1.19 కోట్ల టన్నుల ధాన్యం ఉత్పత్తి..65 లక్షల టన్నుల సేకరణకు చర్యలు : సీఎస్ సంజయ్ జాజు

1.19 కోట్ల టన్నుల ధాన్యం ఉత్పత్తి..65 లక్షల టన్నుల సేకరణకు చర్యలు : సీఎస్ సంజయ్ జాజు
  • వానాకాలం వడ్ల కొనుగోళ్లకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి
  • రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోళ్లు: సీఎస్ సంజయ్ జాజు

హైదరాబాద్, వెలుగు: వానాకాలం సీజన్‌‌ వడ్ల కొనుగోళ్లకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సీఎస్​ సంజయ్  జాజు ఆదేశించారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా కొనుగోళ్లు సజావుగా జరిగేలా అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని సూచించారు. ఈ సీజన్‌‌లో రాష్ట్రంలో 57.7 లక్షల ఎకరాల్లో వరి సాగవగా, 119.57 లక్షల టన్నుల వడ్లు ఉత్పత్తి అవుతాయని అంచనా వేసినట్లు తెలిపారు. ఇందులో 65 లక్షల టన్నుల వడ్లు కొనుగోలు చేసేందుకు కార్యాచరణ రూపొందించినట్లు వెల్లడించారు. వడ్ల కొనుగోళ్ల ఏర్పాట్లపై సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో సీఎస్  గురువారం సచివాలయంలో సమావేశం నిర్వహించారు.

గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఈసారి కొనుగోలు ప్రక్రియను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా 8,283 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఐకేపీ, పీఏసీఎస్, ఇతర ఏజెన్సీల సమన్వయంతో కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అక్టోబర్  నుంచి కొనుగోలు కేంద్రాలకు వడ్లు వచ్చే అవకాశం ఉందని, ముందుగానే అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. రవాణా, హమాలీల ఏర్పాటు, గోదాములు తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు అవసరమైన సౌలతులు కల్పించాలని సూచించారు.

రైతుల వివరాల నమోదు..

వడ్లు అమ్మేందుకు కొనుగోలు కేంద్రాలకు వచ్చే ప్రతి రైతుకు ప్రత్యేక గుర్తింపు సంఖ్య కేటాయించాలని సీఎస్  సూచించారు. రైతుల ఆధార్  వివరాలను చెల్లింపుల కోసం ఉపయోగించే బ్యాంకు ఖాతాతో అనుసంధానం చేసే ప్రక్రియను సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు. వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్, వ్యవసాయ శాఖ డైరెక్టర్  గోపి, విజిలెన్స్  అండ్  ఎన్‌‌ఫోర్స్‌‌మెంట్  డైరెక్టర్  జనరల్  డీఎస్  చౌహాన్, పౌరసరఫరాల శాఖ కమిషనర్  స్టీఫెన్ రవీంద్ర, రవాణా శాఖ కమిషనర్  ఇలంబర్తి పాల్గొన్నారు.