తెలంగాణకు ఆక్సిజన్ వచ్చేసింది

తెలంగాణకు ఆక్సిజన్ వచ్చేసింది
  • ఒడిశా నుంచి రాష్ట్రానికి 5 ట్యాంకర్లు
  • దేశవ్యాప్తంగా పెరిగిన ఆక్సిజన్ ఉత్పత్తి
  • విదేశాల నుంచి కూడా అందుతున్న సాయం
  • అన్ని రాష్ట్రాలకు రైళ్లు, ఆర్మీ విమానాల ద్వారా సప్లై

న్యూఢిల్లీ/హైదరాబాద్, వెలుగు: మెడికల్ ఆక్సిజన్ కొరత నుంచి తెలంగాణతో పాటు దేశంలోని అన్ని రాష్ట్రాలూ నెమ్మదిగా గట్టెక్కుతున్నాయి. ఆక్సిజన్‌ తీసుకొచ్చేందుకు ఈ నెల 23న మన రాష్ట్రం నుంచి సీ–17 యుద్ధ విమానాల్లో ఒడిశాకు వెళ్లిన 9 ట్యాంకర్లలో ఐదు ట్యాంకర్లు సోమవారం తిరిగి వచ్చేశాయి. ఈ ట్యాంకర్లు 80 టన్నుల ఆక్సిజన్‌ను తీసుకొచ్చాయి. హైదరాబాద్‌ కింగ్ కోఠిలోని జిల్లా ఆస్పత్రి, గచ్చిబౌలిలోని టిమ్స్‌ హాస్పిటల్‌, చెస్ట్ హాస్పిటల్, కరీంనగర్‌ జిల్లా ఆస్పత్రి, ఖమ్మం జిల్లా ఆస్పత్రులకు ఈ ఆక్సిజన్‌ను తరలించారు. మంగళవారం మరో 4 ట్యాంకర్లు 70 టన్నుల ఆక్సిజన్ తీసుకురానున్నాయి. శుక్రవారం యుద్ధ విమానాల్లో ఒడిశాకు చేరుకున్న ట్యాంకర్లు అంగుల్‌‌‌‌, రూర్కెలా స్టీల్‌‌‌‌ ప్లాంట్లలో ఆక్సిజన్ నింపుకొని.. తిరిగి రోడ్డు మార్గంలో రాష్ట్రానికి వచ్చాయి. కాగా, రాష్ర్టంలోని ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటళ్లలో కరోనా పేషెంట్ల సంఖ్య 20 వేలు దాటింది. వీళ్లకు రోజూ 270 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌‌‌‌ వినియోగిస్తున్నారు. మరోవైపు దేశవ్యాప్తంగా ఆక్సిజన్ కొరతను తీర్చేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే అన్ని పరిశ్రమల్లోనూ ఇండస్ట్రీయల్ అవసరాలను పక్కన పెట్టి, మెడికల్ ఆక్సిజన్‌‌‌‌నే ఉత్పత్తి చేయాలని ఆదేశించింది. అలాగే మన దేశం ఎదుర్కొంటున్న క్రైసిస్‌‌‌‌లో అండగా విదేశాలు సైతం ముందుకొస్తున్నాయి. అనేక దేశాలు తమ వంతు సాయంగా లిక్విడ్ ఆక్సిజన్‌‌‌‌ను పంపుతున్నాయి. ఇలా వేర్వేరు సోర్సెస్ ద్వారా వస్తున్న ఆక్సిజన్‌‌‌‌ను దేశంలోని అన్ని రాష్ట్రాలకు రైళ్లు, ఆర్మీ విమానాల ద్వారా సప్లై చేస్తున్నారు.
ఆందోళన వద్దు: కేంద్రం 
దేశంలో కావాల్సినంత ఆక్సిజన్ ఉందని కేంద్ర హోం శాఖ వెల్లడించింది. ప్రజలు ఆందోళన చెందవద్దని చెప్పింది. ఆక్సిజన్ ను ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రాల నుంచి అవసరమున్న ప్రాంతాలకు తరలించడమే ప్రస్తుతమున్న సమస్యని, ప్రతి ఒక్కరి సాయంతో దీన్ని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సాయంతో వీలైనంత త్వరగా ఆక్సిజన్ ను తరలిస్తున్నామని చెప్పింది. ఆక్సిజన్ ట్యాంకర్ల రవాణాను జీపీఎస్ సిస్టమ్ తో పరిశీలిస్తున్నామంది. 
