- రాజకీయాల్లో కోటాతో అన్ని వర్గాలకూ అవకాశం: ఆక్స్‌ఫామ్ ప్రశంసలు
- ప్రపంచ రాజకీయాల్లో బిలియనీర్ల ఆధిపత్యం పెరిగిందని ఆందోళన
- రాజకీయంగా వారికి 4 వేల రెట్లు ఎక్కువగా అవకాశాలు ఉన్నాయని వెల్లడి
దావోస్: ప్రపంచ రాజకీయాల్లో బిలియనీర్ల ఆధిపత్యం పెరిగిపోతున్నదని ఆక్స్‌ఫామ్ సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. ఇది ప్రజాస్వామ్యానికే ప్రమాదమని హెచ్చరించింది. ఇలాంటి తరుణంలో సాధారణ పౌరులకూ రాజకీయ అవకాశాలు దక్కాలంటే, భారత్‌లోలాగా రాజకీయ రంగంలో రిజర్వేషన్లను ప్రపంచవ్యాప్తంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని సూచించింది. అన్ని వర్గాలకు సమాన అవకాశాలు దక్కాలంటే ఇండియా లాంటి రిజర్వేషన్ల సిస్టమ్ బెస్ట్ అని ప్రశంసించింది.
సోమవారం దావోస్‌లో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ మీటింగ్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా ‘‘రెసిస్టింగ్ ద రూల్ ఆఫ్ ది రిచ్: ప్రొటెక్టింగ్ ఫ్రీడమ్ ఫ్రమ్ బిలియనీర్ పవర్” పేరుతో ఆక్స్‌ఫామ్ రిపోర్టు విడుదల చేసింది. ఇందులో ప్రపంచ రాజకీయాల్లో పెరిగిపోయిన అసమానతలను, బిలియనీర్ల ఆధిపత్యాన్ని ఎత్తిచూపింది. సాధారణ పౌరుల కంటే బిలియనీర్లు రాజకీయ పదవులు చేపట్టే అవకాశం 4వేల రెట్లు ఎక్కువగా ఉందని తెలిపింది. అంటే సంపద నేరుగా పొలిటికల్ పవర్‌గా మారుతున్నదని అభిప్రాయపడింది.
రాజకీయంగా అన్ని వర్గాలకూ సమాన అవకాశాలు అందాల్సిన అవసరముందని పేర్కొంది. ఇందుకు భారత రాజకీయ వ్యవస్థ సరైన ఉదాహరణ అని తెలిపింది. ఇండియాలో రాజకీయ రంగంలో అమలు చేస్తున్న రిజర్వేషన్ల సిస్టమ్‌తో సాధారణ ప్రజలకూ రాజకీయ అవకాశాలు దక్కుతున్నాయని చెప్పింది.
‘‘ఇండియాలో పొలిటికల్ రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీలతో పాటు ఇతర అణగారిన వర్గాలకు రాజకీయంగా అవకాశాలు కల్పిస్తున్నారు. దీంతో వెనుకబడిన వర్గాల ప్రజలకు కూడా చట్టసభల్లో ప్రాతినిధ్యం, పాలసీల రూపకల్పనలో భాగస్వామ్యం దక్కుతున్నది” అని రిపోర్టులో పేర్కొంది. అలాగే బ్రెజిల్‌లో ప్రజల భాగస్వామ్యంతో బడ్జెట్ రూపొందించడాన్ని ప్రశంసించింది.
12 మంది దగ్గరే అంత సంపద..
బిలియనీర్ల సంపద ఏటికేడు పెరిగిపోతున్నదని ఆక్స్‌ఫామ్ తెలిపింది. ప్రపంచ బిలియనీర్ల సంపద 2025లో 16.2% పెరిగి 18.3 ట్రిలియన్ డాలర్లకు చేరుకున్నదని వెల్లడించింది. ఇది గత ఐదేండ్ల సగటు వృద్ధి కంటే మూడు రెట్లు ఎక్కువని పేర్కొంది.
ప్రపంచంలోని టాప్ 12 మంది బిలియనీర్ల వద్ద ఉన్న సంపద.. ప్రపంచ జనాభాలో సగం మంది (దాదాపు 400 కోట్ల మంది) వద్ద ఉన్న మొత్తం సంపద కంటే ఎక్కువని చెప్పింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకొచ్చిన పన్ను తగ్గింపులు, నిబంధనల సరళీకరణ వంటివి ప్రపంచవ్యాప్తంగా ధనికులకు మరింత లాభం చేకూర్చాయని పేర్కొంది.
