతర ప్రాంతాల నుంచి రైతులు ఇక్కడి రైస్​ మిల్లులకు ధాన్యం తీసుకువస్తరు. క్వాలిటీ లేదని చెప్తూ క్వింటాల్​కు 
రూ. 1950, 1980 వరకే ఇస్తూ నష్టం చేస్తున్నరు. ఈ  విషయమై రైస్​మిల్లర్స్​అసోసియేషన్​ ప్రెసిడెంట్​ను కలిసి మాట్లాడినం. ధర తగ్గిస్తే ఉద్యమిస్తాం.  సీజన్​ ముగిసే వరకు క్వింటాల్​కు రూ. 2300  చెల్లించాలె. 

– మున్సిపల్​ కాంగ్రెస్​ ఫ్లోర్ లీడర్​ బత్తుల లక్ష్మారెడ్డి, మిర్యాలగూడ