వేదాంత స్టెరిలైట్ రీఓపెన్
తమిళనాడులో ఆక్సిజన్ కొరత ఉండటంతో ఆ రాష్ట్ర సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. తూత్తుకుడిలోని వేదాంత స్టెరిలైట్ ప్లాంట్ ను 4 నెలలు తాత్కాలికంగా తెరిచేందుకు పర్మిషన్ ఇచ్చింది. అందులో ఆక్సిజన్ మాత్రమే ఉత్పత్తి చేయాలంది. కాలుష్యం వెదజల్లుతోందనే కారణంతో వేదాంత స్టెరిలైట్ ప్లాంట్ ను ప్రభుత్వం 2018లో మూసేసింది.
మహారాష్ట్రకు మరో 44 టన్నుల ఆక్సిజన్
గుజరాత్​లోని జామ్​నగర్ నుంచి ముంబైలోని కలంబొలికి సుమారు 44 టన్నుల లిక్విడ్ ఆక్సిజన్ ఉన్న 3 ట్యాంకర్లతో ట్రైన్ చేరుకుంది. ఆ రాష్ట్రానికి చేరుకున్న రెండో ఆక్సిజన్ ట్రైన్ ఇది. ఏప్రిల్ 23న ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం నుంచి 7 లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంకర్లతో తొలి ఆక్సిజన్ ట్రైన్ మహారాష్ట్ర వెళ్లింది. అలాగే రాయ్​గఢ్‌‌‌‌లోని జిందాల్‌‌‌‌ స్టీల్‌‌‌‌ ప్లాంట్‌‌‌‌ నుంచి 70 టన్నుల సామర్థ్యమున్న ట్యాంకర్లతో ఆక్సిజన్‌‌‌‌ ఎక్స్‌‌‌‌ప్రెస్‌‌‌‌ రైలు ఆదివారం రాత్రి బయలుదేరింది.    
551 జిల్లాల్లో ఆక్సిజన్ ప్లాంట్లు
ఆక్సిజన్‌‌‌‌ ఉత్పత్తి ప్లాంట్లను దేశవ్యాప్తంగా 551 జిల్లాల్లో నెలకొల్పుతామని కేంద్రం ప్రకటించింది. ఇందుకు పీఎం కేర్స్‌‌‌‌ ఫండ్‌‌‌‌ నుంచి నిధులను విడుదల చేస్తామని చెప్పింది. 168 ఆక్సిజన్‌‌‌‌ పాంట్ల ఏర్పాటు కోసం పీఎం కేర్స్‌‌‌‌ ఫండ్‌‌‌‌ నుంచి ఈ ఏడాది రూ. 201 కోట్లు విడుదల చేసినట్లు కేంద్రం గుర్తు చేసింది.
ఘజియాబాద్ గురుద్వారా ఆక్సిజన్ లాంగర్
ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ గురుద్వారా ఆక్సిజన్ లాంగర్ ను ప్రారంభించింది. ఇందిరాపురంలోని గురుద్వారా సమితి రోజూ అన్న‌‌‌‌ప్ర‌‌‌‌సాద లాంగ‌‌‌‌ర్ నిర్వ‌‌‌‌హించ‌‌‌‌డానికి బ‌‌‌‌దులు ఆక్సిజన్ లాంగర్ ప్రారంభించింది. గురుద్వారా సమితి బృందం ఇంటింటికి తిరుగుతూ సిలిండర్లు అవ‌‌‌‌స‌‌‌‌ర‌‌‌‌మైన వారు గురుద్వారాకు రావాల‌‌‌‌ని చెబుతోంది. గురుద్వారా వద్దకు వచ్చి వాళ్లకూ ఆక్సిజన్ అందిస్తోంది. ఇప్పటివరకు 250 కరోనా రోగులకు సహాయం చేసింది. 
