- ఇప్పటికే 2.51 లక్షల టన్నులు దాటిన కొనుగోళ్లు
- వడ్ల సేకరణకు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్న సివిల్ సప్లయ్స్ శాఖ
- ఈ సీజన్‌లో 8,409 సెంటర్ల ద్వారా సేకరణ
- యాసంగి పంట కొనుగోళ్ల టార్గెట్ 90 లక్షల టన్నులు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో యాసంగి ధాన్యం కొనుగోళ్లు ఊపందుకుంటున్నాయి. ముందస్తుగా సాగైన జిల్లాల్లో ధాన్యం మార్కెట్‌కు వస్తున్న నేపథ్యంలో కొనుగోళ్లు చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా 8,409సెంటర్లు ప్రారంభించాలని సివిల్ సప్లయ్స్ శాఖ నిర్ణయించగా, ఇప్పటికే 3,310కి పైగా సెంటర్లు ఓపెన్ చేశారు.
యాసంగిలో పెద్ద ఎత్తున ధాన్యం సెంటర్లకు వచ్చే అవకాశం ఉండడంతో ముందస్తు కోతలు షురూ అయిన నిజామాబాద్, కామారెడ్డి, నల్గొండ, సూర్యాపేట, జనగామ, మెదక్ తదితన ఆరు జిల్లాల్లో ధాన్యం కొనుగోలు సెంటర్లు ప్రారంభించారు. సివిల్ సప్లయ్స్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ముందస్తు ఏర్పాట్లపై సమావేశాలు నిర్వహించి, జిల్లా జాయింట్ కలెక్టర్లు, సివిల్ సప్లయ్స్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో జిల్లా అధికారులు ఆయా జిల్లాల్లో పరిస్థితులకు అనుగుణంగా కొనుగోలు సెంటర్లు ప్రారంభించి పర్యవేక్షిస్తున్నారు.
2.51 లక్షల టన్నుల వడ్లు కొన్నరు..
పలు గ్రామాల్లో ఇప్పటికే ఏర్పాటు చేసిన సెంటర్ల ద్వారా 25 వేల మంది రైతుల నుంచి 2.51 లక్షల టన్నుల ధాన్యం కొనుగోళ్లు జరిగాయి. ఇందులో సన్న ధాన్యం 1.59 లక్షల టన్నులు కాగా, దొడ్డు బియ్యం 91 వేల టన్నులు సేకరించారు. రోజుకు 50 వేల టన్నుల వరకు కొనుగోళ్లు జరుగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ధాన్యానికి సంబంధించిన పేమెంట్లు కూడా ప్రారంభమయ్యాయి. కొన్న ధాన్యం కొన్నట్లే సెంటర్ల నుంచి వాహనాల ద్వారా తరలిస్తున్నారు.
వరి కోతలు ప్రారంభమైన ప్రాంతాల్లో కొనుగోళ్లు ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్నాయి. ఈ నెలాఖరు వరకు ధాన్యం కొనుగోళ్లు మరింత వేగంగా జరగనున్నాయి. సివిల్ సప్లయ్స్ యంత్రాంగం ప్రతి రోజు జిల్లా అధికారుల నుంచి నివేదికలు తెప్పించుకుని ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయో పరిశీలించి పరిష్కరించేందుకు చర్యలు చేపడుతున్నారు. కొనుగోళ్ల బాధ్యతలు నిర్వహిస్తున్న జిల్లా అదనపు కలెక్టర్, సివిల్ సప్లయ్స్శాఖ అధికారులు కొనుగోళ్లుకు సంబంధించి క్షేత్రస్థాయి అధికారులను అప్రమత్తం చేస్తున్నారు.
ఈ యేడు సెంటర్లకు 90 లక్షల టన్నులు వస్తుందని అంచనా..
యాసంగిలో గతంలో ఎన్నడూ లేని విధంగా 64.11 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. దీంతో యాసంగి వరి ధాన్యం 1.43 కోట్ల టన్నుల దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. సాగైన వరిలో 60 శాతం వరకు దొడ్డు రకాలే సాగు చేసినట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో దాదాపు 90 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు సెంటర్లకు వచ్చే అవకాశం ఉందని సివిల్ సప్లయ్స్ శాఖ అంచనా వేస్తోంది. 52 లక్షల టన్నుల ధాన్యం సేకరణకు కేంద్రం అనుమతించింది. మార్కెట్‌కు వస్తున్న ధాన్యంలో ఎక్కువ శాతం దొడ్డు రకం వడ్లు ఉంటున్నాయని అధికారులు చెబుతున్నారు.

