ఆక్సిజన్ అందక కొవిడ్ పేషెంట్స్ ప్రతిరోజూ వేల సంఖ్యలో చనిపోతున్నారు. కొవిడ్ సంక్షోభకాలంలో ఎంతోమంది మంచి మనసుతో ముందుకు వచ్చి ప్రజల ప్రాణాలు కాపాడుతున్నారు. వాళ్లలో ఒకడు ఈ ‘ఆక్సిజన్ మ్యాన్’. ముంబయి నగర ప్రజలు ఇప్పుడు ‘ఆక్సిజన్ మ్యాన్’ అని ఆప్యాయంగా పిలుస్తున్న ఇతని పేరు ‘షానవాజ్ షేక్’. అతనొక వ్యాపారి. నిన్నటి దాకా విలాసవంతమైన కారులో తిరిగేవాడు. ముంబయిలో ప్రబలిన కొవిడ్ మహమ్మారికి జనం పిట్టల్లా రాలిపోతున్నారు. జనం ఎవరిళ్లలోవాళ్లు తలదాచుకుంటున్నారు. ఊపిరాడక, దవాఖానల్లో బెడ్స్ దొరక్క జనం సాయం కోసం ఎదురుచూస్తున్నారక్కడ. అలాంటి వాళ్ల కోసం షానవాబ్ ఆక్సిజన్ సిలిండర్స్‌ని ఫ్రీగా ఇస్తున్నాడు. ప్రాణ వాయువు దొరికితే చాలు, పది హాస్పిటల్స్ తిరిగి అయినా బెడ్ సంపాదించుకోవచ్చు. కానీ ఆక్సిజన్ లేకపోతే డాక్టర్ దాకా కూడా పోలేని పరిస్థితి. సంపన్నులకు కూడా ఆక్సిజన్ దొరకని గడ్డు పరిస్థితుల్లో పేదలకి, ఎవరూ తోడులేనివారికి ఎవరు సాయ పడతారు? ఇంత దయనీయ స్థితిలో పేదలు చనిపోతుంటే షానవాజ్ చలించిపోయాడు. ఆ టైంలో తన చేతుల్లో పెద్దమొత్తంలో డబ్బులేదు. అయినా సరే ప్రాణవాయువు కోసం పాట్లు పడుతున్న పేదలకు తనవంతు సాయం చేయాలనుకున్నాడు. తనకున్న ఖరీదైన ఎస్యూవీ కారును అమ్మిండు. ఆ డబ్బుతో 160 ఆక్సిజన్ సిలిండర్స్ కొనుగోలు చేసిండు. వాటిని పేదలకే కాదు, ఆక్సిజన్ అవసరం ఉన్న ఎవరొచ్చినా ఆక్సిజన్ సిలిండర్ ఫ్రీగా ఇస్తున్నాడు. ఎక్కడో బస్తీలో దూరంగా ఉండేవాళ్లు, వచ్చి తీసుకుపోవడానికి సాయపడే మనిషి లేనివాళ్లు కూడా ఉంటారు. ఎలా రావాలో? ఎలా తీసుకుపోవాలో తెలియని వాళ్లుంటారని షానవాజ్ గుర్తించి ఓ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసిండు. ముంబయి నగరంలో నుంచి ఎక్కడివాళ్లైనా ఈ కంట్రోల్ రూమ్‌కి సమాచారమిస్తే ఆక్సిజన్ తీసుకోవాలంటే ఏం చేయాలి (డాక్టర్ ప్రిస్క్రీప్షన్), ఎలా రీచ్ అవ్వాలో చెబుతారు. రాలేని స్థితిలో ఉన్నవాళ్ల దగ్గరకే పోయి ఈ టీమ్ సభ్యులు ఆక్సిజన్ సిలిండర్‌ని ఇస్తున్నారు. మానవత్వంతో ఎంతోమంది ప్రాణాలు కాపాడుతున్న షానవాజ్ ఈమధ్య ఒక బాధాకరమైన సంఘటన చూసి ఈ నిర్ణయం తీసుకున్నాడు. తన స్నేహితుడి భార్య గర్భవతి. ఆమెకు కరోనా సోకింది. ఆమెను హాస్పిటల్‌కి తీసుకుపోయారు. ఎక్కడా చేర్చుకోలేదు. చివరికి ఆక్సిజన్ అందక చనిపోయింది. హాస్పిటల్లో ట్రీట్ మెంట్ లేకున్నా కనీసం ఆక్సిజన్ అందించినా ఆమె బతికేది. తన స్నేహితుడి దుఃఖం చూసి షానవాజ్ చలించిపోయాడు. ఇలాంటి కష్టం మరొకరికి రాకూడదని ఆక్సిజన్ సిలిండర్స్‌ని అవసరమైన వాళ్లకు ఇవ్వడానికి నిర్ణయించుకున్నాడు. అతను చేసిన మంచి పని ఇప్పటికే వందల మంది ప్రాణాలు కాపాడింది. అందుకే ముంబయి ప్రజలు షానవాజ్‌ని ‘ఆక్సిజన్ మ్యాన్’ అని పిలుస్తున్నారు.