ఉడుపి జిల్లాలో తొలి ఆక్సిజన్ రీఫిల్లింగ్ ప్లాంట్
కర్నాటకలోని ఉడుపి జిల్లాలో తొలి ఆక్సిజన్ రీఫిల్లింగ్ ప్లాంట్ ను బేలాపు వద్ద ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచి ఇండస్ట్రియల్, మెడికల్ ఆక్సిజన్ సిలిండర్లను నింపి సరఫరా చేయనున్నారు. మణిపాల్​కు చెందిన ఎస్ఎన్ క్రయోజెనిక్స్ ఈ ప్లాంట్​ను ఏర్పాటు చేసింది. 20 వేల క్యూబిక్ మీటర్ల ఆక్సిజన్ ను ఈ ప్లాంట్ స్టోర్ చేసుకోగలదు.  
స్టీల్ ప్లాంట్ల నుంచి టన్నుల కొద్దీ సరఫరా
దేశంలో ఆక్సిజన్‌‌ కొరత ఏర్పడటంతో స్టీల్‌‌ కంపెనీలను ఆక్సిజన్‌‌ సరఫరా చేయాలని కేంద్రం కోరింది. దీంతో స్టీల్‌‌ అథారిటీ ఆఫ్‌‌ ఇండియా తమ ఆధీనంలోని 5 ప్లాంట్ల నుంచి వేల టన్నుల లిక్విడ్‌‌ మెడికల్‌‌ ఆక్సిజన్‌‌ను సరఫరా చేసింది. 5 రోజులుగా రోజూ 600 టన్నుల చొప్పున ఆక్సిజన్‌‌ను అందించింది. టాటాస్టీల్‌‌ రోజుకు 200 నుంచి 300 టన్నులు, ఆర్సెలర్‌‌ మిట్టల్‌‌ 200 టన్నుల మెడికల్‌‌ ఆక్సిజన్‌‌ను సరఫరా చేస్తున్నాయి. మహారాష్ట్రకు 100 టన్నుల ఆక్సిజన్‌‌ను ఫ్రీగా ఇస్తామని రిలయన్స్‌‌ ఇండస్ట్రీస్ ప్రకటించింది. మధ్యప్రదేశ్‌‌లోని ఇండోర్‌‌కు 60 టన్నుల ఆక్సిజన్‌‌ను పంపామంది.  
అమెరికా నుంచి కాన్సంట్రేట‌‌ర్లు
అమెరికా నుంచి 318 ఆక్సిజన్ కాన్సంట్రేట‌‌ర్లు సోమవారం మన దేశానికి  చేరుకున్నాయి. ఈ మేరకు కేంద్రమంత్రి మినిస్టర్ హర్దీప్ సింగ్ పూరీ ట్వీట్ చేశారు.
సరికొత్త ఆక్సికాన్‌‌ మెషీన్
దేశంలో ఆక్సిజన్‌‌ కొరత తీవ్రంగా ఉండటంతో భోపాల్‌‌ లోని ఇండియన్‌‌ ఇనిస్టిట్యూట్‌‌ ఆఫ్‌‌ సైన్స్‌‌ ఎడ్యుకేషన్‌‌ అండ్‌‌ రీసెర్చ్‌‌ పరిశోధకులు కొత్త ఆక్సిజన్‌‌ తయారీ మెషీన్​ను అభివృద్ధి చేశారు. పరిసరాల్లోని గాలిని తీసుకొని శుద్ధి చేసి 93-95 శాతం స్వచ్ఛమైన ఆక్సిజన్‌‌ను ఈ పరికరం అందిస్తుందని చెప్పారు. దీనికి ఆక్సికాన్‌‌ అని పేరు పెట్టారు. రేటు రూ. 20 వేలు.  
సౌదీ నుంచి 80 టన్నులు
మెడికల్  ఆక్సిజన్ సరఫరాకు అవసరమైన 2 ట్యాంకర్లను దుబాయ్ నుంచి తీసుకొస్తున్నామని కేంద్రం వెల్లడించింది. ఇందుకోసం ఐఏఎఫ్‌‌ సీ17 విమానం దుబాయ్‌‌ చేరుకుందని ట్వీట్ చేసింది. 4 క్రయోజెనిక్ ట్యాంకుల్లో 80 టన్నుల ఆక్సిజన్ ఇండియాకు బయలుదేరింది.