పండితులు, పామరులనే కాదు చదివితే సామాన్యులను కూడా సులువుగా ఆకర్షించగలదు ఈ భక్తి, తత్త్వ కవిత్వం సంచిక. సరళమైన పద్యాలు, కీర్తనలు, తత్త్వాలు, భజనల రూపంలో భగవంతుని మీద భక్తి కేంద్రంగా రూపుదిద్దుకుంది ఈ పుస్తకం. ఆయా కాలాల్లో శైవ, వైష్ణవంగా వచ్చిన ఈ కవిత్వం గొప్పతనం, మన తెలుగు కవులు, ఇతర కవులు భక్తితత్వాన్ని నాడు ఉద్యమరూపంలో ప్రచారం చేసిన తీరు, చరిత్ర అంతా ఈ పుస్తకంలో నిక్షిప్తమై ఉంది. అప్పట్లో భక్తి కవులు తాము ఉంటున్న ప్రాంతాల్లోనో, దేవాలయాల్లోనో చేరి వారి భక్తి భావాన్ని చాటారు.
తత్త్వ కవులు ఆయా ప్రాంతాల్లో సంచారం చేస్తూ.. బతుకులోని డొల్లతనాన్ని చూపుతూనే చేరుకోవాల్సిన దైవ ముక్తి మార్గాన్ని ప్రచారం చేశారు. అంతిమంగా వీరి ధ్యేయం ఒక్కటే.. మానవ శ్రేయస్సు! అదే విధంగా నాటి మూఢాచారాలు, మత విద్వేషాలు, కుల వివక్ష పట్ల శైవ భక్తి కవిత్వం నిరసించినంతగా వైష్ణవ భక్తి కవిత్వం కృషి చేయలేకపోయిందని ఈ సంచిక మనకు తెలియజేస్తుంది. భక్తి,- తత్త్వ కవిత్వాలకు అర్థాలు, భావాలను ఉదాహరణలతో సహా 6 ప్రకరణలుగా చేసి, పరిశోధనాత్మకంగా వివరించారు రచయిత.
మొదటి ప్రకరణంలో తెలుగు భాషలో వెలువడిన భక్తి సాహిత్యాన్ని శ్రీనాథ, ప్రబంధ, దక్షిణాంధ్ర యుగాలుగా కూర్చి, శ్రీనాథుడు, పోతన, క్షేత్రయ్య, త్యాగయ్య, వేమన, భద్రాచలరామదాసు లాంటి ప్రముఖ కవులు భక్తిరస రచనలను ఎలా చేశారో చెప్పారు.
రెండో ప్రకరణంలో తెలుగు భక్త కవులపై ప్రభావం చూపిన తమిళ, కన్నడ, ఒరియా, బెంగాలి, హిందీ, మరాఠీ భాషల్లోని భక్తి సాహిత్యాన్ని విశ్లేషించారు.
మూడో ప్రకరణంలో తెలుగు సాహిత్యంలో భక్తి, తత్వ కవితలు అనేవి కేవలం దైవారాధనకు మాత్రమే పరిమితం కాలేదు. కుల వివక్షను ఎదిరించడం, సమానత్వాన్ని కోరడం, పీడితుల పక్షాన నిలవడం కోసం బలమైన సామాజిక సంస్కరణ, రాజకీయ చైతన్యాన్ని ప్రతిబింబించాయని తెలిపారు.
తెలుగు సాహిత్యంలో స్వీయ భక్తి మార్గానికి చెందిన కవులు దేవుడిని తమలో ఒకరిగా భావించి రచనలు చేశారు. వీళ్లలో ‘స్వీయ భక్తిమార్గానికి చెందిన కవులు’ అనే నాలుగో ప్రకరణంలో పోతన, త్యాగరాజు, క్షేత్రయ్య, భక్త రామదాసు (కంచర్ల గోపన్న).. వీరు భగవంతునిపై అచంచలమైన విశ్వాసంతో, స్వార్థం లేని భక్తిని ప్రదర్శించిన తీరును విశదీకరించారు.
‘సంస్కరణకు, యోగానికి ప్రాధాన్యమిచ్చిన కవులు’ అనే అయిదో ప్రకరణంలో వేమన, వీరబ్రహ్మం, సిద్ధప్ప అనే ప్రజాకవులు నాటి సామాజిక దురాచారాలను ఎలా ఖండించారు? దానికి యోగాన్ని ప్రాతిపదికగా ఎలా వాడుకున్నారో.. వివరించారు.
ఇక చివరి ప్రకరణమైన ‘భక్తి, తత్త్వకవులు- సామాజిక ప్రయోజనం’లో కేవలం ఆధ్యాత్మిక చింతనలోనే కాకుండా, సమాజంలో పేరుకుపోయిన దురాచారాలను, అవినీతి, అజ్ఞానాలను తమ కవిత్వం ద్వారా ప్రశ్నించి సంస్కరించడానికి ప్రయత్నించిన కవులు, వాళ్లు సాధించిన సామాజిక ప్రయోజనాలను చాటి చెప్పారు.ఇలా కవిత్రయ యుగం నుంచి దక్షిణాంధ్ర యుగం వరకు.. సాగిన ప్రసిద్ధ కవుల రచనల్లో భక్తి సాహిత్యాన్ని, ఇతర సామాజికాంశాలతో కూడిన విపుల పరిశోధన సారాన్ని రచయిత ఈ గ్రంథం ద్వారా మనకందించారు.
- పి. రాజ్యలక్ష్మి
లైఫ్& లిటరేచర్ పేజీకి వ్యాసాలు పంపాల్సిన మెయిల్ ఐడీ
featureseditor@v6velugu.com
